
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
30న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ జితేందర్
అక్టోబర్ 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న శివధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : నూతన డీజీపీగా బత్తుల శివధర్‌రెడ్డి నియమితుల య్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్‌రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుత డీజీపీ డా.జితేందర్ ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్నారు. ఆయన స్థానంలో డీజీపీ (హెచ్‌ఓపీఎఫ్– హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) ఫుల్ అడిషనల్ చార్జ్‌గా శివధర్‌రెడ్డి ఉంటారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పోస్టులో కొనసాగుతారన్నారు.
సమర్థుడైన అధికారిగా...
శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌లో చదువుకున్న శివధర్ రెడ్డి.. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఐపీఎస్‌లోకి ప్రవేశించారు. ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేశారు.
గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్లగొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. ఎస్‌ఐబీలో డీఐజీగా కూడా మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించారు. 2014లో తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2016లో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లోనూ కీలకంగా వ్యవహరించారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా శివధర్ రెడ్డి పనిచేశారు.
2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్ల ఘటనలో 14 మంది చనిపోయిన ఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా అప్పటి ప్రభుత్వం ఆయనను నియమించింది. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో తీవ్రంగా శ్రమించి, శాంతి భద్రతలను సమర్థంగా కాపాడిన అధికారిగా గుర్తింపు పొందారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 2024లో డీజీపీగా ప్రమోషన్ పొందిన తర్వాత కూడా అదే పోస్టులో కొనసాగుతున్నారు. ఉత్తమ సేవలకు గాను శివధర్‌రెడ్డి గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు.
