మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : మంచిర్యాలలో అనుమతి లేకుండా ప్లాట్లు వెలుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అక్రమణలపై అధికారులు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోవడంలేదు. మంచిర్యాల మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, హాజీపూర్ గ్రామాలకు చెందిన వందల ఎకరాల పంట పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి.
మంచిర్యాల పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారికి ఆనుకుని 12కి పైగా అక్రమ లేఔట్లు వెలిశాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు రెవెన్యూ డిపార్టుమెంటుకు చెల్లించాల్సిన వన్‌టైం నాలా పన్ను చెల్లిస్తూ, లేఔట్ అనుమతులను పొందకుండా, గ్రామపంచాయతీకి కట్టాల్సిన పన్ను కట్టకుండానే ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి రియల్టర్లు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
మంచిర్యాల మండలంలో 12 వరకు అక్రమంగా లేఔట్లు చేసిన 75 ఎకరాలను ప్లాట్లుగా చేసి అమ్ముతున్నట్లు పంచాయతీ అధికారులు గుర్తించారు. మరో 50 ఎకరాల్లో చేసిన ప్లాట్ల యజమానుల వివరాలు తెలియకపోవడంతో వారికి ఇప్పటివరకు నోటీసులు అందలేదు. వేంపల్లిలో 57 ఎకరాలు, ముల్కల్లలో 7 ఎకరాలు, గుడిపేటలో 10 ఎకరాలు, హాజీపూర్‌లో ఒక ఎకరం భూమిలో ప్లాట్లు చేసిన వారికి అధికారులు నోటీసులు అందించారు.
మంచిర్యాలకు సమీపంలో, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్లాటు గుంటకు రూ. 10 లక్షలు ఉండగా, రోడ్డు నుంచి కొంత లోపల ఉన్న భూమి గుంటకు రూ. 4 లక్షల వరకు ధర పలుకుతుంది. 75 ఎకరాల్లో గ్రామపంచాయతీ అనుమతి తీసుకుంటే, పదిశాతం భూమిని అంటే 7.5 ఎకరాల భూమి గ్రామపంచాయతీకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే గుంట భూమికి సరాసరి రూ. 4 లక్షలు వేసుకున్నా, పంచాయతీలకు కేటాయించే 7.5 ఎకరాల భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.12 కోట్లు ఉంటుంది. అనుమతికి ఎకరాకు లేఔట్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ పేర రూ.12వేల చొప్పున చెల్లిస్తే, రూ.9 లక్షలు గ్రామపంచాయతీకి కట్టాల్సి వస్తుంది.
అనుమతులు తీసుకోవాలని పంచాయతీ అధికారులు నోటీసులు పంపుతూ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్న, గడువులు పెడుతూ, ఆ గడువు తీరే లోగా ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీకి కేటాయించాల్సిన 10 శాతం భూమిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములను ఎకరాకు రూ. 10 నుండి 15 లక్షల ధరతో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ, ప్లాట్లుగా చేసి రూ.1.80కోట్లకు అమ్ముకుంటున్నారు. ఈ లెక్కన చూసిన ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనూ ఆదాయానికి గండి పడుతుంది.
రిజిస్ట్రేషన్లు, జీపీకి పదిశాతం భూమి, లేఔట్ అనుమతి ఫీజులను కలుపుకుంటే రూ.20 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లే. ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నా స్థానికంగా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో, జిల్లా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించి అక్రమ లే అవుట్లపై కొరడా ఝుళిపించాల్సిన ఉంది.
కబ్జాకు గురవుతున్న వాగులు..
రియల్టర్లు ఊరు పుట్టకముందు నుంచి వాగులను కబ్జా చేస్తున్నారు. వేంపల్లి గ్రామంలో వందల ఏళ్ల నుంచి ఉ న్న కండివాగుకు ఇరుపక్కల సర్వే నంబరు 20, 21లోని భూములను రియల్టర్లు ప్లాట్లు చేశారు. ప్లాట్ల సంఖ్య పెరిగేందుకు, వాగుకు ఇరుపక్కల మట్టి వేసి పూడ్చేశా రు. దీంతో 50 ఫీట్లకు పైగా ఉండాల్సిన వాగు వెడల్పు పది ఫీట్లకు పరిమితం చేశారు. ముల్కల్ల శివారులో సర్వే నంబరు 82లో రియల్టర్లు ప్లాట్లు చేశారు. పక్కనే పారుతున్న ర్యాలీవాగును కబ్జా చేశారు. అధికారులు నోటీసులు జారీ చేసినా ఎవరూ స్పందించకపోవడం లేదు.
రియల్ దందా
Published Mon, Feb 17 2014 2:25 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM