
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండో రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని అన్ని ట్రాఫిక్ కూడళ్లలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 350 చెక్‌పోస్టులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బారికేడ్లు పెట్టి పలు ఫ్లైఓవర్లను పోలీసులు మూసేస్తున్నారు. కొన్ని చోట్ల ఉదయం 10 గంటల తర్వాత కూడా జనాలు రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై జనాలను ఇళ్లకు వెళ్లవల్సిందిగా కోరుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఉదయం పది గంటల వరకే సమయం ఉండటంతో నిత్యావసరాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివచ్చారు. మరోవైపు.. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌ను వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అన్న విషయం తెలిసిందే.
► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కుకు వేలసంఖ్యలో వలస కార్మికులు చేరుకుంటున్నారు. దీంతో.. రిజర్వేషన్ ఉన్నవారినే చెక్ చేసి రైల్వే అధికారులు వారిని స్టేషన్ లోపలికి అనుమతిస్తున్నారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఒరిస్సా, యూపీ, మహారాష్ట్రలకు కూలీలు తరలివెళ్తున్నారు. స్టేషన్ బయట కిలోమీటర్ల మేర బారులు తీరారు.
► కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి కూరగాయల మార్కెట్‌లో ప్రజలు బారులు తీరారు. రంజాన్ సందర్భంగా నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మైనార్టీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉదయం 10 వరకే దుకాణాలు తెరిచి ఉండటంతో పలు మార్కెట్లు రద్దీగా మారాయి.
► కరీంనగర్: కరీంనగర్‌లో పలు చోట్ల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం నాలుగు గంటల పాటు ఉండడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం జనం అధిక సంఖ్యలో మార్కెట్లకు తరలి వస్తున్నారు. దీంతో పలు చోట్ల రోడ్లు ట్రాఫిక్ జామ్‌తో రద్దీగా మారాయి.
► యాదాద్రి భువనగిరి: భువనగిరిలో నిత్యవసర వస్తువులు, కూరగాయల కోసం ప్రజల పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. దీంతో కూరగాయల మార్కెట్లు కిక్కిరిసి పోయాయి. దీంతో రోడ్డపై ట్రాఫిక్ జామ్ అయింది.