ఆర్థిక చోదక శక్తుల్లో పర్యాటక రంగం ఒకటి. ప్రపంచంలో చాలా దేశాలు కేవలం టూరిజం పరిశ్రమపైనే ఆధారపడి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మన దేశం, రాష్ట్రంలో పర్యాటక రంగం కొంత పురోగతి సాధిస్తున్నా.. ప్రకృతి అందాలకు నెలవైన చాలా ప్రాంతాలు ఇప్పటికీ గుర్తింపునకు, అభివృద్ధికి నోచుకోవడం లేదు. వాటిలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. అతి పొడవైన సముద్ర తీరం, కోనసీమ లాంటి ఉద్దానం, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలు తదితర ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా.. పర్యాటకంగా వాటిని తీర్చిదిద్దే కృషి ఇప్పుడిప్పుడే మొదలైంది. టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఓవైపు సాగర తీరం.. మరోవైపు మన్యం.. మధ్యలో కొండలు తదితర ఆహ్లాదకర అందాలతో జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోతోంది. ఏటా ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రభుత్వం జిల్లా లోని టూరిస్ట్ స్పాట్‌లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కొత్త పర్యాటక ప్రదేశాలను గుర్తించడమే కాకుండా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. ఆధ్మాత్మిక ప్రదేశాలను సైతం అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఉన్న చారిత్రక ప్రదేశాలకు కొత్త హంగులద్ది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అభివృద్ధి పథంలో...
► ఇప్పటికే శాలిహుండాన్ని పర్యాటక సౌకర్యాల కేంద్రంగా రూ.2.27 కోట్లతో అభివృద్ధి చేశారు. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు.
► పాతపట్నం నీలమణి అమ్మవారి ఆలయాన్ని రూ. 50లక్షలతో అభివృద్ధి చేశారు.
► తాజాగా శ్రీముఖలింగం క్షేత్రాన్ని ప్రసాదం స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.56 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి.
► శ్రీకూర్మం క్షేత్రాన్ని రూ.20 కోట్లతో, అరసవిల్లి క్షేత్రాన్ని రూ.30కోట్లతో ప్రసాదం స్కీమ్‌లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. అరసవిల్లిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమాచారం కేంద్రం, పర్యాటకుల సౌకర్యాల కేంద్రం ఏర్పాటుకు ఏడు సెంట్లు భూమిని దేవదాయ శాఖ ఇప్పటికే కేటాయించింది. దీనిలో 32 గదులు కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నారు.
రోప్‌వే ద్వారా అందాలు..
రోప్ వేలతో జిల్లా అందాలను తిలకించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో తొమ్మిది రోప్‌వే మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. వీటిలో నాలుగింటి కోసం రూ.119.34 కోట్లతో అంచనా నివేదిక ఇప్పటికే కేంద్రానికి వెళ్లింది. రెండో విడతలో మిగతా ఐదింటికి ప్రతిపాదనలు పంపించనుంది.
► శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా నుంచి పొన్నాడ కొండ వరకు రూ. 32.40 కోట్లతో, శాలిహుండం బుద్ధు ని కొండ నుంచి వేణుగోపాలస్వామి ఆలయం వరకు రూ.25.56 కోట్లతో, పలాసలో నెమలికొండ వద్ద రూ. 22.68 కోట్లతో, ఇచ్ఛాపురంలో రూ.17.64 కోట్లతో రోప్‌వే వేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇవన్నీ మంజూరైతే జిల్లా పర్యాటకంగా మరింత ప్రగతి సాధించనుంది.
పర్యాటక ప్రదేశాలెన్నో...
► జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవ లేదు. అరసవల్లి, శ్రీకూర్మం, శాలిహుండం, శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లికార్జునస్వామి తదితర ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి.
► తేలుకుంచి, బారువ, తేలినీలాపురం, దంతపురి, పొందూరు, కొరసవాడ, మందస, గొట్టా బ్యారేజీ, శాలిహుండం, పొన్నాడ కొండ తదితర చారిత్రక ప్రదేశాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
► తేలినీలాపురం, తేలుకుంచి గ్రామాలు విదేశీ పక్షుల విడిది కేంద్రంగా ఆకట్టుకుంటున్నాయి.
► రాష్ట్రంలో అత్యంత పొడవైన తీరరేఖ జిల్లాలోనే ఉంది. 193 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో పర్యాటకులు విహరించడానికి అనువైన ప్రదేశాలెన్నో. కళింగపట్నం, బారువ, శివసాగర్, గనగళ్లవానిపేట, మొగదలపాడు వంటి బీచ్‌లు టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
వీటిలో కొన్ని ప్రదేశాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిమగ్నమైంది. శాలిహుండం, బారువ బీచ్‌ను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తోంది. శివసాగరం, గనగలవానిపేట, కళింగపట్నం బీచ్‌లను కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment