
ఎమ్మిగనూరు పట్టణం
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) కింద క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తున్నా అక్రమార్కులు నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆంతర్యమేంటనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ యేడాది ఆగస్టు5 బీపీఎస్ గడువు ముగిసినా మళ్లీ 31వరకు గడువును ప్రభుత్వం పొడిగించింది. అయితే కేవలం 18 కట్టడాలే క్రమబద్ధీకరించబడ్డాయి. లక్షకుపైగా జనాభా..గ్రేడ్ 1 మున్సిపాలిటి ఎమ్మిగనూరు పట్టణంలో అక్రమ లే అవుట్లు..అక్రమ కట్టడాలకూ కొదవలేదు.
పట్టణంలో దాదాపు 26,500 భవనాలు ఉన్నాయి. దాదాపు 750కిపైగానే అక్రమ నిర్మాణాలు ఉంటాయన్నది అనధికారిక అంచనా. మున్సిపల్ సాధారణ నిబంధనలు అటుంచుతే కనీసం అనమతి కూడా లేకుండా నిర్మించిన భవనాలు లేకపోలేదు. అక్రమకట్టడాల క్రమబద్ధీకరణకు 86మంది దరఖాస్తు చేసుకోగా 18 మాత్రమే క్రమబద్ధీకరించగా మున్సిపాలిటీకి రూ.16లక్షల ఆదాయం సమకూరింది. మొత్తం అక్రమకట్టడాలు క్రమబద్ధీకరిస్తే రూ. కోట్లలో ఆదాయం వచ్చేదని అధికారులు చర్చించుకుంటున్నారు.
చర్యలకు వెనుకడుగు..
ప్రభుత్వం బీపీఎస్‌కు అవకాశం కల్పించినా అక్రమకట్టడాలు చేపట్టిన యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికారులు చర్యలు చేపట్టలేరనే ధైర్యమా... అనాధికారికంగా జరిగిన ఒప్పందాలేమైనా ఉన్నాయా అనే విమర్శలూ లేకపోలేదు. మున్సిపల అధికారులు అనుకుంటే క్రమబద్ధీకరించుకోని నిర్మాణాలను కూల్చివేసే అధికారం ఉంది. ఆస్తిపన్నుపై 25శాతం పెంచి జీవితకాలం వసూలు చేయొచ్చు. శాశ్వతంగా కుళాయి కనెక్షన్లు తొలగించవచ్చు. మున్సిపల్ అధికారులు ఏమిచేయలేరులే అన్న భావన అక్రమకట్టడదారుల్లో ఉండటం, లైసెన్సున్డు సర్వేయర్ల ఆధిపత్యం సాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
16లక్షల ఆదాయం
బీపీఎస్ కింద ఆగస్టు 5నుంచి 31వరకు 18 కట్టడాలు క్రమబద్ధీకరించబడ్డాయి.రూ.16లక్షల ఆదాయం వచ్చింది. బీపీఎస్ గడువు ముగిసినందునæ అక్రమకట్టడాలకు నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటాం.
– హయాత్,టీపీఓ