Building Penalization Scheme (bps)
-
దాని వెనుకున్న ఆంతర్యమేంటి?
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) కింద క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తున్నా అక్రమార్కులు నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆంతర్యమేంటనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ యేడాది ఆగస్టు5 బీపీఎస్ గడువు ముగిసినా మళ్లీ 31వరకు గడువును ప్రభుత్వం పొడిగించింది. అయితే కేవలం 18 కట్టడాలే క్రమబద్ధీకరించబడ్డాయి. లక్షకుపైగా జనాభా..గ్రేడ్ 1 మున్సిపాలిటి ఎమ్మిగనూరు పట్టణంలో అక్రమ లే అవుట్లు..అక్రమ కట్టడాలకూ కొదవలేదు. పట్టణంలో దాదాపు 26,500 భవనాలు ఉన్నాయి. దాదాపు 750కిపైగానే అక్రమ నిర్మాణాలు ఉంటాయన్నది అనధికారిక అంచనా. మున్సిపల్ సాధారణ నిబంధనలు అటుంచుతే కనీసం అనమతి కూడా లేకుండా నిర్మించిన భవనాలు లేకపోలేదు. అక్రమకట్టడాల క్రమబద్ధీకరణకు 86మంది దరఖాస్తు చేసుకోగా 18 మాత్రమే క్రమబద్ధీకరించగా మున్సిపాలిటీకి రూ.16లక్షల ఆదాయం సమకూరింది. మొత్తం అక్రమకట్టడాలు క్రమబద్ధీకరిస్తే రూ. కోట్లలో ఆదాయం వచ్చేదని అధికారులు చర్చించుకుంటున్నారు. చర్యలకు వెనుకడుగు.. ప్రభుత్వం బీపీఎస్‌కు అవకాశం కల్పించినా అక్రమకట్టడాలు చేపట్టిన యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికారులు చర్యలు చేపట్టలేరనే ధైర్యమా... అనాధికారికంగా జరిగిన ఒప్పందాలేమైనా ఉన్నాయా అనే విమర్శలూ లేకపోలేదు. మున్సిపల అధికారులు అనుకుంటే క్రమబద్ధీకరించుకోని నిర్మాణాలను కూల్చివేసే అధికారం ఉంది. ఆస్తిపన్నుపై 25శాతం పెంచి జీవితకాలం వసూలు చేయొచ్చు. శాశ్వతంగా కుళాయి కనెక్షన్లు తొలగించవచ్చు. మున్సిపల్ అధికారులు ఏమిచేయలేరులే అన్న భావన అక్రమకట్టడదారుల్లో ఉండటం, లైసెన్సున్డు సర్వేయర్ల ఆధిపత్యం సాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 16లక్షల ఆదాయం బీపీఎస్ కింద ఆగస్టు 5నుంచి 31వరకు 18 కట్టడాలు క్రమబద్ధీకరించబడ్డాయి.రూ.16లక్షల ఆదాయం వచ్చింది. బీపీఎస్ గడువు ముగిసినందునæ అక్రమకట్టడాలకు నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటాం. – హయాత్,టీపీఓ -
బీపీ‘ఎస్ అనరే’..!
బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం).. అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ఓ అవకాశం. దీనికి విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో స్పందన భారీగానే వచ్చింది. గడువులోగా 2,179 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరించడంలో వీఎంసీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. సిబ్బంది కొరత అంటూ సాకులు చూపుతూ కార్పొరేషన్ ఆదాయ మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరోవైపు కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ‘చెల్లింపులు’ చేస్తేనే ఫైలు కదులుతోందన్న విమర్శలు లేకపోలేదు. సాక్షి, పటమట(విజయవాడ) : నగరంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న బీపీఎస్ పథకంలో క్రమబద్ధీకరించుకునేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు అధికారుల వెరిఫికేషన్, చలానా చెల్లింపులు చేయటానికి నెలలుగా ఎదురుచూడాల్సి వస్తుంది. వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పటికీ వాటిని పరిశీలించేందుకు అధికారులకు సమయం లేకుండా పోతుండటం గమనార్హం. జూన్ 30తో ముగిసిన గడువు.. నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గత ఏడాది చివరి అవకాశంగా పేర్కొంటూ మూడు నెలల కాలానికి పరిమితి విధించి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్) ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 30వ తేదీ వరకు వీఎంసీ దరఖాస్తులను బీపీఎస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. కార్పొరేషన్లో 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 5,000 బీపీఎస్ దరఖాస్తులు అందాయి. అప్పటి నుంచి విడతల వారీగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో అధికారులు నానాటికీ తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. గతంలో బీపీఎస్‌లో దరఖాస్తులను పరిశీలించి భవనాలను క్రమబద్ధీకరించేందుకు కార్పొరేషన్‌కు రూ. 78 కోట్ల ఆదాయం సమకూరింది. వీటితో కార్పొరేషన్‌లోని మూడు సర్కిళ్ల పరిధిలోని పలు నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించారు. ఒక్కో దరఖాస్తు పరిశీలనకు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు వంతుల వారీగా ‘చెల్లింపులు’ జరిగితే దరఖాస్తు చేసుకున్న భవనాల పరిశీలనకు వస్తారని ఆరోపణలు వస్తున్నాయి. 2,179 దరఖాస్తులు.. జనవరి నుంచి ఇప్పటి వరకు నగరంలోని 59 డివిజన్లలో మూడు సర్కిళ్ల పరిధిలో 2,179 దరఖాస్తులు రాగా దరఖాస్తుల సమర్పణలో వీఎంసీకి రూ. 3.74 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం బీపీఎస్‌లో 700 దరఖాస్తులు కూడా పరిశీలన చేయలేదని సమాచారం. చేయి తడిపితేనేనా..! రెండువేలకు పైగా ఉన్న నూతన దరఖాస్తులను పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేయటానికి అధికారులు తత్సారం చేస్తున్నారని, కాసులు ఇస్తేనే వారి భవనాలను క్రమబద్ధీకరిస్తున్నారని, దీనికితోడు డీవియేషన్ కొలతల సమయంలో ‘చేతి చమురు’ను బట్టి చలానాల్లో జరిమానాలను నిర్ధారిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీఎంసీ వాదన ఇదీ.. అయితే వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో భారీగా సిబ్బంది కొరత ఉందని అందువల్లే పరిశీలన కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వీఎంసీ ఒక సిటీప్లానర్, ఇద్దరు అసిస్టెంట్ సిటీప్లానర్లతోపాటు ముగ్గురు టౌన్ సూపర్వైజర్లు, ఒక ట్రేనర్, ఒక టౌన్ సర్వేయర్, 12 మంది టీపీబీవోలు ఉన్నారు. సిబ్బంది సంఖ్య మరింత పెంచాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బది లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. -
అవకాశమిచ్చినా అందిపుచ్చుకోరా..
సాక్షి, విజయనగరం : పట్టణ ప్రాంతాల్లో అక్రమ భవనాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అనుమతుల్లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం బీపీఎస్ పథకం ద్వారా మంచి అవకాశమిచ్చినా సద్వినియోగం చేసుకునేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బీపీఎస్‌ను (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) అమలు చేస్తున్న అనుకున్నవిధంగా స్పందన రాలేదు. జిల్లాలోని నాలుగు పట్టణ ప్రాంతాల్లో వేల సంఖ్యలో అక్రమ భవనాలు ఉన్నాయన్న విషయం బహిరంగ సత్యమైనా.. వాటిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో యజ మానులు సైతం నిర్లక్ష్యం నటిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో మున్సిపల్, కార్పొరేషన్ల ఖజా నాకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న బీపీఎస్ గడువును మరో మారు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు జూలై నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ పథకం ప్రారంభించగా... ఏప్రిల్ 6వ తేదీ వరకు గడువిచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరో రెండు నెలల పాటు జూన్ నెలాఖరు వరకు గడువు పెంచింది. అయినప్పటికీ అక్రమభవనాల యజమానుల్లో స్పందన లేకపోవడంతో మరో నెల రోజుల గడువు పెంచుతూ జూలై నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. దీంతో గడిచిన ఐదు నెలల వ్యవధిలో ఇప్పటివరకు రెండు సార్లు గడువు పెంచినట్లైంది. అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు అమలు చేస్తోన్న బీపీఎస్ స్కీమ్‌కు జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. 1985 జనవరి 1వ తేదీ నుంచి 2018 ఆగస్టు 31 వరకు వాస్తవ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టినా.. అసలు అనుమతులే పొందకుండా నిర్మించిన అక్రమ కట్టడాలకు అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించింది. అనుమతిలేని లే అవుట్లలో నిర్మాణం జరిగిన భవనాలను కూడా క్రమబద్ధీకరణ చేసుకోవచ్ఛు. అనధికార భవన నిర్మాణదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.10 వేలు చొప్పున చెల్లించాలి. ఆ తర్వాత సంబంధిత అధికారులు భవనాలను పరిశీలించి ప్రణాళిక విభాగం ఇచ్చిన అనుమతులకు భిన్నంగా నిర్మించిన భవనాలను గుర్తించి అపరాధ రుసుం చెల్లించాల్సిందిగా తాఖీదులు ఇస్తారు. అందుకు సంబంధించిన అన్ని రికార్డులను ఆన్లైన్లోనే పొందుపరచాలి. ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాతే క్రమబద్ధీకరిస్తూ అనుమతులిస్తారు. అయితే ఈ పథకం కింద జిల్లాలోని నాలుగు పట్టణ ప్రాంతాల నుంచి మొత్తంగా 1126 దరఖాస్తులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 876 దరఖాస్తులు నమోదుకాగా... బొబ్బిలి మున్సిపాలిటీ నుంచి 88, పార్వతీపురం మున్సిపాలిటీ నుంచి 89, సాలూరు మున్సిపాలిటీ నుంచి 73 దరఖాస్తులు వచ్చాయి. నాలుగు పట్టణాల్లో వాస్తవ పరిస్థితిని గమనిస్తే ప్రతి మున్సిపాలిటీలో వందల సంఖ్యలోనే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలున్నాయి. అయితే ఆయా భవనాల యజమానులకు రాజకీయ అండదండలు, ఆర్థిక బలం ఉండడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సాహసించడం లేదు. అంతేకాకుండా కొందరు అధికారులు, ఉద్యోగులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇబ్బందులు తప్పవు.. జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో అక్రమ భవన నిర్మాణాల బాగోతం కనిపిస్తోంది. భవనాలను క్రమద్ధీకరించుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు తొలగించడంతో పాటు క్ర య, విక్రయాలు జరపకుండా నిషేధం విధిస్తారు. మరీ తప్పనిసరి పరిస్థితులైతే ఆయా భవనాలను నేలమట్టం చేసే అవకాశం కూడా ఉంది. గడువు పెంపు.. పట్టణాల్లో అనధికార భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తుదారులు ఈ నెలాఖరులోగా ఆన్లైన్ చేసుకోవాలి. అక్రమంగా భవనాలు నిర్మించిన వాటిని గుర్తించి ఇప్పటికే నోటీసులు జారీ చేయటంతో పాటు వారికి అవగాహన కల్పిస్తున్నాం. క్రమబద్ధీకరణ చేసుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. – వి.శోభన్‌బాబు, కె.హరిదాసు, సిటీ ప్లానర్లు, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిష్కారంలో జాప్యం.. బీపీఎస్‌లో మొత్తం నాలుగు పట్టణాల నుంచి 1126 దరఖాస్తులు నమోదుకాగా..అందులో 93 దరఖాస్తులను పరిష్కరించి భవనాలను క్రమబద్ధీకరించారు. ఇందులో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో 40, సాలూరు మున్సిపాలిటీలో 22, బొబ్బిలి మున్సిపాలిటీలో 31 దరఖాస్తులను క్రమబద్ధీకరించారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 3 దరఖాస్తులను తిరస్కరించారు. నాలుగు పట్టణాల్లో మరో 719 దరఖాస్తులు ఇప్పటికీ అధికారుల పరిశీలనలో ఉన్నాయి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో 117 దరఖాస్తులను అధికారులు పరిశీలించాల్సి ఉంది. అధికారుల పరిశీలన అనంతరం అపరాధ రుసుం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసిన దరఖాస్తులు మరో 186 వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. -
ఈసారైనా పరిష్కారమయ్యేనా?
సాక్షి, ఆమదాలవలస : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీలో భవనాల క్రమబద్ధీకరణపై చేపట్టిన బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) అనుకున్న ఫలితం ఇవ్వడంలేదు. ఈ స్కీం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది. భవన యజమానులకు ఊరట కలగడంతోపాటు మున్సిపాలిటీకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుంది. ఇంతవరకు భాగానే ఉన్నా పథకంలో భాగంగా వచ్చిన దరఖా స్తులను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. మరో వైపు మున్సిపల్ అధికారులు గృహాలకు కొలతలు వేసి అధిక మొత్తంలో అపరాధ రుసుం విధిస్తున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు భవన యజమానులు వెనుకంజ వేస్తుండడంతో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పటివరకు 101 దరఖాస్తులు బీపీఎస్ కింద తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానించడంతో మున్సిపాలిటీ పరిధిలో 101 దరఖాస్తులు వచ్చాయి. తొలివిడతలో 46, రెండో విడతలో 21 దరఖాస్తులు పరిష్కరించారు. మున్సిపాలిటీకి సుమారు రూ.49లక్షల వరకు ఆదాయం వచ్చింది.వాస్తవంగా ప్రభుత్వం విధించిన గడువు గత ఏడాది అక్టోబరు 30తో ముగియగా నవంబరు 30వరకు గడువు పెంచు తూ మరో ఉత్తర్వులు జారీ చేశారు. గడువు పెంచడం తప్ప ఇంతవరకు దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటీవల ఈ గడువును ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పెంచినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కొత్త జీవో ప్రకారం దరఖాస్తుదారుడు తొలుత రూ.10వేలు మీసేవ కేంద్రంలో అపరాధ రుసుం చెల్లించి మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాలకు అడ్డా ఆమదాలవలస మున్సిపాలిటీలోని 23వార్డులలో సుమారు 12వేల గృహాలు ఉన్నాయి. ఇందులో 1985కు ముందు నిర్మించిన ఇళ్లకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు అవసరం లేదు. ఆ తరువాత నిర్మించిన భవనాలకు 199లో బీఆర్ఎస్(బిల్డింగ్ రెగ్యూలైజేషన్ స్కీం) కింద, 2007లో బీపీఎస్ స్కీం కింద అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మళ్లీ 2016–17లో బీపీఎస్ స్కీం కింద తమ గృహాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరుతు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో సుమారు 1000కు పైగా అక్రమ నిర్మాణాలు(అనుమతులు) లేని గృహాలు ఉన్నాయని అధికారిక సమాచారం. అందులో ప్రస్తుతం 101 మంది నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వారిలో కొంతమంది యజమానులకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని, కొంతమందికి మున్సిపల్ అధికారుల అండదండలు ఉన్నాయని, అందుకే వారు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది భవన యజమానులు మున్సిపల్ పాలకులకు, అధికారులకు మామ్మూళ్లు ఇస్తూ మేనేజ్ చేసుకుంటున్నట్లు బహిరంగ ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులు పాలకులు స్పందించి మున్సిపల్ ఆదాయాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
నిధులు రావు.. పనులు కావు..
మండపేట, న్యూస్‌లైన్ : వివిధ కారణాలవల్ల 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో పట్టణాల్లో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. జిల్లాలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో రూ.43.27 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఇంతవరకూ ప్రతిపాదనల దశ కూడా దాటని దుస్థితి నెలకొంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత రెండు మూడు వాయిదాల్లో ఆర్థిక సంఘం నిధులు విడుదలవడం పరిపాటి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని ఆయా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు రూ.19.38 కోట్లు,2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.23.89 కోట్లు వార్షిక కేటాయింపులు చేశారు. మొత్తం రెండేళ్లకు కలిపి రూ.43.27 కోట్లు ఇప్పటివరకూ విడుదల కాలేదు. ఎందుకంటే.. ఏళ్లు గడుస్తున్నా ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విమర్శలున్నాయి. మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరపకపోవడంతో పట్టణాల్లో స్థానిక సంస్థలు ఏర్పడలేదు. అలాగే 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల నిధుల వినియోగానికి సంబంధించిన నివేదికలు అందజేయడంలో పలు మున్సిపాల్టీలు తాత్సారం చేశాయి. ఈ రెండు కారణాలవల్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదని చెబుతున్నారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ నిధుల వినియోగానికి లభించని అనుమతులు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్), లే అవుట్ రెగ్యులేజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ద్వారా నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు సమకూరిన ఆదాయాన్ని అభివృద్ధి పనులకు వెచ్చించాలని ప్రభుత్వం గత నవంబర్‌లో ఉత్తర్వులిచ్చింది. ఆర్థిక సంఘం నిధులు విడుదలైన తర్వాత వాటిని బీపీఎస్, ఎల్ఆర్ఎస్ నిధులకు సర్దుబాటు చేసేవిధంగా అప్పట్లో పురపాలన సంచాలకుల (డీఎంఏ) నుంచి మున్సిపాలిటీలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లతో పాటు పురపాలక సంఘాల్లో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీంల ద్వారా వచ్చిన సుమారు రూ.21.37 కోట్లతో వివిధ పనులకు అప్పట్లో ప్రతిపాదనలు పంపారు. కానీ, డీఎంఏ నుంచి ఇప్పటివరకూ అనుమతులు రాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.25.63 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఆర్థిక సంఘం రూ.25.63 కోట్లు కేటాయించింది. రాజమండ్రి కార్పొరేషన్‌కు రూ.7.55 కోట్లు, కాకినాడకు రూ.8.28 కోట్లు, అమలాపురం మున్సిపాల్టీకి రూ.1.17 కోట్లు, మండపేటకు రూ.1.18 కోట్లు, సామర్లకోటకు రూ.1.25 కోట్లు, తునికి రూ.1.18 కోట్లు, పిఠాపురానికి రూ.1.16 కోట్లు, పెద్దాపురానికి రూ.1.09 కోట్లు, రామచంద్రపురానికి రూ.96.4 లక్షలు, ముమ్మిడివరం నగర పంచాయతీకి రూ.55.99 లక్షలు, గొల్లప్రోలుకు రూ.52.73 లక్షలు, ఏలేశ్వరానికి రూ.70.85 లక్షలు కేటాయించింది. కాగా, ఈ నిధుల్లో డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్, సర్వీస్ లెవెల్ బెంచ్ మార్కుల కోసం ప్రభుత్వం కేటాయింపులు చేసింది. కార్పొరేషన్లలో రూ.17 లక్షలు, మున్సిపాల్టీల్లో రూ.13.4 లక్షల నుంచి రూ.14.6 లక్షల వరకూ, నగర పంచాయతీల్లో రూ.13.4 లక్షల చొప్పున వెచ్చించాలని సూచించింది. మిగిలిన నిధులను పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, తాగునీటి అవసరాలు, పైప్లైన్ల మార్పు తదితర అభివృద్ధి పనులకు వెచ్చించాలి. ఈ కేటాయింపుల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులపై ఇప్పటికే ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల నుంచి డీఎంఏ ప్రతిపాదనలు తీసుకున్నారు. కానీ ఇంతవరకూ నిధులు విడుదల కాలేదు. త్వరితగతిన నిధులు విడుదల చేయడం ద్వారా పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.