Lay out regyulejesan Scheme (lrs)
-
వెంచర్లో ప్లాట్ కొంటే.. ఇంటికి పాస్‌బుక్ వచ్చింది.. ఇదేంటని అడిగితే
భువనగిరి మండలం చీమల కోడూరు గ్రామ పరిధిలో చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లో రెండేళ్ల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ 120 గజాల ప్లాటు బుక్ చేసుకున్నాడు. డబ్బులు చెల్లించడంలో జాప్యం కారణంగా ప్లాట్ రిజిస్ట్రేషన్ జరగలేదు. ఇటీవల ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం భువనగిరి మండల కార్యాలయానికి పిలిస్తే వెళ్లి తతంగం పూర్తి చేశారు. వారం రోజులకు ఇంటి అడ్రస్‌కు గుంట భూమి (వ్యవసాయ భూమి) పట్టా చేసినట్లు పాస్ పుస్తకం వచ్చింది. తాను కొనుగోలు చేసినది ప్లాట్ కదా అని సదరు వెంచర్ వాళ్లను అడిగితే .. ప్లాట్ కింద వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పి సమస్యేం లేదని సముదాయించారు. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ‘నాలా’(వ్యవసాయేతర భూమిగా) కింద కన్వర్షన్ చేయించుకుంటే సరిపోతుందని చెప్పారు’ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని, అధికారుల అండతో రియల్ ఎస్టేట్ యజమానులు వ్యవసాయ భూములను నివాస యోగ్యమైన ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు పట్టణాభివృద్ధి సంస్థలు లేదా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ (డీటీసీపీ) ఆమోదించిన లే అవుట్ తప్పనిసరని ప్రభుత్వం గత సంవత్సరం స్పష్టం చేసింది. డీటీసీపీ, పట్టణాబివృద్ధిసంస్థలు ఆమోదించిన లే అవుట్లలోని ప్లాట్లనే రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలని, ఇతర భూములన్నీ ధరణి కింద తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మండల తహసీల్దార్లకు రిజిస్ట్రార్ హోదా కల్పించింది. అయితే వీటిల్లోని లొసుగులను ఆధారంగా చేసుకున్న రియల్ వ్యాపారులు గుంట, గుంటన్నర భూములను కూడా వ్యవసాయ భూములుగా చూపిస్తూ ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ల వద్ద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించినహెచ్ఎండీఏ పరిధిలోని మండలాలతో పాటు ఇటీవల డిమాండ్ పెరిగిన కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ పట్టణాభివృద్ధి సంస్థలతో పాటు భువనగిరి, జనగాం, పెద్దపల్లి, సిరిసిల్ల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాల పరిధిలోని మునిసిపాలిటీలలో ఈ తరహాలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ సాగుతోంది. చదవండి: ఎక్కడి నుంచో రేగు పండ్ల వాసన.. ఆధునిక, వైజ్ఞానిక మేళవింపు ‘నాలా’కన్వర్షన్‌తో కొన్ని... వ్యవసాయ భూములను రియల్ వెంచర్లుగా మార్చాలంటే ‘నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ యాక్ట్ (నాలా) ’కింద వ్యవసాయేతర భూమిగా మార్చడం తప్పనిసరి. అక్కడున్న పట్టణీకరణ పరిస్థితులను బట్టి తహసీల్దార్లు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా గుర్తించాల్సి ఉంటుంది. ఫీజుతో పాటు ఇతర ‘చెల్లింపులు’జరిపితే తప్ప నాలా కన్వర్షన్ సులభం కాదు. ఈ నేపథ్యంలో కొందరు రియల్టర్లు ‘నాలా’మార్పిడి లేకుండానే తహసీల్దార్లతో ధరణి కింద ప్లాట్లకు పట్టాలు ఇప్పిస్తుండగా, మరికొందరు రియల్టర్లు కొంత అడ్వాన్స్ అయ్యారు. కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని ప్లాట్ల వారీగా విభజించి ‘నాలా’కన్వర్షన్ చేయించి గజాల చొప్పున విక్రయిస్తున్నారు. ప్లాట్లకు నాలా కన్వర్షన్ ఉంటే డీసీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థల అనుమతులేమీ లేకుండానే రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. డీటీసీపీ, రెరా చట్టాలన్నీ గాలికి... రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లన్నీ డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థల అనుమతితోనే చేపట్టాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ల ద్వారా లే అవుట్లకు అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే 8 ప్లాట్లు అంతకన్నా ఎక్కువ మొత్తంలో విక్రయించాల్సి వస్తే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అనుమతి తప్పనిసరి. కానీ స్థానిక తహసీల్దార్లు, రిజిస్ట్రార్లను ‘మంచి’చేసుకొని రియల్టర్లు అనధికార లే అవుట్లు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. డీటీసీపీ లే అవుట్‌తో చేసిన వెంచర్లకు కూడా రెరా అనుమతి ఉండడం లేదు. ప్రతి పట్టణ పరిధిలో ఇలాంటి వెంచర్లు పుట్టుకొస్తున్నా, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. -
ఎల్ఆర్ఎస్: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేసిన షిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఇటీవల ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న ఎల్ఆర్ఎస్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోమటి రెడ్డి అత్యున్నత హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఎంపీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించగా..ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. (ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు! ) రెగ్యులరైజేషన్ జివోలోని రూల్ 10,13ను సవాల్ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. నిబంధ 10 ద్వారా పెనాల్టీ వసూళ్లు చేస్తున్నారు, ఇలా వసూళ్ళ చేసే పెనాల్టీలను ఉపసంహరణ చెయ్యాల్సి ఉంటుంది. నిబంధన 13 ద్వారా రిజిస్ట్రేషన్ ఆపివేయడం. దానిని కొట్టివేయాల్సి ఉంటుంది. ఈ రెండు నిబంధనలపైన హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. (‘అశ్రు నయనాలతో బాలుకి నివాళులు’) -
లాస్ట్ ఛాన్స్ ఫీజు ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్ : మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తులు క్లియరైనవారు ఫీజు చెల్లించాలంటూ సంక్షిప్త సందేశాలు పంపుతోంది. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు డిసెంబర్ 31తో ముగుస్తుందని నవంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫీజు వసూలుపై బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలని సమాచారం అందుకున్నవారు దాదాపు 10 వేల మందికి పైగా ఉన్నారు. వీరు ఆ మొత్తం చెల్లిస్తే హెచ్ఎండీఏ ఖజానాకు దాదాపు రూ.90 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి కాకుండా వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు కూడా క్లియర్ చేస్తే మరో రూ.40 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది. దీంతో అధికారులు ఆ దిశగా వడివడిగా చర్యలు చేపడుతున్నారు. కాగా, హెచ్ఎండీఏకు వచ్చిన 1.70 లక్షల దరఖాస్తుల్లో లక్ష క్లియర్ అవగా, 62 వేల దరఖాస్తులను తిరస్కరించారు. వివిధ కారణాలతో 8 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మళ్లీ దరఖాస్తుల వెల్లువ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువును ఈ నెలాఖరు వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో చిన్నచిన్న కారణాలతో తిరస్కరణకు గురైన దరఖాస్తులను మళ్లీ రీ అప్పీల్‌కు పెట్టుకుంటున్నారు. వీటి సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. మళ్లీ ఈ దరఖాస్తులను టైటిల్ స్రూ్కటినీ, టెక్నికల్ స్రూ్కటినీ చేసి సక్రమంగా ఉంటే ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు కట్టాలంటూ దరఖాస్తుదారుడి సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం పంపుతారు. ఫీజు చెల్లించిన వెంటనే ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఆన్లైన్లో జారీ చేస్తారు. అయితే, ఊహించిన దానికన్నా దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఉన్న ప్లానింగ్ సిబ్బందిపై మోయలేని భారం పడుతుండడంతో పనులు వేగంగా ముందుకు సాగడం లేదు. ఇప్పటికే ఆ సిబ్బందికి తమ రోజువారీ పనులకు ఇవి అదనం కావడంతో ఆఫీసు సమయాన్ని మించి పనిచేస్తున్నారు. ఒక్కోసారి ఆన్లైన్ వ్యవస్థ మొరాయించడం కూడా వీరికి కష్టాలు తెచి్చపెడుతోంది. ప్రభుత్వం విధించిన తుది గడువుకు మరో 21 రోజులు మాత్రమే ఉండటంతో పూర్తిస్థాయిలో ఎల్ఆర్ఎస్పై దృష్టి సారించినట్టు హెచ్ఎండీ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు రూపంలో హెచ్ఎండీఏకు రూ.1000 కోట్ల ఆదాయం వచి్చన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌తో మరో రూ.100 కోట్లకు పైనే ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. -
నిధులు రావు.. పనులు కావు..
మండపేట, న్యూస్‌లైన్ : వివిధ కారణాలవల్ల 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో పట్టణాల్లో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. జిల్లాలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో రూ.43.27 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఇంతవరకూ ప్రతిపాదనల దశ కూడా దాటని దుస్థితి నెలకొంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత రెండు మూడు వాయిదాల్లో ఆర్థిక సంఘం నిధులు విడుదలవడం పరిపాటి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని ఆయా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు రూ.19.38 కోట్లు,2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.23.89 కోట్లు వార్షిక కేటాయింపులు చేశారు. మొత్తం రెండేళ్లకు కలిపి రూ.43.27 కోట్లు ఇప్పటివరకూ విడుదల కాలేదు. ఎందుకంటే.. ఏళ్లు గడుస్తున్నా ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విమర్శలున్నాయి. మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరపకపోవడంతో పట్టణాల్లో స్థానిక సంస్థలు ఏర్పడలేదు. అలాగే 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల నిధుల వినియోగానికి సంబంధించిన నివేదికలు అందజేయడంలో పలు మున్సిపాల్టీలు తాత్సారం చేశాయి. ఈ రెండు కారణాలవల్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదని చెబుతున్నారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ నిధుల వినియోగానికి లభించని అనుమతులు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్), లే అవుట్ రెగ్యులేజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ద్వారా నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు సమకూరిన ఆదాయాన్ని అభివృద్ధి పనులకు వెచ్చించాలని ప్రభుత్వం గత నవంబర్‌లో ఉత్తర్వులిచ్చింది. ఆర్థిక సంఘం నిధులు విడుదలైన తర్వాత వాటిని బీపీఎస్, ఎల్ఆర్ఎస్ నిధులకు సర్దుబాటు చేసేవిధంగా అప్పట్లో పురపాలన సంచాలకుల (డీఎంఏ) నుంచి మున్సిపాలిటీలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లతో పాటు పురపాలక సంఘాల్లో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీంల ద్వారా వచ్చిన సుమారు రూ.21.37 కోట్లతో వివిధ పనులకు అప్పట్లో ప్రతిపాదనలు పంపారు. కానీ, డీఎంఏ నుంచి ఇప్పటివరకూ అనుమతులు రాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.25.63 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఆర్థిక సంఘం రూ.25.63 కోట్లు కేటాయించింది. రాజమండ్రి కార్పొరేషన్‌కు రూ.7.55 కోట్లు, కాకినాడకు రూ.8.28 కోట్లు, అమలాపురం మున్సిపాల్టీకి రూ.1.17 కోట్లు, మండపేటకు రూ.1.18 కోట్లు, సామర్లకోటకు రూ.1.25 కోట్లు, తునికి రూ.1.18 కోట్లు, పిఠాపురానికి రూ.1.16 కోట్లు, పెద్దాపురానికి రూ.1.09 కోట్లు, రామచంద్రపురానికి రూ.96.4 లక్షలు, ముమ్మిడివరం నగర పంచాయతీకి రూ.55.99 లక్షలు, గొల్లప్రోలుకు రూ.52.73 లక్షలు, ఏలేశ్వరానికి రూ.70.85 లక్షలు కేటాయించింది. కాగా, ఈ నిధుల్లో డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్, సర్వీస్ లెవెల్ బెంచ్ మార్కుల కోసం ప్రభుత్వం కేటాయింపులు చేసింది. కార్పొరేషన్లలో రూ.17 లక్షలు, మున్సిపాల్టీల్లో రూ.13.4 లక్షల నుంచి రూ.14.6 లక్షల వరకూ, నగర పంచాయతీల్లో రూ.13.4 లక్షల చొప్పున వెచ్చించాలని సూచించింది. మిగిలిన నిధులను పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, తాగునీటి అవసరాలు, పైప్లైన్ల మార్పు తదితర అభివృద్ధి పనులకు వెచ్చించాలి. ఈ కేటాయింపుల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులపై ఇప్పటికే ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల నుంచి డీఎంఏ ప్రతిపాదనలు తీసుకున్నారు. కానీ ఇంతవరకూ నిధులు విడుదల కాలేదు. త్వరితగతిన నిధులు విడుదల చేయడం ద్వారా పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.