Lay out
-
టీజీబీపాస్ సర్వర్‌డౌన్.. వీకెండ్స్‌లోనే ఎందుకిలా?
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్లు, భవనాల నిర్మాణాలు, ఎల్ఆర్ఎస్ తదితర అనుమతుల కోసం అందుబాటులోకి తెచ్చిన సింగిల్‌విండో సాంకేతిక వ్యవస్థ టీజీబీపాస్ శుక్రవారం మరోసారి స్తంభించింది. దీంతో హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో పనులు నిలిచిపోయాయి. ఫైళ్ల పరిష్కారంలో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది. వివిధ రకాల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుదారులు గంటల తరబడి పడిగాపులు కాశారు. టీజీబీపాస్లో సర్వర్‌డౌన్ కావడం వల్లనే సమస్యలు తలెత్తినట్లు అధికారులు చెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే హెచ్ఎండీఏ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది.మరోవైపు ఇళ్లు, భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయలేకపోయారు. పలు కన్సల్టెన్సీల్లో సైతం పనులు నిలిచిపోయాయి. టీజీబీపాస్లో తరచుగా సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సకాలంలో ఫైళ్లను పరిష్కరించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. హెచ్ఎండీఏలోని ఘట్కేసర్, మేడ్చల్–1, మేడ్చల్–2, శంషాబాద్, శంకర్పల్లి–1, శంకర్పల్లి–2 జోన్లలో ప్రతి రోజు వివిధ రకాల అనుమతుల కోసం సుమారు 100 వరకు వస్తాయి. ప్రణాళికా విభాగంలోని వివిధ స్థాయిల్లో ఈ ఫైళ్లను పరిశీలించి, చివరకు కమిషనర్ ఆమోదంతో అనుమతులు అందజేస్తారు.చదవండి: హైదరాబాద్‌లోనే ఎక్కువ.. సూపర్ పవర్! ఫైళ్ల పరిష్కారంలో జాప్యాన్ని నివారించేందుకు ఇటీవల హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ కోసం చర్యలు చేపట్టారు. 10 రోజుల్లోనే దరఖాస్తుదారులకు అనుమతులను అందజేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. కానీ తరచుగా తలెత్తే ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల ఆటంకం కలిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీకెండ్స్‌లోనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పలువురు దరఖాస్తుదారులు చెప్పారు. టీజీబీపాస్ సర్వర్‌డౌన్ కావడంతో హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ, నగర శివార్లలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా అనుమతుల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. -
ప్లాట్ కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: చుట్టూ కొండలు.. పచ్చని చెట్లు. ఆహ్లాదకరమైన వాతావరణం.. కాలుష్య రహిత ప్రాంతం.. నగరానికి కూతవేటు దూరం.. వెరసి అతితక్కువ ధరకే హెచ్ఎండీఏ లేఅవుట్లో అమ్మకానికి ప్లాట్లు.. అంటూ రియల్ ఎస్టేట్ రంగంలోని కొంతమంది అక్రమార్కులు ప్రకటనలు చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి పిగ్లీపూర్‌లో ప్లాట్లు కొనుక్కునేందుకు తొందరపడుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త..! రియల్ ముఠా చీకటి ఒప్పందం..? హెచ్ఎండీఏ లేఅవుట్ల పేరుతో 20ఏళ్ల కిత్రం చేసిన ప్లాట్లనే కబ్జా చేసి అప్పటి లేఅవుట్ల ఆనవాళ్లు కనిపించకుండా నూతన హంగులతో ముస్తాబు చేస్తు న్న రియల్ మోసగాళ్లు తాజాగా హెచ్ఎండీఏ ప్లాట్లు గా తిరిగి విక్రయించేందుకు తెగబడుతున్నారు. పిగ్లీపూర్ గ్రామంలో కొన్ని రియల్ ముఠాలు కొంతకాలంగా తమ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మరో సారి వేలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాల సొమ్మును కాజేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఒకప్పడు వివాదరహితంగా ఉన్న పిగ్లీపూర్‌లోని భూములన్నీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. పిగ్లీపూర్ రెవెన్యూ సర్వే నెం.12, 14, 46, 51లోని పాత లేఅవుట్లను, పార్కు స్థలాలతో పాటు ప్రభు త్వ, భూదాన్‌భూములు ఆక్రమించుకుంటున్న రియల్ మాఫియా హెచ్ఎండీఏ, పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చీ కటి ఒప్పందం చేసుకున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. లే అవుట్లలోని పార్కు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోవడంతో అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పదుల సంఖ్యలో డబుల్ లేఅవుట్లు పిగ్లీపూర్‌లో రెండు, మూడేళ్లుగా హెచ్ఎండీఏ లేఅవుట్ల పేరుతో చేపడుతున్న లేఅవుట్లన్నీ డబుల్, త్రి బుల్ లేఅవుట్లే. 20, 25 ఏళ్ల కిత్రం చేసిన పంచాయ తీ లేఅవుట్లనే హెచ్ఎండీఏ లేఅవుట్లు చేస్తున్నారు. ఈ లేఅవుట్లలోని ప్లాట్లను ప్లాన్ మ్యాప్‌లో చూపించి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇదే సర్వే నెంబర్లలో హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుని ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్లాట్లు విక్రయించిన తర్వాత వచ్చి న భూ వివాదాలు, ఫిర్యాదుల కారణంగా హెచ్ఎండీఏ అధికారులు ఎల్పీ నెంబర్‌ను రద్దు చేసినట్లు తెలిసింది. దీంతో ఆ స్థలంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా వదిలేశారంటే అక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అర్థమవుతోంది. చదవండి: Hyderabad: భూం ధాం!.. రూ. 12 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు లక్ష్యం ఎక్కువ కమీషన్ ఆశ చూపి.. పాత లేఅవుట్లలోని ప్లాట్లను ఆక్రమించుకుని వాటి ఆనవాళ్లు లేకుండా చేసి నకిలీ పత్రాలతో హెచ్ఎండీఏ అనుమతి తీసుకోవడం కబ్జాదారుల పని... అనంతరం ఎక్కువ కమీషన్ ఆశచూపి ఈ డబుల్ లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించే బాధ్యత మార్కెటింగ్ కంపెనీలకు అప్పగించి చేతికి మట్టి అంటకుండా కోట్లాది రూపాయాలు సొమ్ము చేసుకుని పేదలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ప్లాట్లు విక్రయాలు పూర్తి అయ్యేంత వరకూ రియల్ మాఫియా ముఠా సభ్యులు ఎక్కడా తమ పేర్లు వినిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. మార్కెటింగ్ ఏజెంట్లు కూడా పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు ఉద్యోగాల్లో బిజీగా ఉండే వారినే టార్గెట్ చేసుకుని ప్లాట్లు విక్రయిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. తక్కువ ధరకు ప్లాట్లు వస్తున్నాయనే ఆశతో తొందరపడి కొనుగోలు చేస్తే మాత్రం ఇక్కడి వివాదాస్పద భూముల వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,ప్లాట్లు కొనేముందు అన్ని విషయాలను పరిశీలించడంతో పాటు ప్లాట్లు చేస్తున్న ప్రాంతాలను స్వయంగా సందర్శించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. -
గల్లా పెట్టె ఘల్లుమనేలా!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు సర్కారు భూముల అమ్మకాలు, మరోవైపు లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా ఆదాయ సముపార్జనకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకాలకు చర్యలు చేపట్టిన అధికారులు.. సర్కారు ఖజానాను భర్తీ చేసేందుకు మరిన్ని చోట్ల భూముల అమ్మకాలకు ప్రణాళికలను రూపొందించారు. హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా చోట్ల వివాదంలో ఉండడంతో లేఅవుట్ల అభివృద్ధి, ప్లాట్ల విక్రయాల్లో జాప్యం చోటుచేసుకొంటోంది. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలు లేని భూములపై అధికారులు తాజాగా దృష్టి సారించారు. గతంలోనే అమ్మకానికి సిద్ధంచేసిన లేమూరుతో పాటు, కుత్బుల్లాపూర్‌లోని హెచ్ఎంటీ భూములు, ఔటర్‌కు సమీపంలోని కుర్మగూడలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు కార్యాచరణను సిద్ధంచేశారు. రెండు చోట్ల వెంచర్లు.. లేమూరులో ప్రభుత్వ భూమితో పాటు కొంత భూమిని రైతుల నుంచి సేకరించారు. సుమారు 44 ఎకరాల్లో ప్లాట్లను సిద్ధం చేశారు. గతంలోనే ఈ ప్లాట్లకు వేలం నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం లేమూరు అన్ని విధాలుగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. 300 చదరపు గజాలు, 200 చదరపు గజాల చొప్పున సుమారు 350 ప్లాట్ల వరకు లేఅవుట్లు వేసి విక్రయానికి ఏర్పాట్లు చేశారు. లేమూరు భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.250కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుమారు 90 ఎకరాల హెచ్ఎంటీ భూముల్లోనూ తాజాగా లేఅవుట్లకు సన్నాహాలు చేపట్టారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, తదితర అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం చేస్తున్నారు. స్థానికంగా ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 150 గజాల చిన్న ప్లాట్ల నుంచి 500 చదరపు గజాల ప్లాట్ల వరకు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడ గజానికి రూ.25 వేల కనీస ధర నిర్ణయించే అవకాశం ఉంది. ఔటర్‌కు సమీపంలో ఉన్న కుర్మగూడలో ప్రభుత్వానికి మరో 60 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో ఇంకా లేఅవుట్ చేయాల్సి ఉంది. ఇక్కడ డిమాండ్ బాగా ఉంటుందని అంచనా. ఈ మూడు చోట్ల కలిపి ప్లాట్ల విక్రయం ద్వారా కనీసం రూ.750 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. క్రమబద్ధీకరణకు సన్నద్ధం... లేఅవుట్ల క్రమబదీ్ధకరణ కోసంఇప్పటికే చర్యలు చేపట్టిన అధికారులు నాలుగు జోన్లలో కలిపి సుమారు 1000 లే అవుట్లను గుర్తించారు. వారంతా గతంలోనే ఎల్ఆర్ఎస్ కోసం డాక్యుమెంట్లను సమర్పించారు. రూ.10 వేల ఫీజు చెల్లించారు. అధికారులు గుర్తించిన లే అవుట్లలో సుమారు 700 కు పైగా లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ను ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈ స్థలాలన్నీ ఎకరానికి పైగా ఉన్నవే కావడంతో ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. తాజాగా హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం అధికారులతో ఈ అంశంపై సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీపావళి తర్వాత అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. (చదవండి: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం) -
సర్కారు వారి పాట
సాక్షి, హైదరాబాద్: సర్కారు భూముల అమ్మకానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఈ ఏడాది హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం సుమారు 4500 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా చోట్ల వందల ఎకరాల్లో అన్యాక్రాంతం కాగా కొన్ని చోట్ల కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి వివాదాలు లేకుండా అందుబాటులో ఉన్న భూమిని అంచనా వేసి లేఅవుట్లు చేసి వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇలాంటి భూమి సుమారు 2000 ఎకరాలకుపైగానే ఉన్నట్లు అంచనా. అందులో ప్రస్తుతంవెయ్యి ఎకరాలను అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేఅవుట్లు వేసి వేలం ద్వారా విక్రయించిన హెచ్ఎండీఏ తాజాగా తన అధీనంలోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది. కోకాపేట్లో ఇటీవల ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు కేసులు లేకుండా అన్ని రకాల అనుమతులతో కూడిన భూములను మొదట విక్రయించనున్నారు. రెండుచోట్ల వెంచర్లు.. ప్రభుత్వ భూముల విక్రయంలో భాగంగా తొలుత మోకిల, కుత్బుల్లాపూర్‌లలో ఉన్న సుమారు 190 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేయనున్నారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర అన్ని మౌలిక సదుపాయాలతో రెండు మూడు నెలల్లో ఈ రెండు చోట్ల ప్లాట్లను వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 150 గజాల చిన్న ప్లాట్ల నుంచి 500 చదరపు గజాల ప్లాట్ల లేఅవుట్లు వేయనున్నారు. ప్రభుత్వ భూములతో పాటు అవసరమైన చోట్ల రైతుల నుంచి కూడా భూములను సేకరించే అవకాశం ఉంది, భారీ లే అవుట్లకు తగినంత భూమి అందుబాటులో లేని చోట్ల రైతుల నుంచి సేకరించనున్నారు. కుత్బుల్లాపూర్‌లో మండలం పరిధిలోని హెచ్ఎంటీ కంపెనీని ఆనుకొని ఉన్న వంద ఎకరాల హెచ్ఎండీఏ భూమిలో సుమారు 10 ఎకరాల వరకు అన్యాక్రాంతం కాగా, మిగతా 90 ఎకరాల భూమి కొద్ది రోజల క్రితమే హెచ్ఎండీఏ చేతికి వచ్చింది. మోకిలలో హెచ్ఎండీఏకు 60 ఎకరాల భూమి ఉండగా, రైతుల నుంచి సేకరించిన మరో 40 ఎకరాలతో కలిపి ఇక్కడ లేఅవుట్ వేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఉప్పల్ భగాయత్, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములపై నిర్వహించిన ఆన్లైన్ వేలానికి రియల్టర్లు, బిల్డర్లు, సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ స్పందనతో మరోసారి హెచ్ఎండీఏ పెద్ద ఎత్తున భూముల బేరానికి దిగింది. ఉప్పల్ భగాయత్‌లో మరో 40 ఎకరాలలో లే అవుట్‌ను సిద్ధం చేస్తున్నారు. త్వరలో ప్లాట్లు చేసి విక్రయించనున్నారు. కరువైన రక్షణ.. హెచ్ఎండీఏ భూములకు పలు చోట్ల రక్షణ కరువైంది. వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జవహర్‌నగర్‌లో సుమారు 2300 ఎకరాల హెచ్ఎండీఏ భూములు ఉన్నాయి. ఇక్కడ చాలా చోట్ల భూములు కబ్జాకు గురయ్యాయి. కొన్ని చోట్ల పేదలు గుడిసెలు వేసుకున్నారు. మియాపూర్‌లోనూ వెయ్యి ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. కబ్జాకోరులు పెద్ద ఎత్తునే స్వాహా చేశారు. జవహర్‌నగర్, మియాపూర్‌లలో రెండు చోట్ల పేదల పేరుతో ఆక్రమించుకొని కొందరు భూబకాసురులు రూ.కోట్లు గడించారు. మరోవైపు పుప్పాలగూడలో 100 ఎకరాలు, ఐడీఏ బొల్లారంలో 120 ఎకరాల చొప్పున హెచ్ఎండీఏ భూములు ఉన్నట్లు అంచనా. ఇవి కాకుండా బుద్వేల్‌లో 60 ఎకరాలు, కోకాపేట్లో 60, కొత్వాల్‌గూడలో 50 ఎకరాలు, తెల్లాపూర్‌లో 300 ఎకరాల వరకు హెచ్ఎండీఏకు చెందిన భూములు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. ఇంకా లెక్కతేలాల్సినవి వేల ఎకరాల్లోనే ఉన్నాయి. -
జనవరి 13న సీఎం జగన్ చేతుల మీదుగా ఎంఐజీ లేఅవుట్ ప్రారంభం
సాక్షి,అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమీపంలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లోని ఎంఐజీ లే అవుట్‌ను ఈ నెల 13న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 200 నుంచి 240 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఈ ప్లాట్లను పొందేందుకు రూ.18 లక్షల లోపు వార్షిక ఆదాయమున్న ఏపీకి చెందిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. -
వెంచర్లో ప్లాట్ కొంటే.. ఇంటికి పాస్‌బుక్ వచ్చింది.. ఇదేంటని అడిగితే
భువనగిరి మండలం చీమల కోడూరు గ్రామ పరిధిలో చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లో రెండేళ్ల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ 120 గజాల ప్లాటు బుక్ చేసుకున్నాడు. డబ్బులు చెల్లించడంలో జాప్యం కారణంగా ప్లాట్ రిజిస్ట్రేషన్ జరగలేదు. ఇటీవల ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం భువనగిరి మండల కార్యాలయానికి పిలిస్తే వెళ్లి తతంగం పూర్తి చేశారు. వారం రోజులకు ఇంటి అడ్రస్‌కు గుంట భూమి (వ్యవసాయ భూమి) పట్టా చేసినట్లు పాస్ పుస్తకం వచ్చింది. తాను కొనుగోలు చేసినది ప్లాట్ కదా అని సదరు వెంచర్ వాళ్లను అడిగితే .. ప్లాట్ కింద వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పి సమస్యేం లేదని సముదాయించారు. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ‘నాలా’(వ్యవసాయేతర భూమిగా) కింద కన్వర్షన్ చేయించుకుంటే సరిపోతుందని చెప్పారు’ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని, అధికారుల అండతో రియల్ ఎస్టేట్ యజమానులు వ్యవసాయ భూములను నివాస యోగ్యమైన ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు పట్టణాభివృద్ధి సంస్థలు లేదా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ (డీటీసీపీ) ఆమోదించిన లే అవుట్ తప్పనిసరని ప్రభుత్వం గత సంవత్సరం స్పష్టం చేసింది. డీటీసీపీ, పట్టణాబివృద్ధిసంస్థలు ఆమోదించిన లే అవుట్లలోని ప్లాట్లనే రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలని, ఇతర భూములన్నీ ధరణి కింద తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మండల తహసీల్దార్లకు రిజిస్ట్రార్ హోదా కల్పించింది. అయితే వీటిల్లోని లొసుగులను ఆధారంగా చేసుకున్న రియల్ వ్యాపారులు గుంట, గుంటన్నర భూములను కూడా వ్యవసాయ భూములుగా చూపిస్తూ ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ల వద్ద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించినహెచ్ఎండీఏ పరిధిలోని మండలాలతో పాటు ఇటీవల డిమాండ్ పెరిగిన కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ పట్టణాభివృద్ధి సంస్థలతో పాటు భువనగిరి, జనగాం, పెద్దపల్లి, సిరిసిల్ల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాల పరిధిలోని మునిసిపాలిటీలలో ఈ తరహాలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ సాగుతోంది. చదవండి: ఎక్కడి నుంచో రేగు పండ్ల వాసన.. ఆధునిక, వైజ్ఞానిక మేళవింపు ‘నాలా’కన్వర్షన్‌తో కొన్ని... వ్యవసాయ భూములను రియల్ వెంచర్లుగా మార్చాలంటే ‘నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ యాక్ట్ (నాలా) ’కింద వ్యవసాయేతర భూమిగా మార్చడం తప్పనిసరి. అక్కడున్న పట్టణీకరణ పరిస్థితులను బట్టి తహసీల్దార్లు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా గుర్తించాల్సి ఉంటుంది. ఫీజుతో పాటు ఇతర ‘చెల్లింపులు’జరిపితే తప్ప నాలా కన్వర్షన్ సులభం కాదు. ఈ నేపథ్యంలో కొందరు రియల్టర్లు ‘నాలా’మార్పిడి లేకుండానే తహసీల్దార్లతో ధరణి కింద ప్లాట్లకు పట్టాలు ఇప్పిస్తుండగా, మరికొందరు రియల్టర్లు కొంత అడ్వాన్స్ అయ్యారు. కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని ప్లాట్ల వారీగా విభజించి ‘నాలా’కన్వర్షన్ చేయించి గజాల చొప్పున విక్రయిస్తున్నారు. ప్లాట్లకు నాలా కన్వర్షన్ ఉంటే డీసీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థల అనుమతులేమీ లేకుండానే రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. డీటీసీపీ, రెరా చట్టాలన్నీ గాలికి... రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లన్నీ డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థల అనుమతితోనే చేపట్టాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ల ద్వారా లే అవుట్లకు అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే 8 ప్లాట్లు అంతకన్నా ఎక్కువ మొత్తంలో విక్రయించాల్సి వస్తే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అనుమతి తప్పనిసరి. కానీ స్థానిక తహసీల్దార్లు, రిజిస్ట్రార్లను ‘మంచి’చేసుకొని రియల్టర్లు అనధికార లే అవుట్లు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. డీటీసీపీ లే అవుట్‌తో చేసిన వెంచర్లకు కూడా రెరా అనుమతి ఉండడం లేదు. ప్రతి పట్టణ పరిధిలో ఇలాంటి వెంచర్లు పుట్టుకొస్తున్నా, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. -
ఎకరం లేఅవుట్ ఏదీ ఆదాయం?
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ లేఅవుట్లకు ముకుతాడు వేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రవేశపెట్టిన ‘ఎకరం లేఅవుట్’ అనమతులకు గ్రామ పంచాయతీల నుంచి పూర్తిస్థాయిలో సహకారం లేకపోవడంతో ఆశించినంత ఆదాయం రావడం లేదు. విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నా.. వాటిని హెచ్ఎండీఏ దృష్టికి తీసుకురావడంలో పంచాయతీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తుండడంతో ఇరు విభాగాల ఖజానాకు భారీగానే గండిపడుతోంది. కాసుల కక్కుర్తికి ఆశపడి కొంతమంది పంచాయతీ అధికారులు అక్రమ లేఅవుట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ‘ఎకరం లేఅవుట్ అనుమతి’ ప్రక్రియతో అనుకున్నంత రాబడి రావడం లేదు. రెండేళ్లలో 65 లేఅవుట్లకు అనుమతులివ్వగా, రూ.30 కోట్ల ఆదాయం వచ్చింది. 2031 మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం 10 ఎకరాలు ఉంటేనే లేఅవుట్‌కు అనుమతి ఇవ్వాలి. ఈ నిబంధనలతో 10 ఎకరాలలోపు స్థలంలోనే అత్యధికంగా అక్రమ లేఅవుట్లు వెలిసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. ఇది గుర్తించిన హెచ్ఎండీఏ కమిషనర్, ప్లానింగ్ విభాగ డైరెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఎకరానికి లేఅవుట్ అనుమతి ఇస్తే ఈ మోసాలు తగ్గుతాయని పేర్కొనడంతో... అధ్యయనం చేసిన ప్రభుత్వం జీవో 288, 33 ప్రకారం ఎకరానికి లేఅవుట్ అనుమతి మంజూరు చేయొచ్చని హెచ్ఎండీఏకు అధికారాలు కట్టబెట్టింది. అయితే ఇప్పటివరకు హెచ్ఎండీఏకు ఎకరం లేఅవుట్లలో వచ్చిన ఆదాయంలో ఎక్కువగా పటాన్చెరు, అబ్దుల్లాపూర్‌మెట్, అమీన్పూర్, దుండిగల్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఘట్కేసర్, కీసర, రామచంద్రాపురం, మేడ్చల్, బీబీనగర్, బాలాపూర్, శామీర్‌పేట, కొంపల్లి, ఆదిభట్ల, మేడిపల్లి, సంగారెడ్డి మండలాల పరిధిలోని ప్రాంతాలు ఉన్నాయి. ఆ అనుమతి ఉంటే... జీవో 288, 33 ప్రకారం ఎకరంలో 30 ఫీట్ల వెడల్పున్న రోడ్లు, 30 శాతం ల్యాండ్ ఏరియా కింద పాటించాలి. కనీసం 10 శాతం ఓపెన్ స్పేస్ వదలాలనే నిబంధన ఉంది. రోడ్లు, ఫుట్‌పాత్, డ్రైనేజీ, నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ, కమ్యూనిటీ అవసరాలు, రోడ్ల వెంబడి చెట్లు, పార్కులు, ఆట స్థలాలు అభివృద్ధి చేసిన తర్వాతనే హెచ్ఎండీఏ ఫైనల్ లేఅవుట్ అనుమతి ఇస్తుంది. అయితే ఎకరానికి 4,880 గజాలు ఉండగా... అన్ని అభివృద్ధి చేయగా మిగిలిన 2,800 గజాల వరకు విక్రయించుకోవచ్చు. తొలి లేఅవుట్ ఇచ్చే సమయంలో 15శాతం భూమిని హెచ్ఎండీఏ మార్ట్గేజ్ కింద పెట్టుకొని ఇస్తుంది. ఎందుకంటే ఈ లేఅవుట్ చూపించి ప్లాట్లు అమ్ముకొని వెళ్లిపోకుండా ఉండేందుకు ఈ నిబంధన ఉంచారు. అభివృద్ధిపై నిర్ధారణకు వచ్చాకే ఫైనల్ లేఅవుట్ మంజూరు చేస్తుంది. ఆ తర్వాత ఈ లేఅవుట్ యజమానులు గ్రామ పంచాయతీకి కూడా రూ.50వేల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా హెచ్ఎండీఏ ద్వారా ఆమోదం పొందిన లేఅవుట్లో గజం ధర మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అధికంగా ఉంటుంది. కొనుగోలుదార్లు కూడా హెచ్ఎండీఏ అనుమతి ఉండి మౌలిక వసతులు ఉండటంతో మార్కెట్ కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌ను బట్టి ఫీజు... ఉదాహరణకు పుప్పలగూడ, నార్సింగి, మణికొండ ప్రాంతాల్లో ఎకరం లేఅవుట్ మంజూరుకు హెచ్ఎండీఏ రూ.8లక్షల వరకు ఫీజు వసూలు చేస్తోంది. అదే సంగారెడ్డిలోని మండలాల్లో ఎకరం లేఅవుట్ పర్మిషన్‌కు రూ.5లక్షల వరకు ఉంటుంది. అయితే హెచ్ఎండీఏ పరిధిలో ఎకరం లేఅవుట్ పర్మిషన్ కోసం రూ.5లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇకనైనా గ్రామ పంచాయతీ అధికారులు మేల్కొని తమ పరిధిలో వెలుస్తున్న అక్రమ లేఅవుట్లను హెచ్ఎండీఏ దృష్టికి తీసుకొస్తే భారీగా ఆదాయం పెరుగుతుందని పేర్కొంటున్నారు. -
‘మహా’ గిఫ్ట్..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుమతినిచ్చిన లేఅవుట్లలో ‘గిఫ్ట్ డీడ్’ కింద వచ్చిన భూమిని ఈ నెలాఖరు నాటికి వేలం వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్లానింగ్ విభాగం, ఎస్టేట్ విభాగ అధికారులు కలిసి ఆయా లేఅవుట్లను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 39 లేఅవుట్లలోని ప్లాట్లు, భూమికి జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. మరో మూడు రోజుల్లో మిగతా ప్లాట్లకు ట్యాగింగ్ పూర్తి చేసి నెలాఖరు నాటికి ఈ–వేలం నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా సన్నాహలు చేస్తున్నారు. కబ్జాలకు చెక్.. కాసుల వర్షం ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి రావడంతో గతంలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని ప్లాట్లు, ఉప్పల్ భగాయత్ ప్లాట్లు తొలుత వేలం వేయాలని భావించారు. కబ్జా కోరల్లో చిక్కుకుని ఖాళీగా ఉంటున్న గిఫ్ట్ డీడ్ భూములు విక్రయిస్తే ఇటు సంస్థకు ఆదాయం సమకూరడంతో పాటు సంరక్షించే ఒత్తిడి తగ్గుతుందని యోచించారు. కొన్నిచోట్ల కొంత మంది స్థలం అక్రమించిన సందర్భాలుండడంతో గిఫ్ట్‌డీడ్ భూములను అమ్మాలని నిర్ణయించారు. తదనుగుణంగా ఆయా లేఅవుట్లలోని ప్లాట్లు, భూములకు జియో ట్యాగింగ్ పనులను వేగిరం చేశారు. కొన్ని ప్రాంతాల్లోని మూడెకరాల భూములను ఏకంగా విల్లాలు నిర్మించే అవకాశముండటంతో వారికే ఎక్కువ ధరకు విక్రయించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ‘ప్రభుత్వ జీఓ 33 నంబర్ ప్రకారం హెచ్ఎండీఏ అనుమతిచ్చిన లేఅవుట్లో మూడు శాతం, గేటెడ్ కమ్యూనిటీ, గ్రూప్ హౌసింగ్‌లోనైతే మూడు నుంచి ఐదు శాతం భూమిని హెచ్ఎండీఏకు గిఫ్ట్‌డీడ్ చేస్తారు. పార్కులు, రోడ్డు, మౌలిక వసతులతో సంబంధం లేకుండా ఈ భూమిని హెచ్ఎండీఏ పేరున యజమాని రిజిస్టర్ చేస్తారు. ఈ భూమిని అమ్ముకునే అధికారం హెచ్ఎండీఏకు ఉంది. గతంలో భూములకు తక్కువ రేటు ఉండటంతో చాలా మంది భూములను గిఫ్ట్ డీడ్ చేసేందుకు సుముఖత చూపారు. ఇప్పుడు ఆ భూములే హెచ్ఎండీఏకు భారీ ఆదాయం సమకూర్చబోతున్నాయ’ని ప్లానింగ్ విభాగ అధికారులు తెలిపారు. వీటితో పాటు ఉప్పల్ భగాయత్, హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని ప్లాట్లు విక్రయిస్తే రూ.వెయ్యి కోట్ట వరకు హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఔటర్ నిర్వాసితులకు గిఫ్ట్‌డీడ్ భూములు.. ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములిచ్చిన వందలాది మంది రైతులకు భూమికి భూమిని హెచ్ఎండీఏ అధికారులు కేటాయించారు. కాగా, 27 మంది రైతులకు భూములిస్తామంటే ఎక్కడ కూడా అందుబాటులో లేకుండాపోయాయి. దీంతో ఆయా రైతులకు దాదాపు 27 వేల గజాలను శ్రీనగర్‌లోని లే అవుట్లలో ఉన్న గిఫ్ట్‌డీడ్ భూములను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. -
అక్రమ లే అవుట్లకు నో రిజిస్ట్రేషన్!
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆలోచనలు చేస్తోంది. బుధవారమిక్కడ ఎంసీఆర్హెచ్ఆర్డీలో మూడోరోజూ సమావేశమైన మంత్రుల సబ్ కమిటీ దాదాపు ఎనిమిది గంటల పాటు అనేక అంశాలపై చర్చించింది. కమిటీ సభ్యులు మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్‌తోపాటు జగదీశ్వర్‌రెడ్డి చర్చలో పాల్గొన్నారు. అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను ఆపేసే అంశంపై సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోనూ సబ్ కమిటీ ప్రత్యేకంగా చర్చించింది. లే అవుట్‌కు అనుమతి ఉంటేనే ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంటే మంచిదని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ఎన్నారైల సహకారం ప్రస్తుతం జిల్లా పరిషత్, మండల పరిషత్‌లో ఉన్నట్లుగానే పంచాయతీ పాలకవర్గ సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు కూడా సిట్టింగ్ ఫీజు ఇవ్వాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా వరుసగా మూడుసార్లు పాలకవర్గ సమావేశాలకు డుమ్మా కొడితే అనర్హత వేటు కూడా వేసే అంశంపైనా చర్చించారు. పంచాయతీల్లో కో–ఆప్షన్ సభ్యులను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్న సబ్ కమిటీ.. ఇందులో ఎన్నారైలకు, గ్రామంలో లేని వారికి కూడా అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చించారు. పంచాయతీ జనాభాను బట్టి ఇద్దరు, ముగ్గురిని కూడా నామినేట్ చేసుకునే అవకాశాలపై చర్చించారు. గ్రామానికి చెందిన ఎన్నారైలు, గ్రామ మహిళ సమాఖ్య అధ్యక్షురాలు, నిపుణులకు అవకాశం కల్పించడం వల్ల గ్రామాభివృద్ధికి వారి సహకారం ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం 200 చదరపు గజాల లోపు విస్తీర్ణంలో జీ ప్లస్ 2 ఎత్తులో నిర్మించే భవనాల అనుమతులను గ్రామ పంచాయతీలో ఇస్తున్నారు. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో అయితే మండలాల్లో ఎంపీడీవో, తహసీల్డార్, ఈఓ పీఆర్డీ, పంచాయతీరాజ్ ఏఈల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి అనుమతించే అంశంపైనా చర్చించారు. అలాగే భవన నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతిచ్చిన వారం రోజుల్లోనే పంచాయతీ క్లియరెన్స్ ఇవ్వాలని.. లేనిపక్షంలో అనుమతిచ్చినట్లుగానే భావించేలా చట్టంలో నిబంధనలు పొందుపర్చే అంశం కూడా సబ్ కమిటీలో చర్చకు వచ్చింది. సర్పంచ్‌లకు విస్తృత అధికారాలు కల్పించే దిశగా కొత్త చట్టంలో మార్పులు చేయాలని భావిస్తున్న సబ్ కమిటీ.. అదే సమయంలో ప్రజల కోసం ప్రత్యేకంగా హక్కుల జాబితాను కూడా చట్టంలో పొందుపర్చే యోచన చేస్తోంది. గురువారం కూడా సబ్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. -
మే 1, 2016 తర్వాతి ప్రాజెక్ట్‌లు, లే అవుట్లే రెరా పరిధిలోకి!
అంతకంటే ముందు వాటికి రెరాలో నమోదు నుంచి మినహాయింపు ►రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లకే బ్యాంకు రుణాలు ► సుమారు పదివేల ఫ్లాట్లు రెరా పరిధిలోకి సాక్షి, హైదరాబాద్: మే 1, 2016లో కేంద్రం స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)ను తీసుకొచ్చింది. ఈ తేదీ తర్వాతి నుంచి ప్రారంభమైన నివాస, వాణిజ్య సముదాయాలు, లే అవుట్లు అన్ని కూడా రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. అంతకంటే ముందు ప్రారంభమైన ప్రాజెక్ట్‌లు, వెంచర్లు మాత్రం రెరా పరిధిలోకి రావు. నిర్మాణం పూర్తయి.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) రాని ప్రాజెక్ట్‌లకూ రెరాలో నమోదు నుంచి మినహాయింపు ఉంది. దేశంలో రెరా ప్రకటన కొత్త ప్రాజెక్ట్ ప్రారంభానికి మోకాలడ్డింది. రెరా నిబంధనలెలా ఉంటాయో? కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో? వంటి రకరకాల కారణాలతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభానికి డెవలపర్లు ఆలోచనలో పడ్డారు. రెరా ప్రకటన నాటి నుంచి 2017 తొలి త్రైమాసికం వరకూ దేశంలోని ప్రధాన నగరాల్లో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు 16 శాతం తగ్గడమే ఇందుకు నిదర్శనమని కుష్మన్ వేక్ఫీల్డ్ నివేదిక చెబుతోంది. హైదరాబాద్ గణాంకాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 2015 నుంచి మార్చి 2016 మధ్య 10,125 యూనిట్లు ప్రారంభం కాగా.. ఏప్రిల్ 2016– మార్చి 2017లో మాత్రం 9,775 యూనిట్లు ప్రారంభమయ్యాయి. అంటే 3 శాతం తగ్గాయన్నమాట. లగ్జరీ, అందుబాటు ఇళ్లలో 30 శాతం వృద్ధి.. అందుబాటు గృహాలు, లగ్జరీ ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు మాత్రం వృద్ధిని నమోదు చేశాయి. ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2017 మధ్య కాలంలో అందుబాటు గృహాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2015–16 ఇదే సమయంలో 25 శాతంగా ఉంది. లగ్జరీ, హైఎండ్ యూనిట్ల ప్రారంభాలు మాత్రం ఇదే సమయంలో 11 శాతం నుంచి 13 శాతానికి పెరిగాయి. అయితే ఆయా విభాగాల్లో అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని నివేదిక పేర్కొంది. రెరాలో నమోదైతేనే రుణాలు.. సాధారణంగా డెవలపర్లు ప్రాజెక్ట్ పేరుతో సమీకరించిన నిధుల్లో కొంత మొత్తాన్ని ఇతర ప్రాజెక్ట్‌లకు, ఇతరత్రా అవసరాలకూ వినియోగిస్తుంటారు. దీంతో కొన్ని సమయాల్లో నిధుల కొరత కారణంగా నిర్మాణాలు ఆలస్యమవుతుంటాయి. అయితే రెరాతో నిధుల మళ్లింపునకు చెక్ పడుతుంది. కొనుగోలుదారుల నుంచి సమీకరించిన నిధుల్లో 70 శాతం ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. అలా జమ చేసిన నిధులను ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూమి ఖర్చులు, నిర్మాణ ఖర్చుల కోసమే వినియోగించాలి. ⇒ ఇదిలా ఉంటే రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లకు మాత్రమే రుణాలను మంజూరు చేయాలని కొన్ని బ్యాంకులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎస్క్రో ఖాతాలో ఎలా జమ చేయాలనే దాని మీద ఇంకా స్పష్టత లేదని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. ప్రాజెక్ట్ ఇంజనీరు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఆర్కిటెక్ట్ ధ్రువీకరణ ప్రకారం ప్రతి 6 నెలలకొకసారి ఈ ఖాతా నుంచి డెవలపర్లకు నిధులు విడుదల అవుతుంటాయి. -
ఆన్లైన్ లుక్... అక్రమాలకు చెక్!
గ్రేటర్లో ఇక ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు * జూన్ 1 నుంచి అమలు * లేఔట్ అనుమతులు కూడా.. * 'టౌన్‌ప్లానింగ్’లో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే... * అవకతవకలకు అడ్డుకట్ట పడే అవకాశం సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. వచ్చేనెల (జూన్) ఒకటో తేదీ నుంచి భవన నిర్మాణ అనుమతులు, లే ఔట్ అనుమతుల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఆన్లైన్ ద్వారానే అనుమతుల్ని జారీ చేయనున్నారు. ప్రస్తుతం వ్యక్తిగతంగా ఈ దరఖాస్తులను సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తు అందజేశాక సైతం అనుమతుల కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు చెక్‌పెట్టేందుకు, పారదర్శక సేవల కోసం ఆన్లైన్ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆటో డీసీఆర్ సాఫ్ట్వేర్ వినియోగంతో వచ్చే ఒకటో తేదీనుంచి ఆన్లైన్ ద్వారా ఈ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ విధానంలో మొదట ఆటో డీసీఆర్ ద్వారా ఆటోక్యాడ్‌లో ప్లాన్‌ను రూపొందించి, సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తుల్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఏవైనా లోటుపాట్లుంటే ప్రాథమిక దశలో ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. తద్వారా ఉద్యోగులకు సమయం కలిసి రావడమే కాక, నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీ తనం ఉంటుంది. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ప్రక్షాళన చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీకి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను పుణేకు చెందిన సాఫ్టెక్ సంస్థ రూపొందించింది. ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించేందుకు ప్రజలు ఆర్కిటెక్టులు, ఇంజినీర్ల సహకారం పొందవచ్చు. ఇందుకుగాను వారికి ఈనెల 6వ తేదీన భవననిర్మాణ, లే ఔట్ల అనుమతుల జారీకి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీలో పేర్లు నమోదు చేసుకున్న లెసైన్సుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ అవ గాహన కార్యక్రమం ఉంటుందని కమిషనర్ తెలిపారు. సులభతరమైన పరిపాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఆన్లైన్ అప్రూవల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించిన వందరోజుల ప్రణాళికలోనూ ఈ కార్యక్రమం ఉంది. దీంతోపాటు జీహెచ్ఎంసీలో ఏ ఫైలు ఎక్కడ ఉందో తెలిసేలా ఈ- ఆఫీస్ ప్లస్‌ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. దాదాపు ఏడాదిగా ఈ- ఆఫీస్ అమల్లో ఉన్నప్పటికీ, అది కేవలం అధికారులకు మాత్రమే పరిమితమైంది. ఈ-ఆఫీస్ ప్లస్‌తో ప్రజలు కూడా తమ ఫైలు ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే వెసులుబాటు ఉంది. విశ్వనగరంగా ఎదగాలనే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌కు సైతం కొత్త హంగులద్దారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లో తాజాగా ‘ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్‌సిటీ’ అనే నినాదం కొత్తగా దర్శనమిస్తోంది. వెబ్సైట్లో గతంలో లేని పింక్ కలర్‌ను చేర్చారు. ప్రయోజనాలెన్నో.. ⇒ ఆన్లైన్లో దరఖాస్తుల్ని స్వీకరించడం వల్ల దరఖాస్తు ఏ రోజు, ఏ సమయంలో సమర్పించింది స్పష్టంగా తెలుస్తుంది. ⇒ దరఖాస్తుతోపాటు జతపరచాల్సిన పత్రాలు జత చేయలేదనేందుకు, ఎవరైనా మాయం చేసేందుకు ఆస్కారం ఉండదు. ⇒ భవనం విస్తీర్ణానికి అనుగుణంగా సెట్బ్యాక్లు తదితరమైనవి ప్లాన్‌లో సరిగ్గా ఉన్నదీ లేనిదీ సాఫ్ట్‌వేరే గ్రహిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా లేనివాటిని తిరస్కరిస్తుంది. తద్వారా అధికారులకు పనిభారం తగ్గుతుంది. సమయం కలసి వస్తుంది. అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది. ⇒ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ లేదని కొర్రీలు వేస్తూ , ప్రజలను పదేపదే తిప్పేందుకు అవకాశం ఉండదు. ⇒ దరఖాస్తు ఎప్పుడు ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే వీలు. ⇒ దరఖాస్తు పరిశీలన పూర్తయి, అనుమతి జారీ అయితే ⇒ ఆ విషయం సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుంది. ఈమెయిల్ ద్వారాను తెలుస్తుంది. ఎక్కడైనా ఫైలు ఎక్కువ రోజులు ఉంటే, ఆ విషయం పైఅధికారులకు తెలుస్తుంది. తద్వారా జాప్యం తగ్గుతుంది. ⇒ 30 రోజుల నిర్ణీత వ్యవధిలో అనుమతుల జారీకి అవకాశం. ⇒ నిర్లక్ష్యం కనబరుస్తూ, జాప్యం చేసే అధికారులకు పెనాల్టీలు వేసేందుకు వీలు. ⇒ 30 రోజుల్లోగా ఫైలు పరిష్కారమో, తిరస్కారమో తెలుస్తుంది. -
ఎనిమిది నెలలాయే..!
ముందుకుసాగని ఇళ్ల నిర్మాణం తొలుత 3,957 ఇళ్లకు సీఎం శంకుస్థాపన తదుపరి 1,384 ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉత్తర్వులు వచ్చినా మొదలు కాని పనులు కనీసం లే అవుట్లు సిద్ధంకాని వైనం మిగిలిన ఇళ్ల నిర్మాణంపై స్పష్టత కరువు హన్మకొండ : మురికివాడలు లేని నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతామంటూ 2015 జనవరిలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీద రెండు రోజుల వ్యవధిలోనే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఆర్నెళ్లలోపే ఇళ్లు నిర్మించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మీపురం, ఎస్సార్‌నగర్, గరీబ్‌నగర్, గిరిప్రసాద్‌నగర్, శాకరాసికుంట, ప్రగతినగర్, దీన్‌దయాళ్‌నగర్, అంబేద్కర్‌నగర్, జితేందర్నగర్లలో ఇళ్ల నిర్మాణానికి సీఎం స్వయంగా శంకుస్థాపన చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ కాలనీల్లో జీ ప్లస్ వన్ పద్ధతిలో 3,957 ఇళ్లు నిర్మిస్తామని సహకరించాల్సిందిగా ప్రజలకు సీఎం సూచించారు. ఈ పని చేపట్టేందుకు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి రాజధాని నగరానికి దూరంగా జిల్లా కేంద్రంలో వరుసగా నాలుగు రోజులు బస చేశారు. అయితే శంకుస్థాపన జరిగి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. లే అవుట్ సిద్ధం కాలేదు.. శంకుస్థాపన జరిగిన ఆర్నెళ్ల తర్వాత అంబేద్కర్‌నగర్, ఎస్సార్‌నగర్‌లలో 1,384 ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 జూన్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ప్రతీ ఇంటికి 900 చదరపు అడుగులను కేటాయించారు. వీటిలో 560 చదరపు అడుగుల వైశాల్యంలో రూ 5.04 లక్షల వ్యయంతో డబుల్ బెడ్రూం, కిచెన్, కామన్హాల్, రెండు టాయిలెట్లతో ఇళ్లను నిర్మించనున్నట్లు ఆ జీవోలు పేర్కొన్నారు. తొలిదశలో 1,384 ఇళ్ల నిర్మాణానికి రూ.69.75 కోట్లు మంజూరయ్యాయి. స్థల లభ్యత ఆధారంగా అంబేద్కర్‌నగర్‌లో జీ ప్లస్ 3 పద్ధతిలో, ఎస్సార్‌నగర్‌లో జీ ప్లస్ 2 పద్ధతిలో ఇళ్లను నిర్మించాల్సి ఉంది. ఉత్తర్వులు జారీ అయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన లే అవుట్లు సిద్ధం కాలేదు. కష్టంగా మారిన స్థల మార్పిడి జీ ప్లస్ వన్ పద్ధతిలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఎంపిక చేసిన ప్రగతినగర్, దీన్‌దయాళ్‌నగర్, ఎస్ఆర్నగర్, గరీబ్‌నగర్, సాకారాశికుంట మురికివాడలు చెరువు శిఖం భూముల్లో వెలిశాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఈ స్థలాలు చెరువుశిఖం ప్రాంతంలో ఉన్నాయి. చారిత్రక ఖిలావరంగల్‌లోని మట్టికోటకు ఆనుకోని గిరిప్రసాద్‌నగర్ ఉంది. ఈ మురికివాడ మొత్తం ఆర్కియాలజీ శాఖ పరిధిలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం చెరువు శిఖం భూములు, పురవస్తుశాఖ పరిధిలో ఉన్న స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడ ఇళ్లు నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించాల్సి ఉంది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు ఆర్నెళ్ల కిందటే ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆర్నెళ్లు గడుస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం చెరువుశిఖం, పురవస్తుశాఖ ఆధీనంలో ఉన్న స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతికి సంబంధించి స్థలమార్పిడిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో ఇళ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం లేదు. లక్ష్మీపురం ప్రాంతం స్థల మార్పిడి నిబంధనతో పని లేకుండానే ఇక్కడ ఇళ్లు నిర్మించవచ్చు. కానీ అంతర్గతరోడ్లు, పార్కులతో కూడిన లే అవుట్‌ను సిద్ధం చేసే క్రమంలో కొన్ని ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సేకరించాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది. ఈ మేరకు అదనపు నిధుల అవసరం ఏర్పడుతోంది. స్థలమార్పిడి, అదనపు నిధులతో ముడిపడి ఉన్న ఇళ్లపై ప్రభుత్వ పరంగా స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గడిచినా ఎనిమిది నెలలుగా వీటిపై ్రపభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. -
తొలగింపు బాధ్యత మీదే!
అక్రమ లే అవుట్ల తొలగింపు బాధ్యత పంచాయతీలకు పంచాయతీ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ లే అవుట్ల వివరాలు వీజీటీఎం ఉడా నూతన నిర్ణయం సిబ్బంది కొరత వల్లేనని చెబుతున్న అధికారులు సాక్షి, విజయవాడ : అక్రమ లే అవుట్ల తొలగింపునకు వీజీటీఎం ఉడా అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని నిర్ణయించారు. అన్ని అనుమతులు ఉన్న లే అవుట్ల జాబితాను ఉడా వెబ్సైట్లో పొందుపరిచారు. వారంలోపు ఆ జాబితాలను ఉడా పరిధిలోని అన్ని పంచాయతీ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో భూసేకరణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే అక్రమ లే అవుట్ల తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు ఇటీవల నిర్వహించిన సమీక్షలో కూడా అక్రమ లే అవుట్లను తక్షణమే తొలగించాలని ఆదేశించడం ఇందుకు బలాన్నిస్తోంది. అయితే లే అవుట్లకు అనుమతులు ఇవ్వడంతోపాటు సంబంధిత ఫీజులను ఉడా వసూలు చేస్తోంది. దీంతో లే అవుట్ల తొలగింపునకు పంచాయతీ అధికారులు ఎంత మేరకు ముందుకు వస్తారనేది ప్రశ్నార్థకమే. సిబ్బంది కొరత వల్లే! వీజీటీఎం ఉడా పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలో రెండు నగరపాలక సంస్థలు, ఎనిమిది మున్సిపాలిటీలు, సుమారు 1,400 గ్రామాలు ఉన్నాయి. ఉడాలో 120 మంది పనిచేయాల్సి ఉండగా, 58 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేయడం సాధ్యం కావడం లేదని ఉడా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమ లే అవుట్ల తొలగింపు బాధ్యతలను చేపట్టాలని ఆయా గ్రామ పంచాయతీలకు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు లేఖలు రాయాలని నిర్ణయించారు. తమ దృష్టికి వచ్చిన వాటిపై మాత్రం చర్యలు తీసుకుంటామని ఉడా అధికారులు చెబుతున్నారు. ఉడా పరిదిలో 476 లేఅవుట్ల ఉడా పరిధిలో రెండు జిల్లాల్లో కలిపి 2008 నుంచి ఇప్పటి వరకు అన్ని అనుమతులు ఉన్న లే అవుట్లు 476 మాత్రమే ఉన్నాయి. ఇటీవల ఉడా పరిధిలోకి వచ్చిన గ్రామాల్లో కూడా కొన్ని వెంచర్లు ఉన్నాయి. వీటితోపాటు అనధికారికంగా సుమారు 100 వెంచర్లు ఉన్నాయని ఉడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనధికార వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసి నష్టపోవద్దని ఉడా అధికారులు ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని అనుమతులు ఉన్న 476 లే అవుట్ల వివరాలతో ఉడా కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అవసరమైతే అనధికార లేఅవుట్ల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
రియల్ దందా
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : మంచిర్యాలలో అనుమతి లేకుండా ప్లాట్లు వెలుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అక్రమణలపై అధికారులు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోవడంలేదు. మంచిర్యాల మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, హాజీపూర్ గ్రామాలకు చెందిన వందల ఎకరాల పంట పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. మంచిర్యాల పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారికి ఆనుకుని 12కి పైగా అక్రమ లేఔట్లు వెలిశాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు రెవెన్యూ డిపార్టుమెంటుకు చెల్లించాల్సిన వన్‌టైం నాలా పన్ను చెల్లిస్తూ, లేఔట్ అనుమతులను పొందకుండా, గ్రామపంచాయతీకి కట్టాల్సిన పన్ను కట్టకుండానే ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి రియల్టర్లు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి మంచిర్యాల మండలంలో 12 వరకు అక్రమంగా లేఔట్లు చేసిన 75 ఎకరాలను ప్లాట్లుగా చేసి అమ్ముతున్నట్లు పంచాయతీ అధికారులు గుర్తించారు. మరో 50 ఎకరాల్లో చేసిన ప్లాట్ల యజమానుల వివరాలు తెలియకపోవడంతో వారికి ఇప్పటివరకు నోటీసులు అందలేదు. వేంపల్లిలో 57 ఎకరాలు, ముల్కల్లలో 7 ఎకరాలు, గుడిపేటలో 10 ఎకరాలు, హాజీపూర్‌లో ఒక ఎకరం భూమిలో ప్లాట్లు చేసిన వారికి అధికారులు నోటీసులు అందించారు. మంచిర్యాలకు సమీపంలో, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్లాటు గుంటకు రూ. 10 లక్షలు ఉండగా, రోడ్డు నుంచి కొంత లోపల ఉన్న భూమి గుంటకు రూ. 4 లక్షల వరకు ధర పలుకుతుంది. 75 ఎకరాల్లో గ్రామపంచాయతీ అనుమతి తీసుకుంటే, పదిశాతం భూమిని అంటే 7.5 ఎకరాల భూమి గ్రామపంచాయతీకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే గుంట భూమికి సరాసరి రూ. 4 లక్షలు వేసుకున్నా, పంచాయతీలకు కేటాయించే 7.5 ఎకరాల భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.12 కోట్లు ఉంటుంది. అనుమతికి ఎకరాకు లేఔట్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ పేర రూ.12వేల చొప్పున చెల్లిస్తే, రూ.9 లక్షలు గ్రామపంచాయతీకి కట్టాల్సి వస్తుంది. అనుమతులు తీసుకోవాలని పంచాయతీ అధికారులు నోటీసులు పంపుతూ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్న, గడువులు పెడుతూ, ఆ గడువు తీరే లోగా ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీకి కేటాయించాల్సిన 10 శాతం భూమిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములను ఎకరాకు రూ. 10 నుండి 15 లక్షల ధరతో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ, ప్లాట్లుగా చేసి రూ.1.80కోట్లకు అమ్ముకుంటున్నారు. ఈ లెక్కన చూసిన ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనూ ఆదాయానికి గండి పడుతుంది. రిజిస్ట్రేషన్లు, జీపీకి పదిశాతం భూమి, లేఔట్ అనుమతి ఫీజులను కలుపుకుంటే రూ.20 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లే. ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నా స్థానికంగా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో, జిల్లా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించి అక్రమ లే అవుట్లపై కొరడా ఝుళిపించాల్సిన ఉంది. కబ్జాకు గురవుతున్న వాగులు.. రియల్టర్లు ఊరు పుట్టకముందు నుంచి వాగులను కబ్జా చేస్తున్నారు. వేంపల్లి గ్రామంలో వందల ఏళ్ల నుంచి ఉ న్న కండివాగుకు ఇరుపక్కల సర్వే నంబరు 20, 21లోని భూములను రియల్టర్లు ప్లాట్లు చేశారు. ప్లాట్ల సంఖ్య పెరిగేందుకు, వాగుకు ఇరుపక్కల మట్టి వేసి పూడ్చేశా రు. దీంతో 50 ఫీట్లకు పైగా ఉండాల్సిన వాగు వెడల్పు పది ఫీట్లకు పరిమితం చేశారు. ముల్కల్ల శివారులో సర్వే నంబరు 82లో రియల్టర్లు ప్లాట్లు చేశారు. పక్కనే పారుతున్న ర్యాలీవాగును కబ్జా చేశారు. అధికారులు నోటీసులు జారీ చేసినా ఎవరూ స్పందించకపోవడం లేదు. -
రియల్ టక్కర్లు
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో అడ్డు అదుపూ లేకుండా వెలస్తున్న అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారి పాట్లు అన్నీఇన్నీ కావు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రచారార్భాటానికి భ్రమించి, సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్లాట్ కొని, ఇల్లు కట్టేందుకు మున్సిపాలిటీకి వెళ్లినప్పుడు కానీ అసలు బండారం బయటపడదు. అది అక్రమ లే అవుట్ అని, ఎలాంటి అనుమతులూ లేవని తెలిసి హతాశులు కావలసి వస్తుంది. మున్సిపాలిటీ అనుమతి ఇవ్వకపోయినా స్థలం కొన్నాం కదా అని ధైర్యం చేసి ఇల్లు కట్టినా ఆ లే అవుట్లో మున్సిపాలిటీ ఎలాంటి సౌకర్యాలు (అంటే తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, వీధిదీపాల వంటివి) సమకూర్చదు. అక్కడ నుంచి ఆ ప్లాటుదారుని కష్టాలు రెట్టింపవుతాయి. పట్టణంలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 30 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నాయని గుర్తించిన క్రమంలో అలాంటి చోట్ల ప్లాట్లు కొనుగోలు చేసిన, ఇళ్లు కట్టిన వారి పరిస్థితి.. ‘కొరివితో తల గోక్కున్న’ మాదిరిగా ఉంది. పట్టణంలో దాదాపు 200 మంది వరకు ఇలాంటి చిక్కుసమస్యను ఎదుర్కొంటున్నారు. ప్లాట్లు అమ్మిన రియల్టర్ల దగ్గరకు వెళితే సమాధానం చెప్పరు. పోనీ అక్కడ ఇల్లు కడదామంటే మున్సిపాలిటీ సహకరించదు. అనుమతి లేనివే అధికం.. కాగా అమలాపురంలోని అక్రమ లే అవుట్ల దందాపై ప్రత్యేక దృష్టి సారించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటి వరకు పట్టణంలో 30 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు వెలశాయని, వాటి నిమిత్తం భూమి బదలాయింపు రుసుం (కన్వర్షన్ ఫీజు)గా చెల్లించాల్సిన రూ.10 కోట్లను చెల్లించకుండా రియల్టర్లు ప్రభుత్వాదాయానికి గండి కొట్టారని తే ల్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విజిలెన్స్ సీఐ గౌస్‌బేగ్, ఏఓ శ్రీనివాస్‌లతో కూడిన బృందం రంగంలోకి దిగి అక్రమ లే అవుట్ల విస్తీర్ణం, ఎగవేసిన బదలాయింపు రుసుం, మున్సిపల్ అధికారుల అలక్ష్యం తదితర కోణాల్లో మూడు పర్యాయాలు క్షుణ్నంగా తనిఖీలు చేసింది. అమలాపురంలో ఇటీవల దాదాపు 45 ఎకరాల్లో లే అవుట్లు వెలశాయి. వాటిలో 15 ఎకరాల వరకు అన్ని అనుమతులూ ఉన్నాయి. మిగిలిన భూముల్లో అక్రమ లే అవుట్లు వెలసినా, ప్రజల నుంచి ఫిర్యాదు వస్తున్నా మున్సిపల్ అధికారులు ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి పరోక్షంగా అక్రమ లే అవుట్లు వేసిన రియల్టర్లకు సహకరిస్తున్నారు. అటు మున్సిపాలిటీ నుంచి గానీ, ఇటు రెవెన్యూ అధికారుల నుంచి గానీ ఎలాంటి అనుమతులు లేకుండా 30 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన లే అవుట్ల స్థలం విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ.100 కోట్లు ఉంటుందని విజిలెన్స్ అధికారుల అంచనా. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు బదలాయిసున్నప్పుడు ఆ భూముల విలువలో పదోవంతు మొత్తాన్ని రెవెన్యూశాఖకు కన్వర్షన్ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.10 కోట్లు కన్వర్షన్ ఫీజును అక్రమ లే అవుట్దారులు ఎగవేసినట్టు గుర్తించారు. మున్సిపల్ అధికారులపై చర్యలకు సిఫారసు విజిలెన్స్ అధికారులు ఈ వారంలో మూడు పర్యాయాలు అమలాపురం వచ్చి అక్రమ లే అవుట్ల రికార్డులను పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. అక్రమ లే అవుట్ల వద్దకు స్వయంగా వెళ్లి, ఎలాంటి అనుమతులు లేకపోయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన మాయమాటలకు మోసపోయి ప్లాట్లు కొన్నవారితో మాట్లాడి వారు చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు. అక్రమ లే అవుట్లలో ఇళ్లు నిర్మించుకుని ఇబ్బంది పడుతున్న వారి నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకున్నారు. అలాగే 30 ఎకరాల వ్యవసాయ భూములను లే అవుట్లకు బదలాయించినా కన్వర్షన్ ఫీజు చెల్లించని వైనంపై అమలాపురం రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. కాగాఅక్రమ లే అవుట్లకు అనుమతిని ఇవ్వడానికి మున్సిపల్ అధికారులను బాధ్యులను చేస్తూ, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించినట్టు తెలుస్తోంది. లే అవుట్దారులు ఎగవేసిన రూ.10 కోట్ల బదలాయింపు రుసుంను జరిమానాతో వసూలు చేయాలని కూడా నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఏది ఏమైనా సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి కష్టార్జితాన్ని వెచ్చించి స్థలాలు కొన్నవారు ఆ సొమ్ము ‘నేల పాలైన తైలం’ కారాదని, అలాంటి స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వారు అవి ఇక్కట్లకు కేరాఫ్ అడ్రస్‌లు కారాదని కోరుకుంటున్నారు.