
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ రిజర్వాయర్ నిర్మాణం కోసం తీసుకున్న భూములకు నష్ట పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందంటూ పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. మిగిలిన వారితో సమానంగా ఎకరాకు రూ.10 లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తానికి అర్హులమనేందుకు ఈ రైతులు సమర్పించే అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని భూసేకరణ చట్టం కింద ఏర్పాటైన పరిహార సాధికార సంస్థను హైకోర్టు ఆదేశించింది. ‘ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం పరిహార సాధికార సంస్థ ముందు పెండింగ్‌లో ఉంది. దీని విషయంలో ఎటువంటి వివాదానికి తావు లేదు.
ఈ సంస్థ న్యాయపరమైన సంస్థ. శతాబ్దానికి పైగా అమల్లో ఉన్న సూత్రాలను అనుసరించి పరిహారాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. రూ.10 లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తం పరిహారానికి అర్హులమనేందుకు పిటిషనర్లు సమర్పించే అన్ని ఆధారాలను ఈ సాధికార సంస్థ చట్ట నిబంధనలకు లోబడి పరిగణనలోకి తీసుకోవాలి’అని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లాకోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. తమ భూముల విషయంలో జారీ చేసిన పరిహార ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పక్క భూములకు ఎకరాకు రూ.13.75 లక్షలు పరిహారం ఇచ్చి, తమ భూములకు మాత్రం కేవలం రూ.3 లక్షలే చెల్లిస్తున్నారని వారు కోర్టుకు నివేదించారు. నిర్ణయించిన పరిహారానికి సమ్మతి తెలియజేయలేదన్న కారణంతోనే ఈ విధంగా తమ పట్ల వివక్ష చూపుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తాము నిర్ణయించిన పరిహారానికి పిటిషనర్లు అంగీకరించలేదని తెలిపారు. అందుకే వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని కలెక్టర్ వద్ద డిపాజిట్ చేశామన్నారు. తాము రూ.10 లక్షలు అంతకన్నా ఎక్కువ మొత్తం పరిహారానికి అర్హులమంటూ పిటిషనర్లు పూర్తి ఆధారాలు సమర్పిస్తే, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను పరిహార సాధికార సంస్థకు సమర్పించాలని రైతులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment