గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ..
సూళ్లూరుపేట రూరల్ (తిరుపతి జిల్లా): పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ 12 ఏళ్ల బాలిక చేపట్టిన కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ‘‘సేవ్ వాటర్.. సేవ్ అగ్రికల్చర్.. సేవ్ సాయిల్..’’ నినాదంతో సూళ్లూరుపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని గీతిక ఇప్పటివరకు లక్ష మొక్కలను నాటడం గమనార్హం. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
సొంత ఖర్చులతో ఓపిగ్గా..
గీతిక తండ్రి వెంకటేషన్ రైల్వే ఉద్యోగి కాగా తల్లి భారతి సచివాలయంలో మహిళ పోలీసుగా పని చేస్తున్నారు. సూళ్లూరుపేటలోని సాయినగర్‌లో నివసించే గీతికకు చిన్నతనం నుంచే పర్యావరణంపై మక్కువ ఏర్పడింది. గత నాలుగేళ్లుగా సొంత డబ్బులతో యాదముడి ఇంటిగ్రేటెడ్ రూరల్, అర్బన్ డెవలప్‌మెంట్ సొసైటీ పేరుతో మొక్కలను నాటుతోంది.
భూతాపం నుంచి భూమిని కాపాడి పర్యావరణాన్ని రక్షించేందుకు మొక్కలను నాటుదామంటూ పాఠశాలలు, గ్రామాల్లో విద్యార్థులు, రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఓపిగ్గా గంటల తరబడి ప్లకార్డులతో నిలుచుని తన లక్ష్యం దిశగా సాగుతోంది. పల్లెలే కాకుండా చెన్నై లాంటి మహా నగరంలోనూ గీతిక చేసిన ప్రయత్నాలను అభినందిస్తూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రకటించారు. తమ కుటుంబానికి ఆర్థికంగా భారమే అయినప్పటికీ ఆ చిన్నారి ప్రయత్నాలకు తల్లిదండ్రులు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
చెన్నై ప్రాంతంలో ప్లకార్డులతో గంటల కొద్ది నిలబడి అవగాహన కల్పిస్తున్న బాలిక
గీతిక సాధించిన అవార్డులు
బెంగళూరు, బిహార్, హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జీఓలు, సామాజిక సేవా సంస్థల నుంచి పలు అవార్డులు.
2020 చైల్డ్ ఎన్విరాన్‌మెంట్ అవార్డు, యంగ్ క్లైమేట్ యాక్టివిస్ట్ అవార్డు
2021లో గ్లోబల్ కిడ్ అచీవర్ అవార్డు, ఇండియన్ ఐకాన్ అవార్డు, ఫేమ్ ఐకాన్ అవార్డు
2022లో సూళ్లూరుపేట ఎస్‌ఎస్‌ఎస్ సంస్థ ద్వారా ఏపీజే అబ్దుల్‌కలాం అవార్డు
2022లో ఇంటర్‌నేషనల్ ఎక్స్‌లెన్స్, ఎన్విరాన్‌మెంటల్ వారియర్ అవార్డులు.
2022లో ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఐకాన్ అవార్డు, విశ్వగురు వరల్డ్ రికార్డు సంస్థ ద్వారా నేషనల్ అవార్డు, ప్రశంసా పత్రం.
ఢిల్లీలో 2023 జనవరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ అవేర్‌నెస్ అవార్డు.
Comments
Please login to add a commentAdd a comment