విశ్వవిద్యాలయం అంటే ఒక అధ్యయన బోధన కేంద్రమని మరిచిపోతున్నామా? జ్ఞాన సముపార్జనకు అదొక నెలవని విస్మరిస్తున్నామా? కొన్నికేంద్రీయ విశ్వవిద్యాలయాలను చూస్తుంటే పరిస్థితి అలాగే కనబడుతోంది. అధ్యాపక వర్గంలో సామర్థ్యం ఉన్నవారు కొరవడుతున్నారు. విద్యార్థులు మత్తుమందులకు బానిసలవుతున్నారు. అసాంఘిక చర్యలకు నిర్భయంగా దిగుతున్నారు. మతోన్మాదం, కులోన్మాదాలు పెరుగుతున్నాయి.విశ్వవిద్యాలయాలు అంబేడ్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇమాన్యుయేల్ కాంట్, హెగెల్, జీన్‌పాల్ సాత్రే, చిన్నయ సూరి వంటి ప్రపంచ మేధావుల్నిసృష్టించాలంటే... జ్ఞానం, నీతి, వ్యక్తిత్వం, మానవత, ప్రజ్ఞ విస్తరించాలి. అప్పుడే ప్రపంచ యవనికపై భారతీయ విశ్వవిద్యాలయాలు మెరుస్తాయి.
ప్రపంచ వ్యాప్తంగా విద్య... సామాజిక,సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో విప్లవంగా ముందుకొస్తూ ఉంది. నూతన సామాజిక నిర్మాణానికీ, ప్రపంచ అవగాహనకూ విద్యే ముఖ్యసాధనం. అటువంటి విద్యనందించే కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలకు ఒక గుర్తింపు ఉంది. ఇవి దేశంలో కేంద్రీయ, రాష్ట్ర, డీమ్డ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలుగా సేవలు అంది స్తున్నాయి. ఉన్నత విద్యను ఒక జీవనశాస్త్రంగా అధ్యయనం చేసిన వారిలో డా‘‘ బీఆర్ అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, మౌలానా అబుల్‌కలామ్ ఆజాద్, రామ్ మనోహర్ లోహియా, సర్ సి.వి.రామన్ వంటి మేధావులు ఎందరో ఉన్నారు. కానీ దేశంలో ఈనాడున్న 56 సెంట్రల్ యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులు, పరిశోధకులు వీరిలాగా నూత్న జ్ఞానాన్ని సృష్టించలేక పోతున్నారు. విశ్వ విద్యాలయ గ్రంథాలయాలు అధ్యయనపరుల కోసం ఆకలితో ఎదురుచూడాల్సి వస్తోంది.
అధ్యాపక వర్గంలో అత్యున్నత బోధనా సామర్థ్యం వున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. దొంగ డాక్టరేట్లు ఇచ్చి డబ్బు గుంజుకున్న చర్య లతో అనేక విశ్వవిద్యాలయాలు పీకల్లోతు ఆరోపణలలో కూరుకొని ఉన్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు మత్తుమందులకు బానిసలవుతున్నారు. అసాంఘిక చర్యలకు నిర్భయంగా దిగు తున్నారు. ఇక ర్యాగింగ్ పేరుతో కొందరు సీనియర్స్... విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొనేంతగా వేధింపులకు గురి చేయ డమూ కనిపిస్తోంది. శరీరాలను నగ్నంగా చూడాలనే... మనుషులను వేధించి, బాధించి ప్రేమను పొందాలనే మానవుడిలో అంతర్ నిహి తంగా వున్న క్రూర స్వభావాన్ని జనారణ్యంలో ప్రదర్శించడం అనేది, ఈనాడు కొందరు విద్యార్థులకు ఒక దినచర్యగా మారింది. మెడికల్ కాలేజీలలో అమ్మాయిల మీద లైంగికంగా దాడులు జరుగుతున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ లైంగికంగా వేధించడం భారతదేశాన్ని కుదిపివేసింది. ఒక డాక్టరు మనిషికి ఉన్న రుగ్మతను చూడాలి. కానీ ఆమెను అనుభవించాలని అనుకోకూడదు. ఈనాటి ప్రొఫెసర్లు ఎందుకో బోధనేతర అంశాల పట్ల ఆసక్తి చూపు తున్నారు. జూదం, త్రాగుడు, క్లబ్బులు, పబ్బులు, డ్రగ్స్, ఇతర వినోదాంశాల వైపు ఉపాధ్యాయుడు వెళితే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? విద్యార్థులు జ్ఞానేతర, వినోదభరిత జీవన సంస్కృతిలో కొట్టు మిట్టాడుతున్నారు. ‘నన్ను ప్రేమించకపోతే నీ మీద యాసిడ్ పోస్తా’ నని బెదిరిస్తున్నారు. కృతిమత్వం, క్రూరత్వం కొందరు విద్యా ర్థులను అలుముకుంది. నిజానికి గ్రంథాలయ పఠనం బాగా తగ్గింది.
అందువల్ల లక్షలు పెట్టి కొన్న పుస్తకాలు వ్యర్థమవుతున్నాయి. ఈరోజు విద్యార్థినులు అన్ని రంగాలలో విద్యార్థులను దాటి ముందుకెళ్లి పోయారు. అది ఈర్ష్య యగా పరిణమించింది. ఈర్ష్య య మనిషిని విచ్ఛిన్నం చేస్తుంది. ఈర్ష్య య మనిషిని తినేస్తుంది. ఈరోజు విద్యార్థులు ప్రేమ అని చేస్తున్న ప్రపోజల్స్‌లో ప్రేమ లేదు, కామమే వుంది. కామం మనిషి కళ్లు కప్పుతుంది, అంధుణ్ణి చేస్తుంది, బధిరుణ్ణి చేస్తుంది. ఇలాంటి రుగ్మతల వల్లనే ఈ విద్యాలయాల నుంచి మంచి పరిశోధనా గ్రంథాలు రావట్లేదు.
శాస్త్రజ్ఞానం అనేది మనుష్యుల బుర్రల కెక్కాలంటే, విశ్వాసాలకు అతీతంగా ఆలోచించగలగాలి. తత్వవేత్తకు, శాస్త్రవేత్తకు సమన్వయం సాధించడంలో అద్వితీయమైన పాత్రను బెర్ట్రాండ్ రస్సెల్ సాధించాడు. డార్విన్‌లో కానీ, కారల్ మార్క్స్‌లో కానీ, మరి ఏ తాత్వి కునిలోనూ, శాస్త్రవేత్తలోనూ ఉన్న లోపాన్నీ, ఆధిక్యభావాన్నీ ఎత్తి చూపడంలో కూడా రస్సెల్ వెనుకాడలేదు. ప్రతి తత్వవేత్త, శాస్త్రవేత్త జ్ఞానానికి పరిమితులు ఉంటాయి. రాబోయే కాలం వారు గతంలో చెప్పినవాటిలో కొన్నింటిని ఖండించవచ్చు. కొన్నింటిని పూరించ వచ్చు. ఆ శాస్త్రజ్ఞానం వలన సమాజానికి జరిగే నష్టాన్ని గూర్చి చెప్ప వచ్చు. ఇదొక సత్యాన్వేషణా క్రమం.
ప్రతి పౌరుడు, విద్యార్థి, పరిశోధకుడు... శాస్త్రవేత్తల జీవితాలను అధ్యయనం చేయడం వలన స్ఫూర్తి పొందవచ్చు. అంతేకాదు, వారి అధ్యయన క్రమాన్నీ, పరిశోధనా క్రమాన్నీ మనం అనుసరించవచ్చు. చార్లెస్ డార్విన్ గొప్ప పరిశోధకుడే కాదు, గొప్ప అధ్యయనపరుడు కూడా! ఆయనది శాస్త్రపరమైన రచన. ఆయన జీవితంలోని ఆటు పోటులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అపారమైన ధైర్యశాలి ఆయన. అనేక జంతు సమూహాలనూ, పక్షి సమూహాలనూ, సముద్రాలనూ, వివిధ ఖండాలనూ చూసినపుడు సహజంగా ఆ ధైర్యం వస్తుంది. జీవులు జనిస్తాయి, నశిస్తాయనే శాస్త్ర జ్ఞానం అబ్బుతుంది. ఆ అవ గాహనే అపారమైన శక్తినీ, వ్యక్తిత్వ నిర్మాణాన్నీ మనిషికి కలుగజేస్తుంది.
జీవించడమే కాదు, ఈ జీవుల ప్రాదుర్భావాన్ని గూర్చి తెలుసుకోవడం కూడా ఒక గొప్ప జ్ఞానమే. ఈ పునాదిగా శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. 20వ శతాబ్దిలో ఎరిక్ కండెల్ చేసిన పరిశోధనలు కొత్త వెలుగులు చూశాయి. కండెల్ బయో కెమిస్త్రీ, బయో ఫిజిక్స్‌లను అధ్యయనం చేసి ‘ఇన్ సెర్చ్ ఆఫ్ మెమొరీ: ది ఎమర్జెన్స్ ఆఫ్ ఏ న్యూ సైన్స్ ఆఫ్ మైండ్’ అనే గ్రంథం రాశాడు. ఇందులో ఆద్భుత విషయాలు తెలియ చేశాడు. న్యూరో సైన్సుపై అభిరుచితో మనిషి జ్ఞాపక శక్తి గురించి ఎంతో పరిశోధన చేశాడు.
జంతువులకు, మనుషులకు జ్ఞాపకశక్తిలో ఎంతో తేడా ఉందని కనిపెట్టాడు. ఇపుడు సైన్సు శాఖోపశాఖలుగా విస్తరించడానికి ఆనాడు డార్విన్ చేసిన పరిశోధనలే ప్రధాన కారణం. నిజానికి డార్విన్ లాగా, ఐన్‌స్టీన్‌లాగా మన విశ్వవిద్యాలయాలలో పరి శోధన చేస్తే భారతదేశం ప్రపంచానికి ఒక ఆదర్శమయ్యేది. కానీ దురదృష్టవశాత్తూ జ్ఞానార్జనకు నెలవు కావాల్సిన చోట మతోన్మాదం, కులోన్మాదాలు పెరిగాయి. రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద అరాచకత్వం పెరిగిపోతోంది. చరిత్ర జ్ఞానాన్ని నిరాకరిస్తూ, పౌరాణిక జ్ఞానానికి పతాక లెత్తుతున్నారు. దుష్ట శిక్షణ పేరుతో దళితుల్ని, మైనారిటీలను వేటాడు తున్నారు. కులతత్వంతో ఊగిపోతూ కులాంతర వివాహితులను వేధి స్తున్నారు. అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ జ్ఞాన శూన్యులుగా జీవిస్తున్నారు. మైనారిటీలైన ఆచార్యులను కించ పరుస్తున్నారు. చరిత్రలో ప్రసిద్ధులైన అశోకుడు, అంబేడ్కర్ అంతటి వాళ్లను తక్కువచేస్తూ, బౌద్ధ సంస్కృతిని నిరాకరిస్తున్నారు. ఓ పక్క కార్పొరేట్ శక్తులకు బానిసలుగా ఉండి అమెరికన్ సామ్రాజ్య వాదానికి తొత్తులై, ఇజ్రాయెల్ దాడులను సమర్థిస్తూ, మహిళా విద్యార్థినులను హింసిస్తూ, విశ్వవిద్యాలయాలను భయకంపిత కేంద్రాలుగా చేస్తున్నారు.
విశ్వవిద్యాలయం అంటే ఒక విజ్ఞాన అధ్యయన, బోధన కేంద్ర మని మరిచిపోయారు. మతోన్మాద క్రీడలకు నెలవు చేస్తున్నారు.శాంతి, కాంతులను విధ్వంసిస్తూ ఉన్మాదాన్ని, ఉద్రేకాన్ని కలిగి స్తున్నారు. అందుకే అంబేడ్కర్ భావజాలంతో పాటు, అంబేడ్కర్ గ్రంథాలయాలు, అంబేడ్కర్ పరిశోధనా కేంద్రాలు అన్నీ విశ్వవిద్యాల యాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది.
మన విశ్వ విద్యాలయాలు అంబేడ్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇమాన్యుయేల్ కాంట్, హెగెల్, జీన్‌పాల్ సాత్రే, చిన్నయ సూరి వంటి ప్రపంచ మేధావుల్ని సృష్టించాలంటే... జ్ఞానం, నీతి, వ్యక్తిత్వం, మాన వత, ప్రజ్ఞ విస్తరించాలి. అప్పుడే ప్రపంచ యవనికపై మన విశ్వ విద్యాలయాలు మెరుస్తాయి. ఆ ప్రగతి పథంలో మనం నడుద్దాం. అప్పుడే భారతదేశానికి కీర్తి వస్తుంది.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment