Save Soil
-
12 ఏళ్ల బాలిక.. అవార్డుల ‘గీతిక’
సూళ్లూరుపేట రూరల్ (తిరుపతి జిల్లా): పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ 12 ఏళ్ల బాలిక చేపట్టిన కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ‘‘సేవ్ వాటర్.. సేవ్ అగ్రికల్చర్.. సేవ్ సాయిల్..’’ నినాదంతో సూళ్లూరుపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని గీతిక ఇప్పటివరకు లక్ష మొక్కలను నాటడం గమనార్హం. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సొంత ఖర్చులతో ఓపిగ్గా.. గీతిక తండ్రి వెంకటేషన్ రైల్వే ఉద్యోగి కాగా తల్లి భారతి సచివాలయంలో మహిళ పోలీసుగా పని చేస్తున్నారు. సూళ్లూరుపేటలోని సాయినగర్‌లో నివసించే గీతికకు చిన్నతనం నుంచే పర్యావరణంపై మక్కువ ఏర్పడింది. గత నాలుగేళ్లుగా సొంత డబ్బులతో యాదముడి ఇంటిగ్రేటెడ్ రూరల్, అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో మొక్కలను నాటుతోంది. భూతాపం నుంచి భూమిని కాపాడి పర్యావరణాన్ని రక్షించేందుకు మొక్కలను నాటుదామంటూ పాఠశాలలు, గ్రామాల్లో విద్యార్థులు, రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఓపిగ్గా గంటల తరబడి ప్లకార్డులతో నిలుచుని తన లక్ష్యం దిశగా సాగుతోంది. పల్లెలే కాకుండా చెన్నై లాంటి మహా నగరంలోనూ గీతిక చేసిన ప్రయత్నాలను అభినందిస్తూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రకటించారు. తమ కుటుంబానికి ఆర్థికంగా భారమే అయినప్పటికీ ఆ చిన్నారి ప్రయత్నాలకు తల్లిదండ్రులు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. చెన్నై ప్రాంతంలో ప్లకార్డులతో గంటల కొద్ది నిలబడి అవగాహన కల్పిస్తున్న బాలిక గీతిక సాధించిన అవార్డులు బెంగళూరు, బిహార్, హైదరాబాద్‌కు చెందిన ఎన్జీఓలు, సామాజిక సేవా సంస్థల నుంచి పలు అవార్డులు. 2020 చైల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు, యంగ్ క్లైమేట్ యాక్టివిస్ట్ అవార్డు 2021లో గ్లోబల్ కిడ్ అచీవర్ అవార్డు, ఇండియన్ ఐకాన్ అవార్డు, ఫేమ్ ఐకాన్ అవార్డు 2022లో సూళ్లూరుపేట ఎస్ఎస్ఎస్ సంస్థ ద్వారా ఏపీజే అబ్దుల్‌కలాం అవార్డు 2022లో ఇంటర్నేషనల్ ఎక్స్‌లెన్స్, ఎన్విరాన్మెంటల్ వారియర్ అవార్డులు. 2022లో ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఐకాన్ అవార్డు, విశ్వగురు వరల్డ్ రికార్డు సంస్థ ద్వారా నేషనల్ అవార్డు, ప్రశంసా పత్రం. ఢిల్లీలో 2023 జనవరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అవార్డు. -
లండన్ నుంచి కావేరి వరకూ 30 వేల కిలోమీటర్ల బైక్‌యాత్ర
‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలు తిరిగాను. మన దేశంలో గుజరాత్ నుంచి ఏపీ వరకూ వచ్చాను. తొమ్మిది దేశాలు, ఆరు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఏపీ ప్రభుత్వం మట్టి రక్షణకు కట్టుబడి ఉంది. సీఎం వైఎస్ జగన్ దీనిపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు. దావోస్‌లో నేను ఆయనతో చర్చించాను. ఆయన పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వంతో కలిసి ఏపీలో మట్టిరక్షణకు ముందడుగు వేస్తున్నాం. దీనికి అవసరమైన నిధులను వెచ్చించడానికి సిద్ధం’.. అని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో భాగంగా లండన్ నుంచి కావేరి ప్రాంతం వరకూ 30 వేల కిలోమీటర్లు బైక్‌యాత్రను చేస్తున్న సద్గురు కర్నూలుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. – సాక్షి ప్రతినిధి, కర్నూలు సాక్షి : ‘సేవ్ సాయిల్’ యాత్రకు ఎలాంటి స్పందన వస్తోంది? సద్గురు : ఇప్పటిదాకా ప్రతీ దేశం నుండి అద్భుత స్పందన వస్తోంది. నాలుగు నెలల కిందట వరకూ మట్టిపై ప్రస్తావనే లేదు. కానీ, ఇప్పుడు ప్రతీచోట ‘సాయిల్’ అనే పదం ప్రతిధ్వనిస్తోంది. తొమ్మిది దేశాలు మట్టిని రక్షించే ఉద్యమంలో అవగాహన ఒప్పందాలు చేశాయి. ఇప్పటికే 74 దేశాలు మట్టిని రక్షించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. సాక్షి : ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాన్ని ఆశిస్తున్నారు? సద్గురు : ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించాం. ఇప్పటికే మా ప్రధాన సలహాదారు మాజీ యూఎన్ఈపీ డైరెక్టర్ ఎరిక్సోల్హైమ్ ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. సీఎంతో నేను మాట్లాడాను. ఆయన సుముఖంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి చాలా చర్యలు తీసుకోవడం మంచి విషయం. ఇది మరింత వేగంగా జరిగేందుకు ప్రోత్సాహకాలు అందించాలి. సాక్షి : ఏపీలో మాదిరిగా వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక చర్యలపై దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను చైతన్యంచేస్తే బాగుంటుంది కదా? సద్గురు : ఏపీ ప్రభుత్వం చర్యలను తెలుసుకున్నా. సీఎం వైఎస్ జగన్‌తో దావోస్‌లో భేటీ అయ్యా. ఈషా ఫౌండేషన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సాధారణ వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థం కనీసం 3–6శాతం మధ్య ఉండాలి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అది 1 శాతం కంటే తక్కువగా ఉంది. కచ్చితంగా 3–6 శాతం ఉండేలా ప్రభుత్వ పాలసీలలో పొందుపరచాలి. సాక్షి : భావితరాలకు వ్యవసాయంపై ఆసక్తిలేదు. వ్యవసాయ భూములను విక్రయించి ఇతర ఉపాధి మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతో వ్యవసాయ భూమి ‘రియల్ ఎస్టేట్’ ఉచ్చులో విలవిలలాడిపోతోంది? పరిష్కారం ఏంటంటారు? సద్గురు : మనం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి తీరాలి. అందుకు ప్రోత్సాహకాలు అందించాలి. లేకపోతే తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటాం. ప్రోత్సాహకాలతో రాబోయే 6–8 ఏళ్లలో మట్టిలో కనీసం 3 శాతం సేంద్రియ పదార్థం పెంపొందే దిశగా మనం అడుగులు వేయొచ్చు. సాక్షి : మీ 30వేల కిలోమీటర్ల ప్రయాణంలో మట్టిని రక్షించే చర్యలు ఏ దేశంలో సంతృప్తికరంగా ఉన్నాయి? మన దేశంలో ఏ రాష్ట్రంలో పరిస్థితి? సద్గురు : 2015లో ఫ్రాన్సు ‘4 ఫర్ 1000’ అనే కార్యాన్ని నిర్వహించింది. ఇది ‘మట్టిని రక్షించు’ పాలసీలా ఉంది. కానీ, వాళ్లు మట్టిని ఇతర సమస్యలతో ముడిపెట్టారు. దాంతో ఏడేళ్లు గడిచినా వారు దాన్ని అమలుచేయలేకపోయారు. (క్లిక్: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!) సాక్షి : ‘సేవ్ సాయిల్’ ఉద్యమం భవిష్యత్‌లో ఎలా ఉండబోతోంది? సద్గురు : ఈ ఉద్యమం ప్రజలు స్పందించడం కోసమే. మేం 25–30 శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటుచేస్తున్నాం. వీరు మట్టి పునరుద్ధరణపై సహకారం అందిస్తారు. సాక్షి : ఈ ఉద్యమంలో ప్రభుత్వాలు, ప్రజల బాధ్యత ఏంటి? సద్గురు : మట్టి అనేది భూమి మీది జీవనానికి ఆయువుపట్టు. దురదృష్టవశాత్తు అదిప్పుడు చేజారిపోతోంది. అందరూ మట్టిపై మాట్లాడాలి. స్వచ్ఛమైన నీటికి, స్వచ్ఛమైన గాలికి, మన జీవితాలకి ఆధారం ఆ మట్టే! మట్టి నాణ్యతను సంరక్షించడమే మన పిల్లలకు మనం అందించే గొప్ప వారసత్వం. (క్లిక్: కర్నూలులో జగ్గీ వాసుదేవ్.. ఫొటోగ్యాలరీ) -
మట్టి మేలుకు గట్టి స్పందన (ఫోటోలు)
-
‘సేవ్ సాయిల్’ కార్యక్రమానికి సినీ నటి సమంత (ఫొటోలు)
-
Save Soil: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!
మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేశాడు. చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. గ్రహాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నాడు. ఆ గ్రహాల మీద నీరు... మట్టి కోసం అన్వేషిస్తున్నాడు. ప్రాణికోణి నివసించే అవకాశం ఉందా అని పరిశోధిస్తున్నాడు. భూమికి ఆవల ఏముందో తెలుసుకునే ప్రయత్నమిది. అయితే... భూమి ఏమవుతుందోననే స్పృహను కోల్పోతున్నాడు. మన కాళ్ల కింద నేల ఉంది... ఆ నేల మట్టితో నిండినది. ఆ మట్టిని కాపాడుకున్నప్పుడే మనకు మనుగడ. ‘మట్టి ప్రమాదంలో పడింది... మట్టి ఆరోగ్యాన్ని కాపాడుదాం’... ... అని నినదిస్తున్నారు సేవ్ సాయిల్ యాక్టివిస్ట్ ప్రొఫెసర్ జయలేఖ. కేరళలో పుట్టి తెలుగు నేల మీద పెరిగిన ప్రొఫెసర్ జయలేఖ కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడింది. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆమె బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ కోర్సు చేశారు. తొలి ఉద్యోగం ఇక్రిశాట్లో. ఆ తర్వాత బేయర్ మల్టీనేషనల్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేశారామె. పెర్ల్ మిల్లెట్ బ్రీడర్‌గా రిటైర్ అయిన తర్వాత ఆమె పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్నారు. ఆమె చదువు, ఉద్యోగం, అభిరుచి, అభిలాష అంతా నేలతో మమైకమై ఉండడంతో ఆమె ఉద్యమం కూడా నేలతో ముడివడి సాగుతోంది. మట్టికోసం సాగుతున్న ‘సేవ్ సాయిల్ గ్లోబల్ మూవ్మెంట్’లో చురుకైన కార్యకర్త జయలేఖ. ఆమె సాక్షితో మాట్లాడుతూ... ‘నేలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంద’న్నారు. ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్’ ప్రపంచాన్ని నిద్రలేపుతోంది. మట్టి ప్రమాదంలో పడిందని హెచ్చరిస్తోంది. వ్యవసాయ నేలల్లో 52 శాతం నిస్సారమైపోయాయని గణాంకాలు చెప్పింది. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే 2050 నాటికి 90 శాతం నేల నిస్సారమవుతుందని, ప్రపంచం ఆకలి కేకలకు దగ్గరవుతుందని ‘యూఎన్‌సీసీడీ’ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులు 30 శాతం పడిపోయాయి. ఇప్పుడు కూడా ఉద్యమించకపోతే... నిర్లిప్తంగా ఉండిపోతే... ఇది నా సమస్య కాదు... ఇందులో నేను చేయాల్సింది ఏమీ లేదు... అని నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే... వందేళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తోందని కూడా చెప్తోంది. సేవ్ సాయిల్ సామాజికోద్యమం అలా పుట్టిందే’ అని వివరించారు జయలేఖ. చైతన్య యాత్ర పిచ్చుక అంతర్థానమైన తర్వాత పర్యావరణం గురించి ఆలోచించాం. కానీ మట్టి విషయంలో చేతులు కాలిన తర్వాత చేయగలిగిందేమీ ఉండదు. అందుకే ముందుగానే అప్రమత్తం కావాలి. మట్టి ప్రమాదంలో పడిందని ఇప్పటి వరకు తెలిసింది మేధావులకు మాత్రమే. ఈ వాస్తవం సామాన్యుడికి కూడా తెలియాలి. సామాన్యుల్లో చైతన్యం రావాలి. అందుకే ‘మట్టిని రక్షించు’ అని యాత్ర మొదలైంది. కాన్షియస్ ప్లానెట్ చొరవతో మొదలైన సేవ్ సాయిల్ థీమ్ ఇది. ఈశా ఫౌండేషన్, సద్గురు జగ్గీవాసుదేవ్ చేపట్టిన వంద రోజుల బైక్ యాత్ర మార్చి 21న లండన్‌లో మొదలైంది. మే నెల 29 నాటికి మనదేశంలోకి వచ్చిన సేవ్ సాయిల్ యాత్ర... ఐదు రాష్ట్రాలను చుట్టి ‘మట్టిని రక్షించు’ నినాదంతో ఈరోజు హైదరాబాద్‌కు చేరనుంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడే ప్రభుత్వాలు తమ దేశంలో వాతావరణానికి, నేలతీరుకు అనుగుణంగా పాలసీలను రూపొందించడానికి ముందుకు వస్తాయి. అప్పుడే ఈ బృహత్తర కార్యక్రమం సఫలమవుతుంది. ఆ ఫలితం కోసమే మా ప్రయత్నం’’ అన్నారు జయలేఖ. – వాకా మంజులారెడ్డి మట్టికి ఆక్సిజన్ అందాలి మట్టి చచ్చిపోతోంది... చెట్టు ఎండిపోతోంది. మనిషి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన స్థితి. మట్టి సారం కోల్పోతే సంభవించే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే... ఆహార కొరత, నీటి కొరత, జీవ వైవిధ్యత నశించడం, వాతావరణంలో పెనుమార్పులు, జీవన భద్రత కోల్పోవడం, పొట్ట చేత పట్టుకుని వలసలు పోవడం వంటివన్నీ భవిష్యత్తు మానవుడికి సవాళ్లవుతాయి. ఎంత తెలుసుకున్నప్పటికీ చేయగలిగిందేమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. జీవం కోల్పోతున్న మట్టికి జవజీవాలనందివ్వాలి. వ్యవసాయ నేలలో ఏటా తప్పనిసరిగా యానిమల్ వేస్ట్, ప్లాంట్ డెబ్రిస్ ఇంకిపోవాలి. నేలను బీడు పెట్టకూడదు. చెట్టు పచ్చగా ఉంటే నేల చల్లగా ఉంటుంది. నేల సారవంతంగా ఉంటే చెట్టు ఏపుగా పెరుగుతుంది. ఈ రెండూ గాడిలో ఉన్నప్పుడే మనిషి విశ్వాన్ని జయించగలిగేది. (క్లిక్: మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?) మట్టికి ఏమైంది? మట్టిలో ఉండాల్సిన మైక్రో ఆర్గానిజమ్స్ నశించిపోతున్నాయి. అంటే మట్టిలో ఉండాల్సిన జీవం నిర్జీవం అవుతోంది. దాంతో మట్టిలోని సారం నిస్సారమవుంది. ఈ ఉపద్రవంలో కూడా అగ్రరాజ్యం అమెరికా పాత్ర తొలిస్థానంలో ఉంది. ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందనేది మనకు తెలియడం లేదు. కానీ ఇది భూగోళానికి మొదటి ప్రమాద హెచ్చరిక వంటిది. నేలలో సేంద్రియ పదార్థాల స్థాయి మూడు నుంచి ఆరుశాతం ఉండాలి. అలాంటిది యూరోపియన్ దేశాల్లో రెండు శాతానికి పడిపోయింది. మన దేశంలో అయితే 0.5 శాతమే ఉంది. ఆఫ్రికాదేశాల్లో మరీ అధ్వాన్నంగా 0.3 శాతం ఉంది. ఇలాంటి గణాంకాలు, నివేదికలు తెలిసిన వెంటనే ఇందుకు రసాయన ఎరువుల వాడకమే కారణం అంటూ... రైతును నిందిస్తుంటారు. అది పూర్తిగా తప్పు. వరదల కారణంగా భూమి కోతకు గురికావడం, అవగాహన లేక పంటలను మార్చకుండా ఒకే పంటను మళ్లీ మళ్లీ వేయడం... భూమిని బీడుగా వదిలేయడం వంటి అనేక కారణాల్లో రసాయన ఎరువులు ఒక కారణం మాత్రమే. అలాగే ఊరికి ఒకరో ఇద్దరో రైతులు ముందడుగు వేస్తే సరిపోదు. ప్రభుత్వాలు ముందుకు వచ్చి పాలసీలు రూపొందించాలి. – ప్రొఫెసర్ ఎ.కె. జయలేఖ, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి, savesoil.org