‘వేరు’కు కావలసింది నీరు
ప్రస్తుతం చర్చంతా రాజధాని స్థల నిర్ణయం పేరిట పక్కదోవ పడుతోంది. అభివృద్ధికి కీలకం నీరు, పరిశ్రమలు, విద్యుత్తు లాంటి మౌలిక సదుపాయాలు అన్న వాస్తవం మరుగున పడుతోంది. కొత్త రాజధాని అంటేనే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గిలిగింతలు మొదలవుతాయి. రాజధాని అంటే పాలనా, రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా భావించాలి.
రాష్ట్రపతి ఆమోదముద్రతో ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ పతాక స్థాయికి చేరుకుంది. సోనియా, కిరణ్, చంద్రబాబుల ఉమ్మడి ద్రోహం ఫలితమే ఈ అడ్డగోలు విభజన. కవులూ, గాయకులూ, అభ్యుదయవాదులు, మరెందరో దార్శనికులు వందేళ్లు తపించి, శ్రమించి సాధించుకున్న విశాలాంధ్రను వీరంతా విచ్ఛిన్నం చేశారు. జూలై 30, 2013 సీడబ్ల్యూసీ చేసిన విభజన నిర్ణయం మొదలు, ఫిబ్రవరి 20, 2014న విభజన బిల్లు ఆమోదించే వరకు ఈ ఆరు నెలల పొడవునా చోటు చేసుకున్న సంఘటనలు దేశ చరిత్రలోనే లజ్జాకరమైనవి. ఏమనుకున్నా ఆ అధ్యాయం ముగిసింది. ఆ విషాదకర పరిణామానికి కుమిలిపోతూ ఎంత కాలమని చింతించగలం! ఇక కర్తవ్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగడమే విజ్ఞత .
జలాల వినియోగమే కీలకం
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గోదావరి, కృష్ణ నీళ్ల సద్వినియోగానికి రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం రెండు బోర్డులు ఉంటాయి. వీటిలో రెండు రాష్ట్రాల నిపుణులతో పాటు కేంద్ర ప్రతినిధి అధ్యక్షులుగా ఉంటారు. గోదావరి బోర్డు తెలంగాణలోనూ, కృష్ణ బోర్డు సీమాంధ్రలోనూ పని చేస్తాయి. నీరంటే ప్రవహించే బంగారమని భావించి, అది సముద్రం పాలు కాకుండా, పొలాలలోకి మళ్లించాలని ఆర్ధర్ కాటన్ ఉద్బోధించారు. ఈ బోర్డులలోని సభ్యులంతా మానవీయ కోణంతో పని చేస్తే దానిని సాధ్యం చేయవచ్చు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉంది. ఏటా సుమారు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. పోలవరం, ప్రాణహిత, చేవెళ్ల వంటి చిన్నా పెద్ద పథకాలు పూర్తి చేసినా ఇంకా 2000 టీఎంసీల నీరు సముద్రం దిశగా మళ్లక తప్పదు. నిపుణులు ఈ నీటిని పొలాలలోకి మళ్లించే మార్గాలను అన్వేషించాలి.
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికుడు. కాబట్టే గోదావరి, కృష్ణ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడి ఊహలకే పరిమితమవుతున్న పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను చేపట్టి, పనులను వేగవంతం చేయాలి. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు గుర్తింపు తేవడానికి కృషి చేస్తూనే వైఎస్ కన్నుమూశారు. పునర్ విభజన చట్టంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, దీనిని పూర్తి చేసే బాధ్యత కూడా తమదేనని ఇప్పుడు కేంద్రం ప్రకటించింది. వైఎస్ హయాంలోనూ ఆ తర్వాత పోలవరం కాల్వల పనులకు, నిర్వాసితుల పునరావాసానికి సుమారు రూ. 3500 కోట్లు ఖర్చు చేశారు. ఆ మొత్తాన్ని కేంద్రం వాపసు చేయాలి. కాలపరిమితిని నిర్ణయించి పోలవరం, దుమ్ముగూడెం, టెయిల్‌పాండ్ పనులను ఐదేళ్లలో పూర్తయ్యేటట్టు కేంద్రమే బాధ్యత తీసుకోవాలి. ఇది గోదావరి బోర్డు ముందున్న తక్షణ కర్తవ్యం.
హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు- ఈ ఏడు ప్రాజెక్టులకు నికర జలాలు అందించాలి. ఇవి చారి త్రక శిథిలాల వలె మిగిలిపోరాదు. ఇవి కృష్ణ మిగులు జలాలతో నిర్మాణమవుతున్నాయి. నికర జలాల ప్రాజెక్టులకే దిక్కు లేకుండా ఉంటే, మిగులు జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టులు అనాథలు కాక తప్పదు. వాటిలో మొదటి నాలుగు సీమాంధ్రలోవి. మిగిలినవి తెలంగాణకు సంబంధించినవి. అన్నీ దుర్భిక్ష ప్రాంతాలలో నిర్మిస్తున్నవే. పనులు పూర్తి కావచ్చాయి కూడా. వీటికి సుమారు 280 టీఎంసీల నీరు కావాలి. ఇవి 30 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కల్పిస్తాయి.
పోలవరం, టెయిల్పాండ్ల ద్వారా నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్‌ల కింద ఎడమ వైపు ఆయకట్టుకు గోదావరి నీరు అందిస్తే శ్రీశైలం దగ్గర పై ఏడు ప్రాజెక్టులకు కృష్ణ నికర జలాలు అందించవచ్చు. ఈ ఉద్దేశంతోనే వైఎస్ వాటి నిర్మాణాన్ని ప్రారంభించారు. గోదావరి మీద పోలవరం, దుమ్ముగూడెం ప్రాజెక్టుల పనులు చేపట్టడంతో పాటు, పులిచింతల నిర్మాణం కూడా చేపట్టారు. వీటి మీద ఆధారపడిన ఆ ఏడు ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టి సుమారు రూ. 30,000 కోట్లు ఖర్చు చేశారు. కరువు ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న ఆ ఏడు ప్రాజెక్టులకు కృష్ణ నికర జలాలు అందించడానికి గోదావరి, కృష్ణ బోర్డులు శ్రద్ధ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వ జలవిధానంలో ఇది కీలకాంశం కావాలి.
మరో పరిష్కారం-సామర్థ్యం పెంచడం
కృష్ణ నీటిని పొదుపు చేసి దుర్భిక్ష ప్రాంతాలకు అందించడానికి మరో సులభ మార్గం ఉంది. వాటర్ మేనేజ్మెంట్ ద్వారా దీనిని సాధించవచ్చు. బచావత్ కమిటీ 811 టీఎంసీల కృష్ణ నికర జలాలను ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది. నీరు ఆవిరి రూపంలో పోతే అరికట్టలేము. కానీ, ఎక్కువ భాగం ప్రధాన కాల్వలు, పంట కాల్వలు ఆధునీకరించనందున ఇంకి పోతోంది. రిజర్వాయర్లలోని నీటిలో సగం కంటె తక్కువగానే పొలాల్లోకి పోతోంది. మన రిజర్వాయర్ల వినియోగ సామర్థ్యం 30-40 శాతం. దీనికి 60-70 శాతానికి పెంచితే నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ కింద సుమారు 100-150 టీఎంసీలను పొదుపు చేయవచ్చు. మీటర్లు అమరిస్తే మరింతగా పొదుపు చేయవచ్చు. అనువైన చోట పైపులగుండా నీరు తీసుకుపోతే వినియోగ సామర్థ్యం మరింత పెరుగుతుంది. అయితే ఇది ఖర్చుతో కూడినది. నీటిని బంగారంగా భావించినప్పుడు ఖర్చుకు వెరవరాదు.
మరొక మార్గం కూడా ఉంది. రైతాంగంలో అనాదిగా కొన్ని తప్పుడు అభిప్రాయాలు పాతుకుపోయి ఉన్నాయి. వరి పొలాల్లో గట్లు నిండిపోయినంతవరకు, ఐదారు అంగుళాల లోతు నీరు పెట్టుకుంటున్నారు. దీనినే ఫ్లడ్డింగ్ పద్ధతి అంటారు. దీని వల్ల వరి మళ్లల్లో గడ్డి పడదని, కలుపు ఖర్చులు తగ్గుతాయని రైతుల ఆలోచన. ఈలోగా ఒక సంవత్సరం నీటి ఎద్దడి వచ్చి కృష్ణా డెల్టాకు మామూలుగా వాడుకునే 180 టీఎంసీలకు బదులు 100 టీఎంసీలే వాడి సరిపెట్టుకున్నారు. అయితే వరి దిగుబడి ఆ ఏడే పెరిగింది. అనవసరంగా ఎక్కువ నీరు పెట్టుకుంటున్నట్టు అర్థమవుతోంది. శ్రీవరి పద్ధతిలో వరి సాగు చేస్తే దిగుబడి పెరిగినట్టు రుజువయింది. గోదావరి నీటిని కృష్ణలోకి, కృష్ణ ఆయకట్టులోకి మళ్లింపు ద్వారాను, వాటర్ మేనేజ్మెంట్ పద్ధతి ద్వారానూ కృష్ణ నికర జలాలను సుమారు 250-300 టీఎంసీలు పొదుపు చేసి దుర్భిక్ష ప్రాంతాలకు సులభంగా అందించవచ్చు. ఇందుకు కావలసినదల్లా అన్వేషణా దృష్టి. పోలవరం, దుమ్ముగూడెం, టెయిల్‌పాండ్ పథకాలకు కాలబద్ధత లేదు. ఇవి పూర్తిగాక పోతే దుర్భిక్ష ప్రాంతాలకు అగచాట్లు తప్పవు.
రాజధానిపై తగాదా వద్దు
విభజన హామీల్లో ఎక్కువ భాగం బిల్లులో చోటు చేసుకోనందున వాటికి చట్టబద్ధత లేదు. అభివృద్ధికి కేంద్ర బిందువుగా భావిస్తూ ప్రస్తుతం చర్చంతా రాజధాని స్థల నిర్ణయం పేరిట పక్కదోవ పడుతోంది. అభివృద్ధికి కీలకం నీరు, పరిశ్రమలు, విద్యుత్తు లాంటి మౌలిక సదుపాయాలు అన్న వాస్తవం మరుగున పడుతోంది. కొత్త రాజధాని అంటేనే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గిలిగింతలు మొదలవుతాయి. రాజధాని అంటే పాలనా, రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా భావించాలి. సర్వం అక్కడనే నెలకొల్పి మంచినీరు, ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలు సృష్టించుకోరాదు. పరిశ్రమలు, వైద్య, విద్య సంస్థలు వికేంద్రీకరణ జరగాలి.
సీమాంధ్ర సోదరులు రాజధాని గురించి తగాదా పడరాదు. అనంతపురం జిల్లా ఎడారి కాకుండా ఉండాలంటే రెండు, మూడు భారీ పరిశ్రమలు స్థాపించాలి. 50 వేల మందికి ఉపాధి కల్పించాలి. కడప జిల్లాలో బ్రహ్మణి స్థలంలో కొత్త పేరుతో అంతే సామర్థ్యంతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి. ప్రత్యేక హోదాకూ నిర్దిష్టత లేదు. రెవెన్యూ లోటుకు కనీసం ఐదేళ్లయినా కేంద్రం ఆదుకోవాలి. ఒక ఏడాదిలోనే కొత్త రాజధానిలో కనీస అవసరాలకు తగినట్లు నిర్మాణాలు పూర్తయి కొత్త ప్రభుత్వం తమ ప్రాంతం నుంచే పని చేయాలి. సీమాంధ్రను నవ్యాంధ్రగా మార్చడానికి కొత్త ప్రభుత్వం అందరి సహకారంతో ముందుకు సాగాలి!
(వ్యాసకర్త మాజీ శాసనసభ్యుడు)
ఎన్. శివరామిరెడ్డి