రియల్ టక్కర్లు
రియల్ టక్కర్లు
Published Sun, Dec 22 2013 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో అడ్డు అదుపూ లేకుండా వెలస్తున్న అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారి పాట్లు అన్నీఇన్నీ కావు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రచారార్భాటానికి భ్రమించి, సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్లాట్ కొని, ఇల్లు కట్టేందుకు మున్సిపాలిటీకి వెళ్లినప్పుడు కానీ అసలు బండారం బయటపడదు. అది అక్రమ లే అవుట్ అని, ఎలాంటి అనుమతులూ లేవని తెలిసి హతాశులు కావలసి వస్తుంది. మున్సిపాలిటీ అనుమతి ఇవ్వకపోయినా స్థలం కొన్నాం కదా అని ధైర్యం చేసి ఇల్లు కట్టినా ఆ లే అవుట్‌లో మున్సిపాలిటీ ఎలాంటి సౌకర్యాలు (అంటే తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, వీధిదీపాల వంటివి) సమకూర్చదు. అక్కడ నుంచి ఆ ప్లాటుదారుని కష్టాలు రెట్టింపవుతాయి. పట్టణంలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 30 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నాయని గుర్తించిన క్రమంలో అలాంటి చోట్ల ప్లాట్లు కొనుగోలు చేసిన, ఇళ్లు కట్టిన వారి పరిస్థితి.. ‘కొరివితో తల గోక్కున్న’ మాదిరిగా ఉంది. పట్టణంలో దాదాపు 200 మంది వరకు ఇలాంటి చిక్కుసమస్యను ఎదుర్కొంటున్నారు. ప్లాట్లు అమ్మిన రియల్టర్ల దగ్గరకు వెళితే సమాధానం చెప్పరు. పోనీ అక్కడ ఇల్లు కడదామంటే మున్సిపాలిటీ సహకరించదు.
అనుమతి లేనివే అధికం..
కాగా అమలాపురంలోని అక్రమ లే అవుట్ల దందాపై ప్రత్యేక దృష్టి సారించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇప్పటి వరకు పట్టణంలో 30 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు వెలశాయని, వాటి నిమిత్తం భూమి బదలాయింపు రుసుం (కన్వర్షన్ ఫీజు)గా చెల్లించాల్సిన రూ.10 కోట్లను చెల్లించకుండా రియల్టర్లు ప్రభుత్వాదాయానికి గండి కొట్టారని తే ల్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విజిలెన్స్ సీఐ గౌస్‌బేగ్, ఏఓ శ్రీనివాస్‌లతో కూడిన బృందం రంగంలోకి దిగి అక్రమ లే అవుట్ల విస్తీర్ణం, ఎగవేసిన బదలాయింపు రుసుం, మున్సిపల్ అధికారుల అలక్ష్యం తదితర కోణాల్లో మూడు పర్యాయాలు క్షుణ్నంగా తనిఖీలు చేసింది. అమలాపురంలో ఇటీవల దాదాపు 45 ఎకరాల్లో లే అవుట్లు వెలశాయి. వాటిలో 15 ఎకరాల వరకు అన్ని అనుమతులూ ఉన్నాయి. మిగిలిన భూముల్లో అక్రమ లే అవుట్లు వెలసినా, ప్రజల నుంచి ఫిర్యాదు వస్తున్నా మున్సిపల్ అధికారులు ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి పరోక్షంగా అక్రమ లే అవుట్‌లు వేసిన రియల్టర్లకు సహకరిస్తున్నారు.
అటు మున్సిపాలిటీ నుంచి గానీ, ఇటు రెవెన్యూ అధికారుల నుంచి గానీ ఎలాంటి అనుమతులు లేకుండా 30 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన లే అవుట్ల స్థలం విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ.100 కోట్లు ఉంటుందని విజిలెన్స్ అధికారుల అంచనా. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు బదలాయిసున్నప్పుడు ఆ భూముల విలువలో పదోవంతు మొత్తాన్ని రెవెన్యూశాఖకు కన్వర్షన్‌ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.10 కోట్లు కన్వర్షన్ ఫీజును అక్రమ లే అవుట్‌దారులు ఎగవేసినట్టు గుర్తించారు.
మున్సిపల్ అధికారులపై చర్యలకు సిఫారసు
విజిలెన్స్ అధికారులు ఈ వారంలో మూడు పర్యాయాలు అమలాపురం వచ్చి అక్రమ లే అవుట్ల రికార్డులను పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. అక్రమ లే అవుట్ల వద్దకు స్వయంగా వెళ్లి, ఎలాంటి అనుమతులు లేకపోయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన మాయమాటలకు మోసపోయి ప్లాట్లు కొన్నవారితో మాట్లాడి వారు చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు. అక్రమ లే అవుట్లలో ఇళ్లు నిర్మించుకుని ఇబ్బంది పడుతున్న వారి నుంచి కూడా స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. అలాగే 30 ఎకరాల వ్యవసాయ భూములను లే అవుట్లకు బదలాయించినా కన్వర్షన్ ఫీజు చెల్లించని వైనంపై అమలాపురం రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. కాగాఅక్రమ లే అవుట్లకు అనుమతిని ఇవ్వడానికి మున్సిపల్ అధికారులను బాధ్యులను చేస్తూ, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించినట్టు తెలుస్తోంది. లే అవుట్‌దారులు ఎగవేసిన రూ.10 కోట్ల బదలాయింపు రుసుంను జరిమానాతో వసూలు చేయాలని కూడా నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఏది ఏమైనా సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి కష్టార్జితాన్ని వెచ్చించి స్థలాలు కొన్నవారు ఆ సొమ్ము ‘నేల పాలైన తైలం’ కారాదని, అలాంటి స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వారు అవి ఇక్కట్లకు కేరాఫ్ అడ్రస్‌లు కారాదని కోరుకుంటున్నారు.
Advertisement
Advertisement