సాక్షి, అమరావతి: ‘దేశానికి పల్లె సీమలే పట్టుగొమ్మలు’ అనే నానుడిని నిజం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం ప్రగతి పథంలో పయనించినట్టే. ఈ నేపథ్యంలో గ్రామాలను అభివృద్ధి చేయడానికి యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను ప్రభుత్వం రంగంలో దింపుతోంది. ఉన్నత భారత్ అభియాన్ పేరుతో గ్రామాల్లో సామాజిక సేవలో పాలుపంచుకునేలా వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తోంది.
ఇప్పటివరకు మన రాష్ట్రంలో 129 విద్యా సంస్థలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చాయి. ఒక్కో సంస్థ ఐదు చొప్పున 645 గ్రామాలను దత్తత తీసుకున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆరు ప్రాధాన్యత రంగాల్లో విద్యా సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. ఇలా గ్రామాలను దత్తత తీసుకుంటూ పల్లె సేవలో భాగస్వాములవుతున్న సంస్థలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున గ్రాంట్ అందిస్తోంది.
50 వేల విద్యా సంస్థలు.. 2.5 లక్షల పంచాయతీలు..
పరిశోధన ఫలాలు, ప్రభుత్వ పథకాలను సమన్వయపరుస్తూ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా గ్రామీణాభివృద్ధికి బాటలు వేయడమే ఉన్నత భారత్ అభియాన్ లక్ష్యం. దేశవ్యాప్తంగా 2023 నాటికి 50 వేల విద్యాసంస్థలను ఇందులో భాగస్వాములను చేయడం, వీటితో 2.5 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ సంయుక్త ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఐఐటీ ఢిల్లీ, రాష్ట్ర స్థాయిలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సమన్వయ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి.
ఆరు ప్రాధాన్యతా రంగాల్లో..
129 విద్యా సంస్థలు ఆయా గ్రామాల్లో సురక్షిత మంచినీరు, ఆరోగ్యం–పరిసరాల పరిశుభ్రత, వ్యవసాయం, గ్రామీణ చేతివృత్తులు, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి ఆరు ప్రాధాన్యతా రంగాల్లో సౌకర్యాల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ తోడ్పాటుతో కృషి చేస్తాయి. ఈ 129 విద్యాసంస్థలకు చెందిన 1.93 లక్షల మంది విద్యార్థుల ద్వారా దత్తత తీసుకున్న 645 గ్రామాల్లో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. నూతన ఆవిష్కరణల ఫలాలు, పరిశోధన ఫలితాల ద్వారా పల్లె ప్రగతికి బాటలు వేస్తున్నారు.
జాతీయ స్థాయికి ఎంపికైన మూడు ఆవిష్కరణలు
పల్లె ప్రగతిలో కీలకంగా మారే నూతన ఆవిష్కరణలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు. ఇవి పెట్టుబడులను ఆకర్షించినట్లైతే అందుకు అవసరమైన తోడ్పాటును జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అందిస్తారు. గ్రామీణాభివృద్ధికి తోడ్పాటునందించే ఆవిష్కరణలను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి.. వచ్చే లాభాల్లో రాయల్టిని ఆయా విద్యాసంస్థలు, విద్యార్థులకు చెల్లిస్తారు.
ఇలా ఇప్పటివరకు తిరుపతి ఐఐటీ విద్యార్థులు తాగునీటిని శుద్ధి చేసేందుకు రూపొందించిన కెపాసిటివ్ డీఅయోనైజేషన్ పరికరం, వైఎస్సార్ జిల్లా మనూ పాలిటెక్నిక్ విద్యార్థులు.. చేతివృత్తులు వారు సహజ ఉత్పత్తులు తయారీ చేసేందుకు అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన సోలార్ మొబైల్ చార్జర్ వంటి ఆవిష్కరణలను జాతీయ స్థాయి పరిశీలనకు పంపించారు. వీటితో పాటు మరో ఏడు విద్యాసంస్థలు కూడా నూతన సాంకేతికతలను అభివృద్ధి చేశాయి.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం..
https://unnatbharatabhiyan.gov.in ద్వారా నమోదైన విద్యాసంస్థలు జిల్లా కలెక్టర్‌కు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తి కాగానే, ముందు ప్రాంతీయ సమన్వయ సంస్థ, ఆ తర్వాత జాతీయ సమన్వయ సంస్థ వివరాలు తనిఖీ చేసి ఆమోదముద్ర వేస్తాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఆ విద్యాసంస్థకు రూ.10 లక్షల గ్రాంటు మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని గ్రామాలను గుర్తించడం, అక్కడ పర్యటించడం, సమస్యలను అధ్యయనం చేయడం వంటి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు.
అంతేకాకుండా ఆయా పల్లెలకు ఉపయోగపడేలా చేపట్టే పరిశోధనలకు కూడా వాడుకోవచ్చు. దత్తత గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు అవసరమయ్యే మద్దతును వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దత్తత తీసుకున్న పల్లెల్లో స్థానిక ప్రాధాన్యాల గుర్తింపు, సాంకేతికత బదిలీ వంటి కీలక అంశాల్లో సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. ఆయా విద్యా సంస్థల నుంచి ఉత్తీర్ణులయ్యేనాటికి మంచి నైపుణ్యాలను పొందుతారు.
నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు
ఉన్నత భారత్ అభియాన్ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు పెద్ద ఎత్తున విద్యాసంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అవి అభివృద్ధి చేసే నూతన ఆవిష్కరణలను నేరుగా పల్లెలకు తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే 129 విద్యాసంస్థలు నమోదయ్యాయి. వీటి నుంచి 1.93 లక్షల మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. 645 గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాధాన్యతా రంగాల్లో ప్రగతికి బాటలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు అభినందనీయం. – ప్రొ.సర్జన్ రెడ్డి, కేంద్ర సమన్వయకర్త, ఉన్నత్ భారత్ అభియాన్
Comments
Please login to add a commentAdd a comment