coastline
-
'363 బీచ్‌లు' కోస్తా తీరానికి కొత్త అందాలు
సాక్షి, అమరావతి: బీచ్ పర్యాటకంతో కోస్తా తీరానికి కొత్త కళ చేకూరనుంది. 12 జిల్లాల్లో కోస్తా తీరం వెంట 363 బీచ్‌లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిషరీస్ యూనివర్సిటీ, పర్యాటక శాఖ, మత్స్యశాఖలతో కూడిన 11 బృందాలు కోస్తా తీరం వెంట సర్వే చేసి ఎక్కడెక్కడ బీచ్‌లను అభివృద్ధి చేయవచ్చో గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో కోస్టల్ జోన్ టూరిజం పేరుతో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తారు. చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా పర్యావరణానికి అనుకూలంగా బీచ్‌లను తీర్చిదిద్దనున్నారు. కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ చట్ట ప్రకారం బీచ్‌లకు అనుమతి కోసం పర్యాటక శాఖ కలెక్టర్లకు నివేదిక పంపించింది. బీచ్‌ల అభివృద్ధిపై ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు.మత్స్యకారులతో పాటు టూరిజం ఆపరేటర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి బీచ్‌లను ఖరారు చేసి పర్యాటక అథారిటీకి వివరాలు పంపాలని సూచించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో67 బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ♦ మంగినపూడి (కృష్ణా జిల్లా) ♦ పేరుపాలెం, మొల్లపర్రు (పశ్చిమ గోదావరి జిల్లా) ♦ కాకినాడ (కాకినాడ జిల్లా) ♦ మైపాడు (నెల్లూరు జిల్లా) ♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా) ♦ చింతలమోరి (బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే..? బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే 33 ప్రమాణాల ఆధారంగా ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ బీచ్‌లను పరిశీలించి ధృవీకరిస్తుంది. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, నిర్వహణ, భద్రత, సేవలు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బీచ్‌లు పరిశుభ్రంగా ఉండాలి. సందర్శకులకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారుల కమిటీ, విశేషాలను వివరించేందుకు సిబ్బంది ఉండాలి. రుషికొండ తరహాలో 8 బ్లూఫ్లాగ్ బీచ్‌లు విశాఖలోని రుషికొండ తరహాలో మరో ఎనిమిది బ్లూ ఫ్లాగ్ బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మౌలిక వసతులను కల్పించేందుకు భూ కేటాయింపు ప్రతిపాదనలను సీసీఎల్ఏకు పంపాలని సీఎస్ ఆదేశించారు. దేశంలో 10 బ్లూ ఫాగ్ బీచ్లుండగా అందులో రుషికొండ చోటు సాధించింది. కోస్టల్ జోన్ రెగ్యులేషన్‌కు అనుగుణంగా బీచ్‌ల అభివృద్ధి: కన్నబాబు కేంద్రం 2019లో విడుదల చేసిన కోస్టల్ జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ ప్రకారం బీచ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైనట్లు చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి రాగానే పనులు చేపడతామన్నారు. స్థానికులకు ఉపాధితో పాటు సేవల రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. -
Cyclone Biparjoy: అరేబియాలో అల్లకల్లోలం రేపుతున్న బిపర్జాయ్ (ఫొటోలు)
-
తీరంలో అలజడి
గార: శుక్రవారం ఉదయం 8 గంటలు... సుమారు 5వేల మంది ప్రజలు నివసించే బందరువానిపేట సముద్ర తీరం... వేకువజామున వేటకు వెళ్లే మత్స్యకారుల పడవలు తీరానికి మరి కొద్ది నిమిషాల్లో చేరుకుంటాయనగా... ఒక్కసారిగా అలలు పెరుగుతూ బందరువానిపేట వైపు దూసుకొచ్చింది. సముద్రానికి బందరువానిపేట 150 మీటర్లు దూరంలో ఉండగా సుమారు 70 మీటర్లు మేర అలలు వచ్చి ఎగసిపడ్డాయి. ఇలా రెండు గంటలపాటు అలల ఉధృతి కనిపించి, తరువాత సాధారణ స్థితికిచేరుకుంది. ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో చేపల ప్లాట్‌ఫాం వద్ద ఉన్న రక్షణ గోడ దాటి 5 మీటర్ల మేర భూమికి కోతకు గురయ్యింది. ప్లాట్ఫారం నుంచి రక్షణ గోడ వరకు ఉన్న సిమెంట్ రోడ్ కూడా విరిగిపోయింది. అంతేకాక రక్షణ గోడ కిందినుంచి సముద్రం నీరు చొచ్చుకుపోయి భూమిని కోసేసింది. అప్రమత్తమైన మత్స్యకారులు పడవులను ఒడ్డుకు చేర్చుకున్నారు. నీలం, లైలా, హుద్‌హుద్ తుపాన్ సమయాల్లో కూడా ఇంతమేర అలల ఉధృతి చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. అలలు ఇలా ముందుకు రావడం ఎప్పుడూ చూడలేదు ఇంతలా అలలు ముందుకు రావడం నేను ఇంతవరకూ చూడలేదు. అలలు రావడమే కాకుండా రక్షణ గోడను సైతం దాటి భూమి కోత జరిగింది. ఆ కొద్ది గంటల సేపు సముద్రం వైపు చూస్తే భయమేసింది. అయినా గ్రామస్తులకు ధైర్యం చెబుతూ వచ్చాను. -కోడ లక్ష్ముయ్య, మత్స్యకార నాయకుడు, బందరువానిపేట హుద్హుద్లోనూ ఇంత తీవ్రంగాలేదు హుద్‌హుద్ తుపాన్ బీభత్సం సృష్టించినా ఇంత పెద్ద అలలు ఇలా ముందుకు రాలేదు. పైగా రక్షణ గోడ దాడటంతో పాటు ఇసుక దిబ్బల వద్ద కోతకు గురవుతున్నాయి. పటిష్టమైన రక్షణ గోడను నిర్మించాలి. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి. -డి సందెయ్య, బందరువానిపేట -
సీమాంధ్ర సీఎం ముందున్న సవాళ్లు - సాగర తీరం వరమా? శాపమా?
సువిశాలమైన తీర ప్రాంతం సీమాంధ్రకు దేవుడిచ్చిన వరం. తీరం, రేవులు ఉన్న రాష్ట్రం ప్రగతి రథంపై అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందన్నది ఆర్ధికవేత్తల మాట. అయితే తీరం ఘోరం కూడా చేస్తుంది. తుఫాన్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సీమాంధ్రకు అటు అవకాశం ఉంది. ఇటు పెను ముప్పూ ఉంది. సువిశాల తీరరేఖను ఒక ప్రగతి సాధనంలా ఏలా వాడుకోవాలి? ప్రకృతి ప్రకోపాలను తగ్గించి ఎలా ముందుకు సాగాలి? సముద్ర గర్భం ఇచ్చే అపార సంపదను ఎలా ఉపయోగించుకోవాలి? గోదావరి బేసిన్, సముద్ర తీరంలోని చమురు నిక్షేపాలను ఎలా వినియోగించుకోవాలి? గుజరాత్ తీరం ఈ రోజు గుజరాత్ ఆర్ధికాభివృద్ధికి యాక్సిలరేటర్. మన కోస్తా తీరంలో ఉన్న అవకాశాలేమిటి? ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రికి మీరిచ్చే సలహా ఏమిటి? సూచనలేమిటి? మాకు తెలియచేయండి. మీ అమూల్యమైన సలహా రాష్ట్రం భవిష్యత్తునే మార్చేయవచ్చు.