ఇంటర్‌ నుంచి వర్సిటీ దాకా... | Abolition of College Service Commission in 1985 | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ నుంచి వర్సిటీ దాకా...

Published Mon, Sep 16 2024 6:00 AM | Last Updated on Mon, Sep 16 2024 6:00 AM

Abolition of College Service Commission in 1985

ఉన్నత విద్యలోని నియామకాలన్నీ ఒకే గొడుగు కిందకు..

మళ్లీ తెరపైకి కాలేజీ సర్వీస్‌ కమిషన్‌ 

1985లో కాలేజీ సర్వీస్‌ కమిషన్‌ రద్దు... పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నియామకాలు.. 

త్వరలో ఇతర రాష్ట్రాల్లో అధికారుల అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్, డిగ్రీ, టెక్నికల్, వర్సిటీ ఇలా ఉన్నత విద్యావ్యవస్థలోని నియామకాలన్నీ ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా కాలేజీ సర్వీస్‌ కమిషన్‌ను తెర మీదకు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సాంకేతికవిద్య విభాగం అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాలేజీ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు వల్ల నియామక విధానంలో కొత్తదనం ఉంటుందని భావిస్తున్నారు.

కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు రద్దు?..: రాష్ట్రంలో 11 యూనివర్సిటీలున్నాయి. వాటి పరిధిలో నియామకాలన్నీ ఆయా యూనివర్సిటీలే కామన్‌గా నోటిఫికేషన్‌ ఇచ్చి.. చేపడుతున్నాయి. ఈ విధానంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గత ప్రభు­త్వం మార్పులు చేసింది. అన్ని యూనివర్సిటీలకు కలిపి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ సహా, పలువురు విద్యావేత్తలను బోర్డులో చేర్చింది. అయితే, ఈ బోర్డు ఇప్పటి వరకూ ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. దీనిపై యూనివర్సిటీల నుంచి వ్యతిరేకత వచ్చింది. 

మరోవైపు ఇంటర్, డిగ్రీ కాలేజీల అధ్యాపకుల నియామకాన్ని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్స్, ఇతర పరీక్షలు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిధిలో ఉన్నాయి. అధ్యాపకులు, ప్రొఫెసర్ల నియామకం కూడా చేపట్టాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని భావిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేపట్టడం వల్ల జాప్యం కూడా జరుగుతోందనే విమర్శలొస్తున్నాయి. 

కమిషన్‌ పాతదే...
కాలేజీ సర్వీస్‌ కమిషన్‌ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పట్నుంచో ఉంది. కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను గుర్తించి, కమిషన్‌కు తెలియజేస్తారు. కమిషన్‌ నేతృత్వంలోని కమిటీ పరీక్షలు చేపడుతుంది. అయితే 1985లో ఈ కమిషన్‌ను రద్దు చేశారు. నియామకాలన్నీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిధిలోకి తెచ్చారు. మళ్లీ కాలేజీ సర్వీస్‌ కమిషన్‌కు ఊపిరి పోయడంతోపాటు విశిష్టమైన అధికారాలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికారవర్గాలు అంటున్నాయి. 

ప్రైవేట్‌ కాలేజీలు, యూనివర్సిటీల్లో అర్హత లేని ఫ్యాకల్టీని నియమిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని, ప్రైవేట్‌ కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీ అర్హతలను ఈ కమిషన్‌ పరిశీలించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్‌ కాలేజీలను ఇంజనీరింగ్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని భావిస్తున్నారు. ఐటీఐలను కూడా ఆధునికీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్య కాలేజీల్లో నియామకాలనూ ఈ కమిషన్‌ పరిధిలోకి తెచ్చే ఆలోచన ఉన్నట్టు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement