దరఖాస్తుదారుల పడిగాపులు
తరచుగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్‌లు, భవనాల నిర్మాణాలు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అనుమతుల కోసం అందుబాటులోకి తెచ్చిన సింగిల్‌విండో సాంకేతిక వ్యవస్థ టీజీబీపాస్ శుక్రవారం మరోసారి స్తంభించింది. దీంతో హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలో పనులు నిలిచిపోయాయి. ఫైళ్ల పరిష్కారంలో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది. వివిధ రకాల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుదారులు గంటల తరబడి పడిగాపులు కాశారు. టీజీబీపాస్‌లో సర్వర్‌డౌన్ కావడం వల్లనే సమస్యలు తలెత్తినట్లు అధికారులు చెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే హెచ్‌ఎండీఏ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది.
మరోవైపు ఇళ్లు, భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయలేకపోయారు. పలు కన్సల్టెన్సీల్లో సైతం పనులు నిలిచిపోయాయి. టీజీబీపాస్‌లో తరచుగా సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సకాలంలో ఫైళ్లను పరిష్కరించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏలోని ఘట్కేసర్, మేడ్చల్–1, మేడ్చల్–2, శంషాబాద్, శంకర్‌పల్లి–1, శంకర్‌పల్లి–2 జోన్‌లలో ప్రతి రోజు వివిధ రకాల అనుమతుల కోసం సుమారు 100 వరకు వస్తాయి. ప్రణాళికా విభాగంలోని వివిధ స్థాయిల్లో ఈ ఫైళ్లను పరిశీలించి, చివరకు కమిషనర్ ఆమోదంతో అనుమతులు అందజేస్తారు.
చదవండి: హైదరాబాద్‌లోనే ఎక్కువ.. సూపర్ పవర్!
ఫైళ్ల పరిష్కారంలో జాప్యాన్ని నివారించేందుకు ఇటీవల హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ కోసం చర్యలు చేపట్టారు. 10 రోజుల్లోనే దరఖాస్తుదారులకు అనుమతులను అందజేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. కానీ తరచుగా తలెత్తే ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల ఆటంకం కలిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీకెండ్స్‌లోనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పలువురు దరఖాస్తుదారులు చెప్పారు. టీజీబీపాస్ సర్వర్‌డౌన్ కావడంతో హెచ్‌ఎండీఏతో పాటు జీహెచ్‌ఎంసీ, నగర శివార్లలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో కూడా అనుమతుల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment