Challa kodandaram
-
ఎంగిలి ప్లేట్లు తీసిన న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్ : ఆయన హైకోర్టు న్యాయమూర్తి. అధికారం.. హోదా.. చిటికేస్తే పనులు చేసిపెట్టే మనుషులు.. ఇలా అన్నీ ఉన్నా ఆయన వాటన్నింటినీ పక్కన పెట్టారు. ఆయనే స్వయంగా ఎంగిలి పేట్లు ఎత్తారు. ఈ ఘటనకు హైకోర్టు ప్రాంగణం వేదికైంది. శుక్రవారం సాయంత్రం హైకోర్టులో సీని యర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అందరూ టీ తాగారు.. బిస్కెట్లు.. సమోసాలు తిన్నారు. ఎప్పటి లాగే ప్లేట్లు అక్కడే పడేసి వెళ్లిపోయారు. ఇదంతా గమనిస్తున్న జస్టిస్ చల్లా కోదండరామ్‌కు మనసు చివుక్కుమంది. న్యాయవాదులుగా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలా ఎక్కడపడితే అక్కడ, అది కూడా హైకోర్టు ప్రాంగణాన్ని అపరిశుభ్రంగా మార్చడాన్ని భరించలేకపోయారు. వెంటనే స్వయంగా వచ్చి ఈ ప్రదేశం మొత్తం తిరుగుతూ న్యాయవాదులు పడేసిన ఎంగిలి ప్లేట్లను ఎత్తడం ప్రారంభించారు. మొదట్లో న్యాయవాదులకు ఆయన ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఆ తర్వాత ఎంగిలి ప్లేట్లు తీస్తున్నారని అర్థం చేసుకున్న న్యాయవాదులు వారు ఆయనతో పాటు ప్లేట్లను తీయడం ప్రారంభించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సూర్యకరణ్‌రెడ్డి కూడా జస్టిస్ కోదండరామ్‌తో కలిసి ఈ ప్లేట్లను తీసేశారు. -
ఆ రైతుల ఆధారాలను పరిగణనలోకి తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ రిజర్వాయర్ నిర్మాణం కోసం తీసుకున్న భూములకు నష్ట పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందంటూ పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. మిగిలిన వారితో సమానంగా ఎకరాకు రూ.10 లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తానికి అర్హులమనేందుకు ఈ రైతులు సమర్పించే అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని భూసేకరణ చట్టం కింద ఏర్పాటైన పరిహార సాధికార సంస్థను హైకోర్టు ఆదేశించింది. ‘ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం పరిహార సాధికార సంస్థ ముందు పెండింగ్‌లో ఉంది. దీని విషయంలో ఎటువంటి వివాదానికి తావు లేదు. ఈ సంస్థ న్యాయపరమైన సంస్థ. శతాబ్దానికి పైగా అమల్లో ఉన్న సూత్రాలను అనుసరించి పరిహారాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. రూ.10 లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తం పరిహారానికి అర్హులమనేందుకు పిటిషనర్లు సమర్పించే అన్ని ఆధారాలను ఈ సాధికార సంస్థ చట్ట నిబంధనలకు లోబడి పరిగణనలోకి తీసుకోవాలి’అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లాకోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. తమ భూముల విషయంలో జారీ చేసిన పరిహార ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పక్క భూములకు ఎకరాకు రూ.13.75 లక్షలు పరిహారం ఇచ్చి, తమ భూములకు మాత్రం కేవలం రూ.3 లక్షలే చెల్లిస్తున్నారని వారు కోర్టుకు నివేదించారు. నిర్ణయించిన పరిహారానికి సమ్మతి తెలియజేయలేదన్న కారణంతోనే ఈ విధంగా తమ పట్ల వివక్ష చూపుతున్నారని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తాము నిర్ణయించిన పరిహారానికి పిటిషనర్లు అంగీకరించలేదని తెలిపారు. అందుకే వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని కలెక్టర్ వద్ద డిపాజిట్ చేశామన్నారు. తాము రూ.10 లక్షలు అంతకన్నా ఎక్కువ మొత్తం పరిహారానికి అర్హులమంటూ పిటిషనర్లు పూర్తి ఆధారాలు సమర్పిస్తే, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను పరిహార సాధికార సంస్థకు సమర్పించాలని రైతులకు సూచించారు. -
ఐటీ చెల్లింపులో హెచ్ఎండీఏకు ఊరట
అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దుచేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కు హైకోర్టు ఊరటనిచ్చింది. హెచ్ఎండీఏకు వ్యతిరేకంగా ఆదాయపు పన్నుశాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ చల్లా కోదండరామ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. బ్యాంకు ఖాతాల జప్తునకు జారీ చేసిన ఉత్తర్వులను సైతం ఎత్తివేసింది. అయితే ఆదాయపు పన్నుశాఖకు రూ. 10 కోట్లు చెల్లించాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. భూముల అమ్మకానికి సంబంధించి వచ్చిన ఆదాయంపై 2003-04, 2006-07 నుంచి 2008-09 వరకు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ. 664.68 కోట్లు పన్ను రూపేణా చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేయగా, హెచ్ఎండీఏ దాదాపు రూ. 180 కోట్లు చెల్లించింది. మరో రూ. 480 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ తరువాత ఆదాయపు పన్నుశాఖ మరో రూ. 160 కోట్లు వసూలు చేసింది. మిగిలిన మొత్తాల కోసం ఆదాయపుపన్నుశాఖ ఒత్తిడి చేస్తుంటే, ట్రిబ్యునల్ నుంచి హెచ్ఎండీఏ స్టే పొందింది. అయితే రూ. 10 కోట్లు చెల్లించాలని ట్రిబ్యునల్ షరతు విధించింది. తరువాత విచారణ సమయంలో మరో రూ. 15 కోట్లు చెల్లించాలని హెచ్ఎండీఏను అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇదే సమయంలో ఐటీ అధికారులు హెచ్ఎండీఏ బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ హెచ్ఎండీఏ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలు చేసింది. తాము విక్రయించిన భూములు సొంతవి కావని, ప్రభుత్వం తరఫున తాము ఏజెంట్‌గా మాత్రమే వ్యవహరిస్తూ లావాదేవీలు జరిపామని హెచ్ఎండీ తరఫున సీనియర్ న్యాయవాది కృష్ణ కౌండిన్య కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం... రూ. 15 కోట్లు చెల్లించాలంటూ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే రూ. 10 కోట్లు చెక్కు రూపంలో ఇవ్వాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. అలాగే ఈ మొత్తం కేసుకు సంబంధించి ఈ నెల 21న జరగాల్సిన వాదనలు యథాతథంగా జరగాలని, ఎటువంటి వాయిదాలూ కోరరాదని హెచ్ఎండీఏకు స్పష్టం చేసింది.