అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దుచేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కు హైకోర్టు ఊరటనిచ్చింది. హెచ్‌ఎండీఏకు వ్యతిరేకంగా ఆదాయపు పన్నుశాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ చల్లా కోదండరామ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. బ్యాంకు ఖాతాల జప్తునకు జారీ చేసిన ఉత్తర్వులను సైతం ఎత్తివేసింది.
అయితే ఆదాయపు పన్నుశాఖకు రూ. 10 కోట్లు చెల్లించాలని హెచ్‌ఎండీఏను ఆదేశించింది. భూముల అమ్మకానికి సంబంధించి వచ్చిన ఆదాయంపై 2003-04, 2006-07 నుంచి 2008-09 వరకు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ. 664.68 కోట్లు పన్ను రూపేణా చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేయగా, హెచ్‌ఎండీఏ దాదాపు రూ. 180 కోట్లు చెల్లించింది. మరో రూ. 480 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ తరువాత ఆదాయపు పన్నుశాఖ మరో రూ. 160 కోట్లు వసూలు చేసింది. మిగిలిన మొత్తాల కోసం ఆదాయపుపన్నుశాఖ ఒత్తిడి చేస్తుంటే, ట్రిబ్యునల్ నుంచి హెచ్‌ఎండీఏ స్టే పొందింది. అయితే రూ. 10 కోట్లు చెల్లించాలని ట్రిబ్యునల్ షరతు విధించింది.
తరువాత విచారణ సమయంలో మరో రూ. 15 కోట్లు చెల్లించాలని హెచ్‌ఎండీఏను అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇదే సమయంలో ఐటీ అధికారులు హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ హెచ్‌ఎండీఏ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలు చేసింది. తాము విక్రయించిన భూములు సొంతవి కావని, ప్రభుత్వం తరఫున తాము ఏజెంట్‌గా మాత్రమే వ్యవహరిస్తూ లావాదేవీలు జరిపామని హెచ్‌ఎండీ తరఫున సీనియర్ న్యాయవాది కృష్ణ కౌండిన్య కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం... రూ. 15 కోట్లు చెల్లించాలంటూ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే రూ. 10 కోట్లు చెక్కు రూపంలో ఇవ్వాలని హెచ్‌ఎండీఏను ఆదేశించింది. అలాగే ఈ మొత్తం కేసుకు సంబంధించి ఈ నెల 21న జరగాల్సిన వాదనలు యథాతథంగా జరగాలని, ఎటువంటి వాయిదాలూ కోరరాదని హెచ్‌ఎండీఏకు స్పష్టం చేసింది.
ఐటీ చెల్లింపులో హెచ్‌ఎండీఏకు ఊరట
Published Wed, Aug 21 2013 3:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement