
సగటు కొలతలకు స్వస్తి.. ప్రతి విద్యార్థి కొలతలు సేకరించాల్సిందే
కుట్టిన యూనిఫాం సైజ్ చాలకపోతే సరిచేయాలి
విద్యార్థులు సంతృప్తి చెందితేనే స్వయం సహాయక బృందాలకు బిల్లులు
డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు.. ఈసారి స్కూళ్లకే నేరుగా వస్త్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫాం తయారీలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకొచ్చింది. సగటు కొలతలకు బదులు కచ్చితమైన కొలతలతోనే యూనిఫాం అందించాలని నిర్ణయించింది. ప్రతి విద్యార్థి కొలతలనూ టైలర్లు వ్యక్తిగతంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులంతా దీన్ని విధిగా పాటించాలని ఆదేశించింది.
గతం మాదిరి కాదు...
గతంలో యూనిఫాంకు కొలతలు తీసుకొనే పద్ధతి వేరుగా ఉండేది. విద్యార్థులందరినీ గ్రూపులుగా విభజించే వారు. ఎత్తు, లావు ఆధారంగా 10 మందిలో ఒకరి కొలత తీసుకొని మిగతా వారికి కూడా అదే కొలతలతో కుట్టేవాళ్లు. దీనివల్ల కొందరికి పొట్టిగా, మరికొందరికి వదులుగా యూనిఫాం ఉంటోంది. దీంతో కొంత మంది విద్యార్థులు టైలర్ల దగ్గరకు వెళ్లి అవసరమైన సైజ్ మేరకు యూనిఫాంలో మార్పులు చేయించుకుంటున్నారు. నిరుపేద పిల్లలు మాత్రం ఇచ్చిందే వేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో విద్యా కమిషన్ సిఫార్సులు, స్థానిక హెచ్‌ఎంల ఫిర్యాదుల దృష్ట్యా ప్రతి విద్యార్థికీ కచ్చితంగా కొలతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దుస్తులు పంపిణీ చేసిన తర్వాత విద్యార్థి నుంచి ఫిర్యాదు వస్తే తిరిగి దాన్ని సరిచేయాలని స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థి పూర్తిగా సంతృప్తి చెందితేనే స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)కు బిల్లులు మంజూరు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈసారి ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు నిక్కర్ బదులు ఫ్యాంట్లు ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం వెల్లడించింది.
19.91 లక్షల మంది విద్యార్థులు.. రెండేసి జతలు..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 19.91 లక్షల మంది విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం అందిస్తున్నారు. ఇందుకు అయ్యే వస్త్రం కోసం ప్రభుత్వం రూ. 90 కోట్లు వెచ్చిస్తోంది. స్థానిక స్వయం సహాయక సంఘాల చేత యూనిఫాం కుట్టిస్తోంది. ఇందుకుగాను వారికి కుట్టుకూలి కింద రూ. 30 కోట్లు చెల్లించనుంది. పాఠశాలల పునఃప్రారంభం రోజే యూనిఫాంను విద్యార్థులకు అందించాల్సి ఉంది.
సాధ్యాసాధ్యాల మాటేమిటి?
ప్రభుత్వ ఆదేశాలపై స్వయం సహాయక బృందాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇలాంటి ఆదేశాలిచ్చేటప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులనూ తెలుసుకోవాలని కోరుతున్నాయి. ప్రభుత్వం వస్త్రం సేకరించి జిల్లాలు, మండలాలకు పంపేందుకే మే ఆఖరు వరకు సమయం పడుతుందని అంటున్నాయి. ఆ తర్వాత కేవలం 15 రోజుల్లోనే యూనిఫాం కుట్టి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని టైలరింగ్ మహిళలు అంటున్నారు. అదీగాక.. ప్రతి విద్యార్థికి వస్త్రం సగటున అర మీటరే వస్తోందని.. దీనివల్ల కొందరికి సరిపోవట్లేదని చెబుతున్నారు.
ప్రతి జతకు ప్రభుత్వం ఇచ్చే రూ. 75 కుట్టుకూలి కనీస వేతనంగా కూడా ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో స్వయం సహాయక బృందంలో కనీసం నలుగురు చొప్పున ఉండే సభ్యులు పాఠశాలల చివరి పనిదినంలోగా కొలతలు తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు సొంతంగా కొలతలు తీసుకొని పంపిస్తే తమకు తేలికగా ఉంటుందని చెబుతున్నారు.
టెన్షన్ పెడితే ఎలా?
ప్రభుత్వం ఇచ్చే కుట్టుకూలీ కనీసం ట్రాన్స్‌పోర్టు ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. వస్త్రం సగటున ప్రతీ విద్యార్ధికి 50 సెంటీమీటర్లే వస్తుంది. అదీగాక 15 రోజుల్లో కుట్టి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. మా పరిస్థితినీ ప్రభుత్వం ఆలోచించాలి. టెన్షన్ పెడితే ఎలా? ప్రతీ స్కూల్‌కు వెళ్ళి కొలతలు తీసుకొని, యూనిఫాం అందించాంటే 45 రోజులు పడుతుంది. అంత సమయం ఎక్కడిస్తున్నారు. కొలతలు వాళ్ళే తీసి ఇవ్వాలి. అప్పుడే సమయం కలిసి వస్తుంది.
– ఎ. మాధవీగౌడ్ (టైలర్, కరీంనగర్)
ఎక్కువ మంది టైలర్లను తీసుకుంటే సమస్యకు పరిష్కారం
ప్రతి విద్యార్ధికి కచ్చితమైన కొలతలతో యూనిఫాం అందించాలనే నిర్ణయం సరైందే. సరిగా కుట్టలేదని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అయితే టైలర్ల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కుట్టడానికి ఎక్కువ మందిని పెడితే సమస్య పరిష్కారం అవుతుంది.
– పరాంకుశం రాజాభాను చంద్రప్రకాశ్ (ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధాయుల సంఘం పూర్వ అధ్యక్షుడు)