‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలు తిరిగాను. మన దేశంలో గుజరాత్ నుంచి ఏపీ వరకూ వచ్చాను. తొమ్మిది దేశాలు, ఆరు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఏపీ ప్రభుత్వం మట్టి రక్షణకు కట్టుబడి ఉంది. సీఎం వైఎస్ జగన్ దీనిపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు. దావోస్‌లో నేను ఆయనతో చర్చించాను. ఆయన పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వంతో కలిసి ఏపీలో మట్టిరక్షణకు ముందడుగు వేస్తున్నాం. దీనికి అవసరమైన నిధులను వెచ్చించడానికి సిద్ధం’.. అని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో భాగంగా లండన్ నుంచి కావేరి ప్రాంతం వరకూ 30 వేల కిలోమీటర్లు బైక్‌యాత్రను చేస్తున్న సద్గురు కర్నూలుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..
– సాక్షి ప్రతినిధి, కర్నూలు
సాక్షి : ‘సేవ్ సాయిల్’ యాత్రకు ఎలాంటి స్పందన వస్తోంది?
సద్గురు : ఇప్పటిదాకా ప్రతీ దేశం నుండి అద్భుత స్పందన వస్తోంది. నాలుగు నెలల కిందట వరకూ మట్టిపై ప్రస్తావనే లేదు. కానీ, ఇప్పుడు ప్రతీచోట ‘సాయిల్’ అనే పదం ప్రతిధ్వనిస్తోంది. తొమ్మిది దేశాలు మట్టిని రక్షించే ఉద్యమంలో అవగాహన ఒప్పందాలు చేశాయి. ఇప్పటికే 74 దేశాలు మట్టిని రక్షించేందుకు కట్టుబడి ఉంటామన్నారు.
సాక్షి : ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాన్ని ఆశిస్తున్నారు?
సద్గురు : ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించాం. ఇప్పటికే మా ప్రధాన సలహాదారు మాజీ యూఎన్‌ఈపీ డైరెక్టర్ ఎరిక్‌సోల్‌హైమ్ ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. సీఎంతో నేను మాట్లాడాను. ఆయన సుముఖంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి చాలా చర్యలు తీసుకోవడం మంచి విషయం. ఇది మరింత వేగంగా జరిగేందుకు ప్రోత్సాహకాలు అందించాలి.
సాక్షి : ఏపీలో మాదిరిగా వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక చర్యలపై దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను చైతన్యంచేస్తే బాగుంటుంది కదా?
సద్గురు : ఏపీ ప్రభుత్వం చర్యలను తెలుసుకున్నా. సీఎం వైఎస్ జగన్‌తో దావోస్‌లో భేటీ అయ్యా. ఈషా ఫౌండేషన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సాధారణ వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థం కనీసం 3–6శాతం మధ్య ఉండాలి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అది 1 శాతం కంటే తక్కువగా ఉంది. కచ్చితంగా 3–6 శాతం ఉండేలా ప్రభుత్వ పాలసీలలో పొందుపరచాలి.
సాక్షి : భావితరాలకు వ్యవసాయంపై ఆసక్తిలేదు. వ్యవసాయ భూములను విక్రయించి ఇతర ఉపాధి మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతో వ్యవసాయ భూమి ‘రియల్ ఎస్టేట్’ ఉచ్చులో విలవిలలాడిపోతోంది? పరిష్కారం ఏంటంటారు?
సద్గురు : మనం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి తీరాలి. అందుకు ప్రోత్సాహకాలు అందించాలి. లేకపోతే తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటాం. ప్రోత్సాహకాలతో రాబోయే 6–8 ఏళ్లలో మట్టిలో కనీసం 3 శాతం సేంద్రియ పదార్థం పెంపొందే దిశగా మనం అడుగులు వేయొచ్చు.
సాక్షి : మీ 30వేల కిలోమీటర్ల ప్రయాణంలో మట్టిని రక్షించే చర్యలు ఏ దేశంలో సంతృప్తికరంగా ఉన్నాయి? మన దేశంలో ఏ రాష్ట్రంలో పరిస్థితి?
సద్గురు : 2015లో ఫ్రాన్సు ‘4 ఫర్ 1000’ అనే కార్యాన్ని నిర్వహించింది. ఇది ‘మట్టిని రక్షించు’ పాలసీలా ఉంది. కానీ, వాళ్లు మట్టిని ఇతర సమస్యలతో ముడిపెట్టారు. దాంతో ఏడేళ్లు గడిచినా వారు దాన్ని అమలుచేయలేకపోయారు. (క్లిక్: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!)
సాక్షి : ‘సేవ్ సాయిల్’ ఉద్యమం భవిష్యత్‌లో ఎలా ఉండబోతోంది?
సద్గురు : ఈ ఉద్యమం ప్రజలు స్పందించడం కోసమే. మేం 25–30 శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటుచేస్తున్నాం. వీరు మట్టి పునరుద్ధరణపై సహకారం అందిస్తారు.
సాక్షి : ఈ ఉద్యమంలో ప్రభుత్వాలు, ప్రజల బాధ్యత ఏంటి?
సద్గురు : మట్టి అనేది భూమి మీది జీవనానికి ఆయువుపట్టు. దురదృష్టవశాత్తు అదిప్పుడు చేజారిపోతోంది. అందరూ మట్టిపై మాట్లాడాలి. స్వచ్ఛమైన నీటికి, స్వచ్ఛమైన గాలికి, మన జీవితాలకి ఆధారం ఆ మట్టే! మట్టి నాణ్యతను సంరక్షించడమే మన పిల్లలకు మనం అందించే గొప్ప వారసత్వం. (క్లిక్: కర్నూలులో జగ్గీ వాసుదేవ్.. ఫొటోగ్యాలరీ)
Comments
Please login to add a commentAdd a comment