
హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తానీయులు వీసా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన వారు వెంటనే తమ రాష్ట్రాలను వీడి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్.. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే స్వదేశీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుండి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలి. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’ అని డీజీపీ జితేందర్ హెచ్చరించారు.
కాగా, భారత్‌లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాల అమలుకు భారత్ వడివడిగా అడుగువేస్తోంది. వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం పాక్ పౌరులకు జారీ చేసిన అన్నీ వీసాలను భారత్ రద్దు చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.