సాక్షి, హైదరాబాద్ : పక్క చిత్రంలో కనిపిస్తున్న పోలీసు అధికారి పేరు డి. రవిరాజ్. వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు పారిపోయిన దొంగలను తీసుకురావడంలో ఈయన స్పెషలిస్ట్. గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేసేవారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో 24 గంటల డ్యూటీ. తన స్టేషన్ పరిధిలోని గ్రామాల సర్పం చులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో రోజూ సమావేశాలు... రెవెన్యూ, ఆరోగ్య సిబ్బందితో సభలు.. గ్రామస్తులకు అవగాహన సమావేశాలు... గతంలో స్టేషన్ నుంచి రోజుకు లంచ్‌కు, రాత్రి పూట డ్యూటీ ముగించుకుని రెండుసార్లు ఇంటికి వెళ్లేవాడు. జనతా కర్ఫ్యూ నుంచి నేటి దాకా రోజుకు కేవలం రాత్రిపూట మాత్రమే వెళుతున్నాడు.
తాను రోజూ బయట తిరుగుతూ విధులు నిర్వర్తించాల్సిన నేపథ్యంలో వ్యక్తిగతంగా బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినా.. ఇంటి వారితో మనస్ఫూర్తిగా కలవలేకపోతున్నాడు. తన ద్వారా కుటుంబ సభ్యులకు ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళనలో ఉన్నాడు. అందుకే వేరే గదిలో పడుకుంటున్నాడు. తనకు పంచ ప్రాణా లైన ఇద్దరు కూతుళ్లతో కలసి సమ యం గడపలేకపోతున్నాడు. మునుపటిలా కలివిడిగా ఉండలేకపోతున్నాడు. ఉండేది క్వార్టర్స్‌లోనే అయినా టిఫిన్, లంచ్, రాత్రి భోజ అంతా బయటే చేస్తున్నాడు. ఒక్క రవిరాజే కాదు... తుమ్ముతూ, దగ్గుతూ తన వద్దకు వస్తున్న వారికి మందులు ఇస్తున్న ఫార్మసిస్టు కోడి శివప్రసాద్, తన తండ్రిని కనీసం చూడలేకపోతున్న పోలీసు అధికారి విశ్వేశ్వర్ కుమార్తె అన్వి... ఎంతో శక్తివంతమైన సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం భుజాన వేసుకొని వీపు బొబ్బలెక్కుతున్నా లెక్క చేయకుండా పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు యాదయ్య, సిలిండర్ భుజాన వేసుకొని నాలుగు అంతస్తులు ఎక్కి వంట గ్యాస్ అందించే నల్లగొండ రామలింగయ్య, ఖమ్మం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, పిల్లలు వద్దంటున్నా డ్యూటీకి వెళ్తున్న నర్సు సులోచన... ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రస్తుతం అత్యవసర సేవల కింద విధులు నిర్వహిస్తున్న లక్షలాది మంది ప్రజాసైనికులది ఇదే పరిస్థితి.
దేశం, రాష్ట్రం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను దీటుగా ఎదుర్కొని ఊపిరి బిగబట్టయినా తన విధులు నిర్వహించి ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా కరోనా మహమ్మరిని పారదోలేందుకు కృషి చేస్తున్న అందరిదీ ఇదే వ్యథ... కాదు... ఇదే కష్టం. తమకు ఎదురయ్యే కష్టాలను దిగమింగుకుంటూ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వారి వీర గాథ ఇది. సాధారణ పరిస్థితుల్లో సమాజం చిన్నచూపు చూసే కార్మికుల ఆసరా, వైద్యో నారాయణో హరి అని చెప్పుకొనే వైద్యుల భరోసా, కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అని గర్వపడే మన పోలీసు సిబ్బంది రక్షణ.. ఇలా చెప్పుకుంటూ పోతే మున్సిపల్, గ్రామ పంచాయతీ, విద్యుత్, ఫార్మా, గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ బంకుల సిబ్బంది, రైతులు, బ్యాంకు సిబ్బంది... ఈ ప్రజా సైనికుల కష్టమే ఇప్పుడు మనల్ని కరోనా కష్టాల కడలి నుంచి తీరాన్ని చేర్చే ప్రయత్నం చేస్తోంది. డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చేంత వరకు వారి కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ, ఆందోళన నెలకొన్నా దాన్ని ఈ సైనికులు ఖాతరు చేయడం లేదు. కష్టకాలంలో తమ వారిని ఇబ్బంది పెట్టయినా సరే సమాజం కోసం పనిచేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా కరోనా కర్కశ రక్కసిపై కఠోర యుద్ధం చేస్తున్నారు. అందుకే విపత్కాలంలో సమాజానికి అండగా నిలుస్తున్న మానవ రూపంలోని దేవుళ్లందరికీ ‘సాక్షి’సెల్యూట్ చేస్తోంది.
జన సైనికులు వీరే...!
కరోనా రక్కసి నుంచి మనల్ని కాపాడేందుకు వైద్య, పోలీసు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, విద్యుత్, ఫార్మా, గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ బంకుల సిబ్బంది, కూరగాయల రైతులు, బ్యాంకు సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. దైనందిన జీవితంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇతర మున్సిపల్, అంగన్‌వాడీ సిబ్బంది కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వారిలో వైద్య సిబ్బందే 50 వేల వరకు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 2,556 మంది ప్రభుత్వ వైద్యులు (ఎంబీబీఎస్), 3,796 మంది స్పెషలిస్టులు, 10,900 మంది స్టాఫ్ నర్సులు, 11,886 మంది పారామెడికల్ సిబ్బందితో కలిపి 49,709 మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. వారితోపాటు డీజీపీ నుంచి హోంగార్డు వరకు 53 వేల మంది పోలీసు సిబ్బంది 24 గంటలూ రోడ్లపైనే ఉంటున్నారు. 12,751 గ్రామ పంచాయతీలు, 140 వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో దాదాపు 70 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, 30 వేల మంది పెట్రోలు బంక్ సిబ్బంది, 10 వేల మంది వరకు వంట గ్యాస్ డెలివరీ బాయ్స్, వేలాది మంది ఫార్మసిస్టులు, కూరగాయల రైతులు, బ్యాంకు సిబ్బంది, విద్యుత్ రంగంలో పనిచేస్తున్న వారు ఇప్పుడు కరోనా నివారణ మహా క్రతువులో పాలుపంచుకుంటున్నారు. వాళ్లందరి సహకారం, ప్రజల నిబద్ధత, చిత్తశుద్ధితో కరోనా భూతంపై తెలంగాణ అప్రతిహత విజయాన్ని సాధించాలని ఆశిద్దాం. చివరిగా వారందరి పక్షాన మూడు మాటలు.... ఈ నెల 14 వరకు ఇళ్లు వదిలి అనవసరంగా బయటకు రాకండి... 20 నిమిషాలకోసారి చేతులు కడుక్కోండి.... సామాజిక దూరాన్ని పాటించండి.
పిల్లలు వద్దన్నా డ్యూటీకి...
‘అమ్మా... డ్యూటీకొద్దు..
ఇంటి దగ్గరే ఉండమని పిల్లలు అంటున్నా వస్తున్నాను. ప్రస్తుతం కరోనా అంటేనే అంతా భయ
పడుతున్నారు. అయినప్పటికీ మాది సేవతో కూడిన ఉద్యోగం. పీహెచ్‌సీకి వచ్చిన వారికి కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం. జ్వరం, జలుబు లాంటి లక్షణాలుంటే వరంగల్ ఎంజీఎంకు పంపిస్తున్నాం’
– ఎం. సులోచన, స్టాఫ్‌నర్సు, వంగర పీహెచ్‌సీ, వరంగల్ జిల్లా
ఫార్మసిస్టుగా నా బాధ్యత
మెడికల్ షాపులో పనిచేయడం ప్రస్తుత పరిస్థితుల్లో కత్తిమీద సామే. అవగాహన ఉన్నవారు షాపులకు మాస్కులతో వస్తున్నారు కానీ లేనివారు మాత్రం తుమ్ముతూ, దగ్గుతూ వస్తున్నారు. వారికి ఏం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. అయినా సామాజిక దూరాన్ని పాటిస్తూనే మందులిచ్చి పంపిస్తున్నాం. పారామెడికల్ అత్యవసర సేవలు కనుక మేం పనిచేయాల్సిందే... చేస్తాం కూడా. దేశానికి సేవ చేయడం ఓ యువకుడిగా, ఫార్మసిస్టుగా నా బాధ్యత. అందరం కలసి ఈ మహమ్మరిని పారదోలే వరకు పోరాడుదాం.
– కోడి శివప్రసాద్, రిజిస్టర్డ్ ఫార్మసిస్టు, జ్యూపిటర్ ఫార్మసీ, తూప్రాన్, మెదక్ జిల్లా
ఐ మిస్ యూ డాడీ...
గతంలో డాడీ రోజుకు 2–3 సార్లు ఇంటికి వచ్చేవారు. కానీ కరోనా కారణంగా డాడీ ఇంటికి సరిగ్గా రావట్లేదు. నాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు. నేను నిద్రపోయాక వస్తున్నాడు. లేచేలోగా మళ్లీ డ్యూటీకి వెళ్లిపోతున్నాడు. ముఖానికి మాస్కుతోనే వీడియో కాల్ చేస్తున్నాడు. ఒక్కోసారి అసలు నా ఫోన్ కూడా తీయడం లేదు. డాడీని చాలా మిస్సవుతున్నా. కరోనా రాకుండా చేతులకు శానిటైజర్ వాడాలని మా టీచర్ చెప్పింది.. అదే విషయాన్ని డాడీకి కూడా చెబుతున్నా. మా డాడీ గ్రేట్. జనాలకు కరోనా రాకుండా చేసేందుకు రోజంతా వారి కోసమే డ్యూటీ చేస్తున్నాడు. ఐ లవ్ మై డాడీ. బట్ ఐ మిస్ యూ డాడీ.. టేక్ కేర్.
– అన్వి, విశ్వేశ్వర్, వరంగల్ కమిషనరేట్ ఇన్‌స్పెక్టర్ కుమార్తె
అంకితభావంతో పనిచేస్తున్నాం..
ప్రతి ఒక్కరి సహకారంతో, అంకితభావంతో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నాం. వ్యాధిపట్ల అవగాహన కల్పిస్తూనే వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన అంశాలను వివరిస్తున్నాం. కరోనా అనుమానితులు ఆందోళన చెందకుండా వారికి మనోధైర్యం కల్పిస్తున్నాం. సహచర వైద్య సిబ్బంది సహకారం మరువలేనిది. మా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నా సేవ చేయడమే వృత్తి ధర్మంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారికి నిజంగా రుణపడి ఉంటాం. వైద్య సిబ్బంది సేవలను అందరూ గుర్తించాలి.
– ఖమ్మం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ బి. వెంకటేశ్వర్లు
బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నాం...
కరోనా మహమ్మారి అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుండంతో బిక్కుబిక్కుమంటూ శానిటేషన్ పనులు చేస్తున్నా. నాకు భార్య, కుమార్తె, కుమారుడున్నారు. విధులకు వచ్చే ముందు వాళ్లు జాగ్రత్తలు చెపుతుంటారు. జీవనాధారం ఇదే కావడంతో విధులకు హాజరవుతూ ప్రజల కోసం పనిచేస్తున్నా. పవర్‌పుల్‌గా ఉండే సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో కూడిన డబ్బాను భుజానికి తగిలించుకోని పిచికారి చేస్తుండంతో వీపుకు బొబ్బలు వస్తున్నాయి. చెత్త చెదారాన్ని ఎత్తిపోయడమేగాక, అంటువ్యాధులతో పనిచేస్తున్న మాకు తక్కువ జీతభత్యాలు ఇస్తుండడమే బాధనిపిస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా మా విలువ ఏంటో అందరికీ అర్థం అయితే అదే సంతోషం.
– ఎ. యాదయ్య, పారిశుద్ధ్య కార్మికుడు ఇబ్రహీంపట్నం, మున్సిపాలిటీ
మేం లేకపోతే వంట ఎలా?
కరోనా వస్తుందని మేం భయపడి ఇళ్లలో కూర్చుంటే అందరి ఇళ్లలో పొయ్యిలు ఎలా వెలుగుతాయి? గ్యాస్ లేకపోతే ఈ రోజుల్లో ఒక్క క్షణం కూడా గడవదు. మామూలు రోజుల్లోనే గ్యాస్ రావడం ఆలస్యమైతే 100 సార్లు ఫోన్లు చేస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేం లేకపోతే ఎలా? నిత్యం ప్రమాదం పొంచి ఉన్న గ్యాస్ సిలిండర్లను మోసుకొని వెళ్లే మమ్మల్ని కరోనా ఏం చేస్తుంది? గ్యాస్ పేలిన దానికన్నా ప్రమాదం కాదు కదా. అందుకే మా కుటుంబ సభ్యులు వద్దన్నా ధైర్యంగా విధులకు వెళుతున్నాం... వెళ్తాం కూడా.
– కె. రామలింగయ్య, శ్రీసాయిదుర్గా గ్యాస్ ఏజెన్సీ, నల్లగొండ
శానిటైజేషన్ తర్వాతే పెట్రోల్ పోస్తున్నాం..
మాది హన్మకొండ మండలంలోని భట్టుపల్లి గ్రామం. గత కొన్నేళ్లుగా పెట్రోల్ బంకులో పనిచేస్తున్నా. కరోనా వ్యాప్తి గురించి తెలిసి గత 15 రోజులుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వైరస్ ప్రభావం ఎంతగా ఉందో టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకుంటున్నాం. మా యాజమాన్యం సైతం మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ప్రతి ఒక్కరికీ శానిటైజర్ బాటిల్‌తోపాటు మాస్కులు ఇచ్చింది. వాహనానికి పెట్రోల్ పోసే ప్రతిసారీ చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నాం. ఆ తర్వాతే పెట్రోల్ పోస్తున్నాం. మాస్కులు ఇబ్బందిగా ఉన్నప్పుడు చేతి రుమాలు కట్టుకుంటున్నాం. వాహనదారుడికి వీలైనంత దూరంగా ఉంటున్నాం.
– సురేష్, పబ్లిక్ గార్డెన్ పెట్రోల్ పంపు, హన్మకొండ
Comments
Please login to add a commentAdd a comment