LayOut In Telangana: Real Estate Scam With Dharani Portal - Sakshi
Sakshi News home page

Dharani Portal-Nala Conversion: ప్లాట్‌.. పాస్‌‘బుక్కయ్యి’.. ధరణి రూటు మారుస్తున్న రియల్టర్లు, జర జాగ్రత్త!

Published Fri, Dec 31 2021 12:01 PM | Last Updated on Fri, Dec 31 2021 4:51 PM

layOut In Telangana: Real Estate Scam With Dharani Portal - Sakshi

భువనగిరి మండలం చీమల కోడూరు గ్రామ పరిధిలో చేసిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో రెండేళ్ల క్రితం వరంగల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ 120 గజాల ప్లాటు బుక్‌ చేసుకున్నాడు. డబ్బులు చెల్లించడంలో జాప్యం కారణంగా ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ జరగలేదు. ఇటీవల ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం భువనగిరి మండల కార్యాలయానికి పిలిస్తే వెళ్లి తతంగం పూర్తి చేశారు. 

వారం రోజులకు ఇంటి అడ్రస్‌కు గుంట భూమి (వ్యవసాయ భూమి) పట్టా చేసినట్లు పాస్‌ పుస్తకం వచ్చింది. తాను కొనుగోలు చేసినది ప్లాట్‌ కదా అని సదరు వెంచర్‌ వాళ్లను అడిగితే .. ప్లాట్‌ కింద వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు చెప్పి సమస్యేం లేదని సముదాయించారు. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ‘నాలా’(వ్యవసాయేతర భూమిగా) కింద కన్వర్షన్‌ చేయించుకుంటే సరిపోతుందని చెప్పారు’

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని, అధికారుల అండతో రియల్‌ ఎస్టేట్‌ యజమానులు వ్యవసాయ భూములను నివాస యోగ్యమైన ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు పట్టణాభివృద్ధి సంస్థలు లేదా టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ (డీటీసీపీ) ఆమోదించిన లే అవుట్‌ తప్పనిసరని ప్రభుత్వం గత సంవత్సరం స్పష్టం చేసింది. డీటీసీపీ, పట్టణాబివృద్ధిసంస్థలు ఆమోదించిన లే అవుట్‌లలోని ప్లాట్లనే రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయాలని, ఇతర భూములన్నీ ధరణి కింద తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేయించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు మండల తహసీల్దార్లకు రిజిస్ట్రార్‌ హోదా కల్పించింది. అయితే వీటిల్లోని లొసుగులను ఆధారంగా చేసుకున్న రియల్‌ వ్యాపారులు గుంట, గుంటన్నర భూములను కూడా వ్యవసాయ భూములుగా చూపిస్తూ ధరణి పోర్టల్‌ ద్వారా తహసీల్దార్ల వద్ద రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించినహెచ్‌ఎండీఏ పరిధిలోని మండలాలతో పాటు ఇటీవల డిమాండ్‌ పెరిగిన కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థలతో పాటు భువనగిరి, జనగాం, పెద్దపల్లి, సిరిసిల్ల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, వరంగల్‌ జిల్లాల పరిధిలోని మునిసిపాలిటీలలో ఈ తరహాలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ సాగుతోంది. 
చదవండి: ఎక్కడి నుంచో రేగు పండ్ల వాసన.. ఆధునిక, వైజ్ఞానిక మేళవింపు

‘నాలా’కన్వర్షన్‌తో కొన్ని...
వ్యవసాయ భూములను రియల్‌ వెంచర్లుగా మార్చాలంటే ‘నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్స్‌ అసెస్‌మెంట్‌ యాక్ట్‌ (నాలా) ’కింద వ్యవసాయేతర భూమిగా మార్చడం తప్పనిసరి. అక్కడున్న పట్టణీకరణ పరిస్థితులను బట్టి తహసీల్దార్లు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా గుర్తించాల్సి ఉంటుంది. ఫీజుతో పాటు ఇతర ‘చెల్లింపులు’జరిపితే తప్ప నాలా కన్వర్షన్‌ సులభం కాదు. ఈ నేపథ్యంలో కొందరు రియల్టర్లు ‘నాలా’మార్పిడి లేకుండానే తహసీల్దార్లతో ధరణి కింద ప్లాట్లకు పట్టాలు ఇప్పిస్తుండగా, మరికొందరు రియల్టర్లు కొంత అడ్వాన్స్‌ అయ్యారు. కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని ప్లాట్ల వారీగా విభజించి ‘నాలా’కన్వర్షన్‌ చేయించి గజాల చొప్పున విక్రయిస్తున్నారు. ప్లాట్లకు నాలా కన్వర్షన్‌ ఉంటే డీసీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థల అనుమతులేమీ లేకుండానే రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 

డీటీసీపీ, రెరా చట్టాలన్నీ గాలికి...
రాష్ట్రంలోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లన్నీ డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థల అనుమతితోనే చేపట్టాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్ల ద్వారా లే అవుట్లకు అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే 8 ప్లాట్లు అంతకన్నా ఎక్కువ మొత్తంలో విక్రయించాల్సి వస్తే రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అనుమతి తప్పనిసరి. కానీ స్థానిక తహసీల్దార్లు, రిజిస్ట్రార్లను ‘మంచి’చేసుకొని రియల్టర్లు అనధికార లే అవుట్లు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. డీటీసీపీ లే అవుట్‌తో చేసిన వెంచర్లకు కూడా రెరా అనుమతి ఉండడం లేదు. ప్రతి పట్టణ పరిధిలో ఇలాంటి వెంచర్లు పుట్టుకొస్తున్నా, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement