ఎంగిలి ప్లేట్లు తీసిన న్యాయమూర్తి  | Judge Of HighCourt Done Social Service By Cleaning Dinner Plates | Sakshi
Sakshi News home page

ఎంగిలి ప్లేట్లు తీసిన న్యాయమూర్తి 

Published Sat, Oct 12 2019 7:33 AM | Last Updated on Sat, Oct 12 2019 7:33 AM

Judge Of HighCourt Done Social Service By Cleaning Dinner Plates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆయన హైకోర్టు న్యాయమూర్తి. అధికారం.. హోదా.. చిటికేస్తే పనులు చేసిపెట్టే మనుషులు.. ఇలా అన్నీ ఉన్నా ఆయన వాటన్నింటినీ పక్కన పెట్టారు. ఆయనే స్వయంగా ఎంగిలి పేట్లు ఎత్తారు. ఈ ఘటనకు హైకోర్టు ప్రాంగణం వేదికైంది. శుక్రవారం సాయంత్రం హైకోర్టులో సీని యర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అందరూ టీ తాగారు.. బిస్కెట్లు.. సమోసాలు తిన్నారు. ఎప్పటి లాగే ప్లేట్లు అక్కడే పడేసి వెళ్లిపోయారు. ఇదంతా గమనిస్తున్న జస్టిస్‌ చల్లా కోదండరామ్‌కు మనసు చివుక్కుమంది. న్యాయవాదులుగా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలా ఎక్కడపడితే అక్కడ, అది కూడా హైకోర్టు ప్రాంగణాన్ని అపరిశుభ్రంగా మార్చడాన్ని భరించలేకపోయారు. వెంటనే స్వయంగా వచ్చి ఈ ప్రదేశం మొత్తం తిరుగుతూ న్యాయవాదులు పడేసిన ఎంగిలి ప్లేట్లను ఎత్తడం ప్రారంభించారు. మొదట్లో న్యాయవాదులకు ఆయన ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఆ తర్వాత ఎంగిలి ప్లేట్లు తీస్తున్నారని అర్థం చేసుకున్న న్యాయవాదులు వారు ఆయనతో పాటు ప్లేట్లను తీయడం ప్రారంభించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సూర్యకరణ్‌రెడ్డి కూడా జస్టిస్‌ కోదండరామ్‌తో కలిసి ఈ ప్లేట్‌లను తీసేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement