మండపేట, న్యూస్‌లైన్ : వివిధ కారణాలవల్ల 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో పట్టణాల్లో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. జిల్లాలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో రూ.43.27 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఇంతవరకూ ప్రతిపాదనల దశ కూడా దాటని దుస్థితి నెలకొంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత రెండు మూడు వాయిదాల్లో ఆర్థిక సంఘం నిధులు విడుదలవడం పరిపాటి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని ఆయా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు రూ.19.38 కోట్లు,2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.23.89 కోట్లు వార్షిక కేటాయింపులు చేశారు. మొత్తం రెండేళ్లకు కలిపి రూ.43.27 కోట్లు ఇప్పటివరకూ విడుదల కాలేదు.
ఎందుకంటే..
ఏళ్లు గడుస్తున్నా ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విమర్శలున్నాయి. మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరపకపోవడంతో పట్టణాల్లో స్థానిక సంస్థలు ఏర్పడలేదు. అలాగే 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల నిధుల వినియోగానికి సంబంధించిన నివేదికలు అందజేయడంలో పలు మున్సిపాల్టీలు తాత్సారం చేశాయి. ఈ రెండు కారణాలవల్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదని చెబుతున్నారు.
బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ నిధుల వినియోగానికి లభించని అనుమతులు
బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్), లే అవుట్ రెగ్యులేజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు సమకూరిన ఆదాయాన్ని అభివృద్ధి పనులకు వెచ్చించాలని ప్రభుత్వం గత నవంబర్‌లో ఉత్తర్వులిచ్చింది. ఆర్థిక సంఘం నిధులు విడుదలైన తర్వాత వాటిని బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ నిధులకు సర్దుబాటు చేసేవిధంగా అప్పట్లో పురపాలన సంచాలకుల (డీఎంఏ) నుంచి మున్సిపాలిటీలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లతో పాటు పురపాలక సంఘాల్లో బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ స్కీంల ద్వారా వచ్చిన సుమారు రూ.21.37 కోట్లతో వివిధ పనులకు అప్పట్లో ప్రతిపాదనలు పంపారు. కానీ, డీఎంఏ నుంచి ఇప్పటివరకూ అనుమతులు రాలేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.25.63 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఆర్థిక సంఘం రూ.25.63 కోట్లు కేటాయించింది. రాజమండ్రి కార్పొరేషన్‌కు రూ.7.55 కోట్లు, కాకినాడకు రూ.8.28 కోట్లు, అమలాపురం మున్సిపాల్టీకి రూ.1.17 కోట్లు, మండపేటకు రూ.1.18 కోట్లు, సామర్లకోటకు రూ.1.25 కోట్లు, తునికి రూ.1.18 కోట్లు, పిఠాపురానికి రూ.1.16 కోట్లు, పెద్దాపురానికి రూ.1.09 కోట్లు, రామచంద్రపురానికి రూ.96.4 లక్షలు, ముమ్మిడివరం నగర పంచాయతీకి రూ.55.99 లక్షలు, గొల్లప్రోలుకు రూ.52.73 లక్షలు, ఏలేశ్వరానికి రూ.70.85 లక్షలు కేటాయించింది. కాగా, ఈ నిధుల్లో డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్, సర్వీస్ లెవెల్ బెంచ్ మార్కుల కోసం ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
కార్పొరేషన్లలో రూ.17 లక్షలు, మున్సిపాల్టీల్లో రూ.13.4 లక్షల నుంచి రూ.14.6 లక్షల వరకూ, నగర పంచాయతీల్లో రూ.13.4 లక్షల చొప్పున వెచ్చించాలని సూచించింది. మిగిలిన నిధులను పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, తాగునీటి అవసరాలు, పైప్‌లైన్ల మార్పు తదితర అభివృద్ధి పనులకు వెచ్చించాలి. ఈ కేటాయింపుల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులపై ఇప్పటికే ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల నుంచి డీఎంఏ ప్రతిపాదనలు తీసుకున్నారు. కానీ ఇంతవరకూ నిధులు విడుదల కాలేదు. త్వరితగతిన నిధులు విడుదల చేయడం ద్వారా పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిధులు రావు.. పనులు కావు..
Published Fri, May 23 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement
Advertisement