ఆమదాలవలస పట్టణంలో ప్రధాన రహదారి
సాక్షి, ఆమదాలవలస : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీలో భవనాల క్రమబద్ధీకరణపై చేపట్టిన బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) అనుకున్న ఫలితం ఇవ్వడంలేదు. ఈ స్కీం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది. భవన యజమానులకు ఊరట కలగడంతోపాటు మున్సిపాలిటీకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుంది. ఇంతవరకు భాగానే ఉన్నా పథకంలో భాగంగా వచ్చిన దరఖా స్తులను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. మరో వైపు మున్సిపల్ అధికారులు గృహాలకు కొలతలు వేసి అధిక మొత్తంలో అపరాధ రుసుం విధిస్తున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు భవన యజమానులు వెనుకంజ వేస్తుండడంతో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతోంది.
ఇప్పటివరకు 101 దరఖాస్తులు
బీపీఎస్ కింద తొలిసారిగా ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానించడంతో మున్సిపాలిటీ పరిధిలో 101 దరఖాస్తులు వచ్చాయి. తొలివిడతలో 46, రెండో విడతలో 21 దరఖాస్తులు పరిష్కరించారు. మున్సిపాలిటీకి సుమారు రూ.49లక్షల వరకు ఆదాయం వచ్చింది.వాస్తవంగా ప్రభుత్వం విధించిన గడువు గత ఏడాది అక్టోబరు 30తో ముగియగా నవంబరు 30వరకు గడువు పెంచు తూ మరో ఉత్తర్వులు జారీ చేశారు. గడువు పెంచడం తప్ప ఇంతవరకు దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటీవల ఈ గడువును ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పెంచినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కొత్త జీవో ప్రకారం దరఖాస్తుదారుడు తొలుత రూ.10వేలు మీసేవ కేంద్రంలో అపరాధ రుసుం చెల్లించి మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది.
అక్రమ నిర్మాణాలకు అడ్డా
ఆమదాలవలస మున్సిపాలిటీలోని 23వార్డులలో సుమారు 12వేల గృహాలు ఉన్నాయి. ఇందులో 1985కు ముందు నిర్మించిన ఇళ్లకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు అవసరం లేదు. ఆ తరువాత నిర్మించిన భవనాలకు 199లో బీఆర్‌ఎస్(బిల్డింగ్ రెగ్యూలైజేషన్ స్కీం) కింద, 2007లో బీపీఎస్ స్కీం కింద అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మళ్లీ 2016–17లో బీపీఎస్ స్కీం కింద తమ గృహాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరుతు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో సుమారు 1000కు పైగా అక్రమ నిర్మాణాలు(అనుమతులు) లేని గృహాలు ఉన్నాయని అధికారిక సమాచారం. అందులో ప్రస్తుతం 101 మంది నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
మిగిలిన వారిలో కొంతమంది యజమానులకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని, కొంతమందికి మున్సిపల్ అధికారుల అండదండలు ఉన్నాయని, అందుకే వారు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది భవన యజమానులు మున్సిపల్ పాలకులకు, అధికారులకు మామ్మూళ్లు ఇస్తూ మేనేజ్ చేసుకుంటున్నట్లు బహిరంగ ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులు పాలకులు స్పందించి మున్సిపల్ ఆదాయాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment