
రూ.268 కోట్లతో హెచ్‌ఎండీఏ మౌలిక వసతుల అభివృద్ధి
రూ.65 కోట్లతో తుదిదశలో ట్రంపెట్ రోడ్డు పనులు
ఔటర్‌కు అనుసంధానంగా రహదారుల విస్తరణ
భవిష్యత్‌లో భారీగా పెరగనున్న వాహనాల రద్దీ
సాక్షి, హైదరాబాద్: కోకాపేట కొత్త కళను సంతరించుకుంది. ఆకాశ హర్మ్యాలతో ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ హంగులను అద్దుకున్న కోకాపేటలో హెచ్‌ఎండీఏ (HMDA) భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను విస్తరించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నియోపోలిస్ లే అవుట్ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. రహదారులు, నీటి సదుపాయం, పార్కులు, విద్యుత్ తదితర సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. నియోపోలిస్ (neopolis) నుంచి నగరంలోని అన్ని వైపులకు రాకపోకలు సాగించేలా రహదారుల విస్తరణ చేపట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డుతో అనుసంధానం చేసే ట్రంక్‌రోడ్డు పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం టోల్‌ప్లాజా (Toll Plaza) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో 20 రోజుల్లో పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలను ప్రారంభించనున్నట్లు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు తెలిపారు.
నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం..
వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, ఐటీ కంపెనీలు, నివాస సముదాయాలతో విస్తరించిన కోకాపేటకు మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెండో దశలో డీపీఆర్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. మహా నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట గుర్తింపు పొందింది. నియోపోలిస్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో ఎకరా భూమి సుమారు రూ.100 కోట్లు పలికింది. బడా బిల్డర్‌లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యాపార వర్గాలు పోటీ పడి మరీ ప్లాట్‌లను కొనుగోలు చేశాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలకు అవకాశం ఉండడంతో అనూహ్యమైన పోటీ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో రెండు దశల్లో వేసిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో సుమారు రూ.5000 కోట్లకు పైగా ఆదాయం లభించింది. మొదటి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ లేఅవుట్‌లో రూ.268 కోట్లతో హెచ్‌ఎండీఏ మౌలిక సదుపాయాలను అభివృద్ధిపర్చింది.
రెండో దశలో భారీ స్పందన..
కోకాపేట (Kokapet) నియోపోలిస్‌లో రెండు దశల్లో 14 ప్లాట్‌లలో ఉన్న భూములను విక్రయించారు. 2021 జూన్‌లో నిర్వహించిన మొదటి దశ బిడ్డింగ్‌లో 8 ప్లాట్‌లకు బిడ్డింగ్ నిర్వహించగా.. గరిష్టంగా ఎకరానికి రూ.42.4 కోట్ల చొప్పున అమ్ముడైంది. సగటున రూ.35 కోట్ల చొప్పున విక్రయించారు. మొత్తం 48.27 ఎకరాలపై రూ.1901.04 కోట్లు వచ్చాయి. 2023లో నిర్వహించిన రెండో దశ బిడ్డింగ్‌లో 7 ప్లాట్‌లలో 46.33 ఎకరాలను విక్రయించారు. ఎకరానికి గరిష్టంగా రూ.100.75 కోట్ల ఆదాయం లభించింది. సగటున రూ.73 కోట్ల చొప్పున విక్రయించారు. రెండో దశలో మొత్తం రూ.3319.60 కోట్ల ఆదాయం లభించింది. మొదటి నుంచి ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేశారు.
ఔటర్‌తో అనుసంధానం..
కోకాపేట నుంచి వివిధ మార్గాల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా కోకాపేట లే అవుట్ ప్రవేశ రహదారిని ఔటర్‌తో అనుసంధానం చేసేలా రహదారులను విస్తరించారు. ఈ లే అవుట్‌లో పెద్ద ఎత్తున హైరైజ్ భవనాలను నిర్మిస్తున్న దృష్ట్యా వాహనాల రాకపోకలు సైతం భారీగా ఉంటాయని అంచనా. ఈ మేరకు భవిష్యత్ అంచనాలకు అనుగుణంగా రహదారుల విస్తరణకు హెచ్‌ఎండీఏ అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. నార్సింగి వద్ద సుమారు రూ.15 కోట్లకు పైగా వెచ్చించి ఇంటర్‌చేంజ్‌ను ఏర్పాటు చేశారు. మరో రూ.65 కోట్లతో ట్రంపెట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. కోకాపేట నుంచి ట్రంపెట్‌కు రాకపోకలు సాగించే మార్గంలో ప్రస్తుతం టోల్‌గేట్ నిర్మిస్తున్నారు.
చదవండి: ఓఆర్‌ఆర్ చుట్టూ హౌసింగ్ కాలనీలు
ట్రంపెట్ రోడ్డును వినియోగించుకొనేందుకు వాహనదారులు ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ఇటు పటాన్‌చెరు వైపు అటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు రాకపోకలు సాగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment