institution
-
పల్లెకు పోదాం.. ప్రజాసేవ చేద్దాం!
సాక్షి, అమరావతి: ‘దేశానికి పల్లె సీమలే పట్టుగొమ్మలు’ అనే నానుడిని నిజం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం ప్రగతి పథంలో పయనించినట్టే. ఈ నేపథ్యంలో గ్రామాలను అభివృద్ధి చేయడానికి యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను ప్రభుత్వం రంగంలో దింపుతోంది. ఉన్నత భారత్ అభియాన్ పేరుతో గ్రామాల్లో సామాజిక సేవలో పాలుపంచుకునేలా వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తోంది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 129 విద్యా సంస్థలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చాయి. ఒక్కో సంస్థ ఐదు చొప్పున 645 గ్రామాలను దత్తత తీసుకున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆరు ప్రాధాన్యత రంగాల్లో విద్యా సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. ఇలా గ్రామాలను దత్తత తీసుకుంటూ పల్లె సేవలో భాగస్వాములవుతున్న సంస్థలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున గ్రాంట్ అందిస్తోంది. 50 వేల విద్యా సంస్థలు.. 2.5 లక్షల పంచాయతీలు.. పరిశోధన ఫలాలు, ప్రభుత్వ పథకాలను సమన్వయపరుస్తూ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా గ్రామీణాభివృద్ధికి బాటలు వేయడమే ఉన్నత భారత్ అభియాన్ లక్ష్యం. దేశవ్యాప్తంగా 2023 నాటికి 50 వేల విద్యాసంస్థలను ఇందులో భాగస్వాములను చేయడం, వీటితో 2.5 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ సంయుక్త ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఐఐటీ ఢిల్లీ, రాష్ట్ర స్థాయిలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సమన్వయ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. ఆరు ప్రాధాన్యతా రంగాల్లో.. 129 విద్యా సంస్థలు ఆయా గ్రామాల్లో సురక్షిత మంచినీరు, ఆరోగ్యం–పరిసరాల పరిశుభ్రత, వ్యవసాయం, గ్రామీణ చేతివృత్తులు, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి ఆరు ప్రాధాన్యతా రంగాల్లో సౌకర్యాల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ తోడ్పాటుతో కృషి చేస్తాయి. ఈ 129 విద్యాసంస్థలకు చెందిన 1.93 లక్షల మంది విద్యార్థుల ద్వారా దత్తత తీసుకున్న 645 గ్రామాల్లో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. నూతన ఆవిష్కరణల ఫలాలు, పరిశోధన ఫలితాల ద్వారా పల్లె ప్రగతికి బాటలు వేస్తున్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన మూడు ఆవిష్కరణలు పల్లె ప్రగతిలో కీలకంగా మారే నూతన ఆవిష్కరణలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. ఇవి పెట్టుబడులను ఆకర్షించినట్లైతే అందుకు అవసరమైన తోడ్పాటును జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అందిస్తారు. గ్రామీణాభివృద్ధికి తోడ్పాటునందించే ఆవిష్కరణలను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి.. వచ్చే లాభాల్లో రాయల్టిని ఆయా విద్యాసంస్థలు, విద్యార్థులకు చెల్లిస్తారు. ఇలా ఇప్పటివరకు తిరుపతి ఐఐటీ విద్యార్థులు తాగునీటిని శుద్ధి చేసేందుకు రూపొందించిన కెపాసిటివ్ డీఅయోనైజేషన్ పరికరం, వైఎస్సార్ జిల్లా మనూ పాలిటెక్నిక్ విద్యార్థులు.. చేతివృత్తులు వారు సహజ ఉత్పత్తులు తయారీ చేసేందుకు అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన సోలార్ మొబైల్ చార్జర్ వంటి ఆవిష్కరణలను జాతీయ స్థాయి పరిశీలనకు పంపించారు. వీటితో పాటు మరో ఏడు విద్యాసంస్థలు కూడా నూతన సాంకేతికతలను అభివృద్ధి చేశాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం.. https://unnatbharatabhiyan.gov.in ద్వారా నమోదైన విద్యాసంస్థలు జిల్లా కలెక్టర్‌కు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తి కాగానే, ముందు ప్రాంతీయ సమన్వయ సంస్థ, ఆ తర్వాత జాతీయ సమన్వయ సంస్థ వివరాలు తనిఖీ చేసి ఆమోదముద్ర వేస్తాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఆ విద్యాసంస్థకు రూ.10 లక్షల గ్రాంటు మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని గ్రామాలను గుర్తించడం, అక్కడ పర్యటించడం, సమస్యలను అధ్యయనం చేయడం వంటి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఆయా పల్లెలకు ఉపయోగపడేలా చేపట్టే పరిశోధనలకు కూడా వాడుకోవచ్చు. దత్తత గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు అవసరమయ్యే మద్దతును వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దత్తత తీసుకున్న పల్లెల్లో స్థానిక ప్రాధాన్యాల గుర్తింపు, సాంకేతికత బదిలీ వంటి కీలక అంశాల్లో సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. ఆయా విద్యా సంస్థల నుంచి ఉత్తీర్ణులయ్యేనాటికి మంచి నైపుణ్యాలను పొందుతారు. నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు ఉన్నత భారత్ అభియాన్ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు పెద్ద ఎత్తున విద్యాసంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అవి అభివృద్ధి చేసే నూతన ఆవిష్కరణలను నేరుగా పల్లెలకు తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే 129 విద్యాసంస్థలు నమోదయ్యాయి. వీటి నుంచి 1.93 లక్షల మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. 645 గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాధాన్యతా రంగాల్లో ప్రగతికి బాటలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు అభినందనీయం. – ప్రొ.సర్జన్ రెడ్డి, కేంద్ర సమన్వయకర్త, ఉన్నత్ భారత్ అభియాన్ -
తరం తల్లడిల్లుతోంది..!
చిల్లా వాసు, ఏపీ సెంట్రల్ డెస్క్ బాపట్లకు చెందిన చెన్నుపాటి యశ్వంత్ చాలా తెలివైన విద్యార్థి. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్ (గుజరాత్)లో కంప్యూటర్ సైన్సులో సీటు వచ్చింది. అయితే చాలా దూరం కావడంతో జాతీయ స్థాయిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ కాలికట్లో బీటెక్ కంప్యూటర్ సైన్సులో చేరాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. యశ్వంత్‌కు ఉజ్వల భవిష్యత్ ఖాయమని, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. ఆరు నెలలకే యశ్వంత్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్ఐటీ కాలికట్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అందరూ నివ్వెరపోయారు. ...ఒక్క యశ్వంత్ మాత్రమే కాదు.. ఇలా ఎంతో మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి వాటిలో సీట్లు సాధించి కూడా అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. కేంద్ర విద్యా శాఖ లెక్కల ప్రకారం.. 2018 నుంచి ఈ ఏడాది వరకు 33 మంది విద్యార్థులు ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2018 నుంచి ఇప్పటివరకు 98 మంది విద్యార్థులు చనిపోతే వీరిలో 33 మంది ఐఐటీల విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014–21లో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో 122 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో 2017 నుంచి విద్యార్థుల ఆత్మహత్యల మరణాలు 32.15% పెరిగాయి. మరోవైపు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కర్మాగారంగా, కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సీటు ఎంత కష్టమంటే.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఐఐటీలు. వీటి తర్వాత స్థానం ఎన్ఐటీలది. ఇంజనీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్‌ని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా రాశారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మందిని తదుపరి పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ఈ ఏడాదికి 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. 11 లక్షల మంది పరీక్ష రాస్తే చివరకు ఐఐటీల్లో ప్రవేశించేది 17,385 మంది మాత్రమే. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినా సీట్లు రానివారు, జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు వచ్చినవారు ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. జేఈఈ కోసం ఆరో తరగతి నుంచే ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్ స్కూళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. ఇలా ఆరో తరగతి నుంచి ఇంటర్మిడియెట్ వరకు ఏడేళ్లపాటు కృషి చేస్తుంటే చివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీల్లో చేరుతున్నారు. ఎందుకిలా.. ఓవైపు అకడమిక్ ఎగ్జామ్స్, మరోవైపు కాంపిటీటివ్ ఎగ్జామ్స్.. ప్రాజెక్టు వర్క్, థీసిస్,ప్రాక్టికల్స్ కోసం సొంతంగా సిద్ధం కావాల్సి రావడం. సొంత రాష్ట్రానికి చాలా దూరంగా వేరే రాష్ట్రాల్లో సీటు రావడం.. భాషలు, ఆహారం, వాతావరణం అలవాటుపడలేకపోవడం గతంలో ఎంత సాధించినా.. ఐఐటీలు, ఎన్ఐటీలలో అసలు సిసలు పోటీ ప్రారంభమవడం. గతంలో బట్టీ పట్టేస్తే సరిపోయేది.. ఇపుడు సృజనాత్మకత అవసరం.. ఇక్కడ మేథస్సుకే పని. విద్యార్థులకు ఇష్టంలేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద కోర్సును ఎంపిక చేసుకోవడం. ఏం చేయాలి? విద్యాసంస్థలలో మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి. చాలా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని నివారించడానికి బిజినెస్ క్లబ్బులు, ఫొటోగ్రఫీ క్లబ్బు, కల్చరల్ క్లబ్బు, యోగా క్లబ్బు, మ్యూజిక్ క్లబ్బులు ఉన్నాయి. తమ ఆసక్తికి అనుగుణంగా విద్యార్థులు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. పిల్లల చదువులకు బాగా డబ్బు ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచడం, ఇతరులతో పోల్చి తిట్టడం వంటివి చేయకూడదు. స్కూల్, కళాశాల స్థాయిల్లోనే బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలి. పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించుకుని నేర్చుకునేలా చేయాలి. నిత్యం యోగా, ధ్యానం చేయించడంతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలి. విద్యార్థులు సోషల్ మీడియా సైట్లు, సైబర్ బెదిరింపుల బారిన పడకుండా చూడాలి. కొద్ది రోజులే ఇబ్బంది.. మాది బాపట్ల జిల్లా. నేను ఎన్ఐటీ జంషెడ్పూర్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాను. మొదట్లో నాకు భాషా పరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఇంటికి చాలా దూరంలో పరాయి రాష్ట్రంలో ఉండాల్సి రావడం కూడా కొంచెం సమస్యగా మారింది. అయితే ఆ బెరుకును ఇన్స్టిట్యూట్లో ఉన్న కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది పోగొట్టారు. బోధన పరంగా సంప్రదాయ విధానానికి, ఎన్ఐటీల్లో విద్యకు తేడా ఉంది. ఇక్కడ బోధన చర్చ, విశ్లేషణ.. సంపూర్ణ అవగాహన అనే రీతిలో సాగుతోంది. కొంత అదనపు సమాచారాన్ని మా అంతట మేమే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం. సుశ్వాంత్, బీటెక్ కంప్యూటర్ సైన్స్,థర్డ్ ఇయర్, ఎన్ఐటీ, జంషెడ్పూర్ కొంత సమయం పడుతోంది.. ఇప్పుడు 8వ తరగతి నుంచే జేఈఈకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచే విద్యార్థులపై ఒత్తిడి మొదలవుతోంది. ఇంటర్మిడియెట్ వరకు టీచర్ పాఠం చెప్పడం.. బోర్డుపైన రాయడం.. నోట్సు చెప్పడం.. తర్వాత దాన్ని బట్టీ పట్టడం వంటి సంప్రదాయ విధానాలకు అలవాటు పడిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త విధానాలను అలవాటు పడటానికి సమయం పడుతోంది. ఒక్కసారిగా ఇంటికి దూరం కావడం, వేరే ఎక్కడో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు రావడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంతగా స్కిల్స్ లేనివారే ఒత్తిడి బారిన పడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, యోగా వంటివాటి వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – ఎంఎన్ రావు, ఐఐటీ కోచింగ్ నిపుణులు, హైదరాబాద్ ప్రాథమిక దశలోనే నైపుణ్యాలు పెంపొందించాలి.. కేంద్ర విద్యా శాఖ ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేలా చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. జేఈఈ రాసేవారిలో ఎక్కువ మంది సౌత్ ఇండియా వారే. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు. ఇంటర్‌లోగంటల తరబడి చదివి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో ర్యాంకులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు ఐఐటీల్లో అసలు పరీక్ష మొదలవుతోంది. అక్కడ ప్రొఫెసర్లు చెప్పిన కాన్సెప్‌్టతో విద్యార్థులే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలు లేనివారే ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త విధానానికి అలవాటుపడలేనివారు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. – కె.లలిత్ కుమార్, డైరెక్టర్, అభీష్ట ఎడ్యుగ్రామ్ లిమిటెడ్ -
అందరికీ న్యాయమే రాజ్యాంగ అమలు లక్ష్యం
- రిజర్వేషన్లు స్వయంసమృద్ధికి తొలిమెట్లు మాత్రమే - సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం, స్వేచ్ఛ, అవకాశాలు కల్పిం చడమే రాజ్యాంగం అమలు లక్ష్యమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు పూర్తిస్థాయిలో అమలు జరిగితేనే సమాజంలో ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ’రాజ్యాంగం–లక్ష్యాలు’ అంశం పై వెనుకబడిన కులాల సాధికారత సంఘం ఆధ్వర్యంలో ఎంపీ దేవేందర్‌గౌడ్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో స్వయం సమృద్ధి, సాధికారత సాధించేందుకు మాత్రమే రిజర్వేషన్లు తొలిమెట్లన్నారు. అంబేడ్కర్ రిజ ర్వేషన్లతో కాకుండా స్వయంకృషి, మేధస్సు తోనే ఎదిగారనేది గ్రహించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యల పరి ష్కారానికి ’ఈ పద్ధతే’ పరమావధి అన్న ఆలో చన సరైనది కాదని, వ్యవస్థకు అవసరమైన మార్పులు రాజ్యాంగపరంగా జరగాలన్నారు. విద్యాసంస్థల్లోని ప్రమాణాల మధ్య వ్యత్యాసం ఉండకూడదన్నారు. విద్యాప్రమాణాల్లో వ్యత్యాసం వల్ల నాణ్యమైన విద్యలేక ఇంజనీరింగ్ విద్యార్థులు అటెండర్ పోస్టులకు పోటీ పడుతున్నారని అన్నారు. సదస్సులో పాల్గొన్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎం.జె. అక్బర్ మాట్లాడుతూ.. వందల ఏళ్ల సమాజంలో నెలకొన్న సమస్యలను 70 ఏళ్ల రిజర్వేషన్లతో రూపుమాపలేమని అన్నారు. రిజర్వేషన్లతోనే అన్నింటినీ పరిష్కరించలేం సమాజంలో సమానత్వం తీసుకురా వడానికి నిరంతర కృషి అవసరమని, కేవ లం రిజర్వేషన్లతోనే అన్నింటినీ పరిష్కరిం చలేమని కేంద్ర సమాచార కమిషనర్ మా డభూషి శ్రీధర్ అన్నారు. సమాచార హ క్కు చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలను కూడా తీసుకురావాలని ఆయన అభిప్రా యపడ్డారు. ఈ సదస్సులో జేడీయూ నేత శరద్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి నాచియప్పన్, ఎంపీ రాపోలు ఆనందభా స్కర్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్.ఎన్.రావు, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్, జస్టిస్ వి. ఈశ్వరయ్య, మాజీ ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
నేడు విద్యాసంస్థల బంద్
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈనెల 8వ తేదీన విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌తో పాటు కలెక్టరేట్, ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం స్కాలర్షిప్లు పెంచడంతో పాటు రూ. 3100 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఎంసీఆర్సీ.. ది బెస్ట్ స్కూల్!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన అనుబంధ విద్యా సంస్థ దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా గుర్తింపు దక్కించుకుంది. జామియా మిలియా ఇస్లామియా మాస్ కమ్యూనికేషన్ రిసెర్చ్ (ఎంసీఆర్సీ) స్కూల్ ఈ ఏడాదికిగాను ఉత్తమ విద్యాసంస్థగా ఎంపికైనట్లు యూనివర్సిటీవర్గాలు తెలిపాయి. ఎంసీఆర్సీ ఉత్తమ విద్యాసంస్థగా ఎంపిక కావడం ఇది రెండోసారి. ఇదే యూనివర్సిటీకి చెందిన లా విభాగం ఆరో స్థానంలో, ఆర్కిటెక్చర్ విభాగం ఏడో స్థానంలో నిలిచాయి. ప్రముఖ మ్యాగజైన్ అవుట్‌లుక్ దేశంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని విద్యాసంస్థలపై నిర్వహించిన సర్వేలో ఎంసీఆర్సీకు మొదటిస్థానం దక్కింది. ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, ఆర్కిటెక్చర్, లా, ఫ్యాషన్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్, సోషల్ వర్క్, మాస్ కమ్యూనికేషన్లకు చెందిన దాదాపు 1700 కాలేజీలపై సర్వే నిర్వహించింది. నాణ్యమైన విద్య, సదుపాయాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని సర్వే చేపట్టారు.