సాక్షి, అమరావతి: బీచ్ పర్యాటకంతో కోస్తా తీరానికి కొత్త కళ చేకూరనుంది. 12 జిల్లాల్లో కోస్తా తీరం వెంట 363 బీచ్‌లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిషరీస్ యూనివర్సిటీ, పర్యాటక శాఖ, మత్స్యశాఖలతో కూడిన 11 బృందాలు కోస్తా తీరం వెంట సర్వే చేసి ఎక్కడెక్కడ బీచ్‌లను అభివృద్ధి చేయవచ్చో గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో కోస్టల్ జోన్ టూరిజం పేరుతో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తారు.
చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా పర్యావరణానికి అనుకూలంగా బీచ్‌లను తీర్చిదిద్దనున్నారు. కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ చట్ట ప్రకారం బీచ్‌లకు అనుమతి కోసం పర్యాటక శాఖ కలెక్టర్లకు నివేదిక పంపించింది. బీచ్‌ల అభివృద్ధిపై ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు.మత్స్యకారులతో పాటు టూరిజం ఆపరేటర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి బీచ్‌లను ఖరారు చేసి పర్యాటక అథారిటీకి వివరాలు పంపాలని సూచించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో67 బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు.
బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు
♦ మంగినపూడి (కృష్ణా జిల్లా)
♦ పేరుపాలెం, మొల్లపర్రు (పశ్చిమ గోదావరి జిల్లా)
♦ కాకినాడ (కాకినాడ జిల్లా)
♦ మైపాడు (నెల్లూరు జిల్లా)
♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా)
♦ చింతలమోరి (బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా)
బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే..?
బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే 33 ప్రమాణాల ఆధారంగా ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ బీచ్‌లను పరిశీలించి ధృవీకరిస్తుంది. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, నిర్వహణ, భద్రత, సేవలు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బీచ్‌లు పరిశుభ్రంగా ఉండాలి. సందర్శకులకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారుల కమిటీ, విశేషాలను వివరించేందుకు సిబ్బంది ఉండాలి.
రుషికొండ తరహాలో 8 బ్లూఫ్లాగ్ బీచ్‌లు
విశాఖలోని రుషికొండ తరహాలో మరో ఎనిమిది బ్లూ ఫ్లాగ్ బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మౌలిక వసతులను కల్పించేందుకు భూ కేటాయింపు ప్రతిపాదనలను సీసీఎల్‌ఏకు పంపాలని సీఎస్ ఆదేశించారు. దేశంలో 10 బ్లూ ఫాగ్ బీచ్‌లుండగా అందులో రుషికొండ చోటు సాధించింది.
కోస్టల్ జోన్ రెగ్యులేషన్‌కు అనుగుణంగా బీచ్‌ల అభివృద్ధి: కన్నబాబు
కేంద్రం 2019లో విడుదల చేసిన కోస్టల్ జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ ప్రకారం బీచ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైనట్లు చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి రాగానే పనులు చేపడతామన్నారు. స్థానికులకు ఉపాధితో పాటు సేవల రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment