చిగురంత సాయానికి.. ‘పండుటాకుల’ ప్రయాస
Published Sat, Dec 28 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :వంకాయ, బెండకాయ వంటి కూరగాయలను కిలోల లెక్కన కాక ‘కాయల’ లెక్కన, అపరాలను గింజల లెక్కన కొనాల్సిన రోజులు దాపురించినా, ఆటోలో ఫర్లాంగు దూరం ప్రయాణిస్తే పది రూపాయలు ఇచ్చుకోవలసి వస్తున్నా.. పడమటి పొద్దుకు వాలిన పండుటాకులకు ఇచ్చే పింఛన్ మొత్తం ఒక్కరూపాయి కూడా పెరగలేదు. పోనీ, నెలనెలా ఇచ్చే ఆ రూ.200లైనా సత్తువ ఉడిగిన ఆ వృద్ధులకు వ్యయ ప్రయాసలు లేకుండా చేతుల్లో పెడుతున్నారా అంటే అదీ లేదు. జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో పింఛన్ బట్వాడాలో కొత్త విధానం వల్ల లబ్ధిదారులు నెలనెలా రెండు నుంచి నాలుగు మైళ్ల దూరం వెళ్లి తీసుకోవాల్సి వస్తోం ది. జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో పింఛన్ల బట్వాడాను ఇటీవల ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. గతంలో ఆ యా నగరాలు,పట్టణాల్లో డివిజన్ లేదా వార్డులోని పిం ఛన్లదారులకు ఆయా ప్రాంతాల్లోనే బట్వాడా చేసేవారు. తమ వార్డు లేదా డివిజన్‌లో పింఛన్లు అందివ్వటం వారికి ఎంతో సౌకర్యంగా ఉండేది. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాక ఇప్పుడు పట్టణానికి నాలుగు చోట్లే కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ (సీఎస్‌పీ)ల ద్వారా పింఛను ఇస్తున్నారు. నగరం లేదా పట్టణంలో ఎన్ని డివిజన్లు, వార్డులు ఉన్నా నాలుగైదు చోట్ల మాత్రమే బట్వాడా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 62,778 మంది పింఛన్‌దారులు ఉండగా వారిలో 40 వేలమందికి పైగా వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న అశక్తులే. ప్రభుత్వం ఎంతసేపూ వృద్ధులకు సాయం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప ఆ సాయం అందుకోవటంలో వారు ఎన్ని అష్టకష్టాలు పడుతున్నారో పట్టించుకోవటం లేదు.
ఆయాసంతో.. అడుగులు తడబడుతూ..
వృద్ధాప్య పింఛన్లు పొందుతున్న వారిలో 65 నుంచి 95 ఏళ్ల వయసు వారు ఉన్నారు. ఓపిక క్షీణించిన ఆ వయసులో వారు పింఛన్లు అందుకోవడానికి ప్రయాస పడక తప్పడం లేదు. అలాగని ఆటోలను ఆశ్రయిస్తే.. చేతికొచ్చే మొత్తంలో నాలుగోవంతు పైగా కిరాయికే పోతోంది.
పోనీ తమ బిడ్డలను, మనుమలనో పంపి, పింఛన్లు పొందుదామంటే బయో మెట్రిక్ మిషన్‌పై లబ్ధిదారుడు వేలిముద్ర వేస్తేనే పింఛను ఇస్తారు. దీంతో ఆయాసమైనా, అడుగులు తడబడుతూ దేహం సహకరించకపోయినా గత్యంతరం లేక బట్వాడా చేసే చోటకు వెళ్లాల్సి వస్తోంది. నడవలేక ఆటో కట్టించుకుంటే.. తీసుకునే రూ.200లలో గణనీయమైన మొత్తం ఆటోచార్జీలకే వెచ్చించాల్సి వస్తోంది. అమలాపురం రెండో వార్డులో నల్లా వీధికి చెందిన అడపా వెంకట నర్సమ్మ అనే 85 ఏళ్ల వృద్ధురాలికి గతంలో పింఛను ఆమె ఇంటి సమీపంలోనే ఇచ్చేవారు. ఇప్పుడు ఆమె తమ వీధికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని బుచ్చెమ్మ అగ్రహారంలో ఉన్న సీఎస్‌పీ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతినెలా తన మనవరాలిని సాయంగా తీసుకుని రూ.60కి రానుపోను ఆటో కుదుర్చుకుని పింఛను తెచ్చుకుంటోంది. ఇలా ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి వార్డులో 50 నుంచి 70 మంది వృద్ధులు ఇలాంటి అసౌకర్యాన్నే ఎదుర్కొంటున్నారు.
‘సాక్షి’ జనసభలో మొర
జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో ‘సాక్షి’ పత్రిక నిర్వహిస్తున్న జనసభల్లో వృద్ధులు ఈ కష్టంపై గురించి మొర పెట్టుకుంటున్నారు. తమకు దూరాభారాన్ని విరగడ చేయమని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పండుటాకులు చిరుసాయం పొందడానికి పడుతున్న ప్రయాసను చూడాలి. గతంలోలా వారి నివాస ప్రాంతాలకు చేరువలోనే పింఛన్లు పంపిణీ చేయాలి.
Advertisement
Advertisement