
తమ్మినేని సీతారాం, కూన రవికుమార్
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ప్రజాతీర్పు రేపు వెలువడనుంది. విజయం ఎవరిని వరిస్తుందోనని అటు రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమదాలవలసలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉండడంతో రాష్ట్రంలో అందరి చూపు ఆమదాలవలస నియోజకవర్గం పైనే ఉంది. పోలింగ్ జరిగి ఫలితాల వెల్లడికి మధ్య సుమారు 40 రోజుల విరామం ఉండడంతో అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండడంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రజాతీర్పుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉండడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ విజయం సాధిస్తుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. అని చర్చించుకుంటున్నారు.
ఆమదాలవలస నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ్మినేని సీతారాం, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూన రవికుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొడ్డేపల్లి సత్యవతి, బీజేపీ అభ్యర్థిగా పాతిన గడ్డియ్య, జనసేన అభ్యర్ధిగా పేడాడ రామ్మోహన్‌రావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తూలుగు సతీష్‌కుమార్ బరిలో నిలిచారు. అయితే వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పోలింగ్ సరలి బట్టి ఇక్కడ విజయం సాధిస్తారనేది స్పష్టత రాకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. అధిక శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకి పడ్డాయని, ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం గెలుపు తద్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేయగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, ప్రజలు మరోసారి కూన రవికుమార్‌కు పట్టం కడతారని టీడీపీ వర్గీయులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో 78.8 శాతం పోలిగ్ జరగడంతో ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, పసుపు కుంకుమ వంటివి లాభిస్తాయని టీడీపీ భావిస్తోంది. జగన్ పాదయాత్ర, నవరత్నాలు తమను గెలిపిస్తాయని వైఎస్సార్‌సీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ప్రజలు నాడి పట్టుకోవడం కష్టతరంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ – టీడీపీకి పోలైన ఓట్లు వివరాలు
మండలం | వైఎస్సార్‌సీపీ | టీడీపీ | మెజార్టీ |
ఆమదాలవలస రూరల్ | 12048 | 13095 | 1047 |
ఆమదాలవలస పట్టణం | 7541 | 8947 | 1403 |
బూర్జ | 10825 | 11059 | 234 |
సరుబుజ్జలి | 9616 | 8912 | 704 |
పొందూరు | 19168 | 22,686 | 3518 |
2019 ఎన్నికల పోలింగ్ వివరాలు
ఆమదాలవలస నియోజకవర్గం
కోడ్‌నెంబర్–06, మండలాలు 4
ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జలి, బూర్జ
మొత్తం పోలింగ్ కేంద్రాలు: 259,
ఆమదాలవలస–82, పొందూరు–77, సరుబుజ్జలి–45, బూర్జ–55
ఓటర్లు వివరాలు:
పురుషులు | 94,224 |
స్త్రీలు | 93,403 |
ఇతరులు | 46 |
మొత్తం | 1,87,673 |