![EPFO: All documents submitted regarding higher pension in Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/EPFO-1.jpg.webp?itok=cbfpcalz)
దరఖాస్తుల పరిశీలనలో కొర్రీలు పెడుతున్న ఈపీఎఫ్‌ఓ
ప్రతి సమాచారానికి ధ్రువపత్రాలు తప్పనిసరి అంటున్న అధికారులు
దరఖాస్తులను వెనక్కి పంపేస్తున్న తీరు
అందులో అత్యధికం ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులవే..
రాష్ట్ర సంక్షేమ శాఖకు చెందిన ఓ కార్పొరేషన్‌లో సీనియర్ అధికారి అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్‌ఓకు దరఖాస్తు చేసుకున్నారు. సర్వి సులో చేరింది మొదలు ఇప్పటివరకు అదే శాఖలో ఉన్న ఆ అధికారి.. అధిక పెన్షన్‌కు సంబంధించి అన్నిపత్రాలను సమర్పించారు.ఈపీఎఫ్‌ఓ లేవనెత్తు తున్న ప్రతి సందేహానికి సమాధానమిస్తూనే ఉన్నా.. ఏదో ఒక అదనపు సమాచారం కావాలంటూ దరఖాస్తును తిప్పిపంపుతున్నారని ఆయన వాపోతున్నారు. ఇప్పటికే 4,5 సార్లు వెనక్కి పంపగా.. ఓపికగా బదులిచ్చానని, మళ్లీ మరింత సమాచారం కావాలని, అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇచ్చినప్పటి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కోరారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)లో అధిక పెన్షన్ (హయ్యర్ పెన్షన్) కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ‘అదనపు’టెన్షన్ పట్టుకుంది. ఈపీఎఫ్‌ఓ అధికారులు అడిగిన వివరాలన్నీ సమర్పిస్తూనే ఉన్నా.. ఏదో ఓ కొత్త సమాచారాన్ని అడుగుతూ, దానిని ధ్రువీకరించే పత్రాలు కావాలంటూ దరఖాస్తులను వెనక్కి పంపుతుండటం ఉద్యోగులలో ఆందోళన రేపుతోంది. ఇలా ఇబ్బందిపడుతున్నవారిలో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఉండటం గమనార్హం.
రాష్ట్రం నుంచి అధిక పెన్షన్ కోసం 3.3 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. అందులో ఇప్పటివరకు పదిశాతం కూడా పరిష్కారం కాని పరిస్థితి. మెజారిటీ దరఖాస్తులు పరిశీలన దశ లోనే ఉండిపోయాయి. అడిగిన వివరాలు, సమా చారం అందజేసే వరకు దరఖాస్తుల పరిశీలన ముందుకు సాగదని అధికారులు చెబుతుండటంతో దరఖాస్తుదారులు తలపట్టుకుంటున్నారు.
కేంద్రం ఆదేశించడంతో..
ఈపీఎఫ్‌ఓ అధిక పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించి రెండేళ్లు పూర్తయింది. త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేశారు. నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలను సమర్పించాలని కోరుతున్నారు. దాదాపుగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అధిక పెన్షన్‌కు అర్హత ఉన్నట్టు తేలినవారికి ఎంత బకాయిలు ఉన్నాయి? ఎప్పటిలోగా చెల్లించాలనే వివరాలను చెబుతున్నారు.
నోటీసులు ఇస్తూ.. వివరాలు అడుగుతూ..
అధిక పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా 17.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3.1 లక్షల దరఖాస్తులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని సంస్థల యాజమాన్యాలు సమర్పించలేదు. మరో 4.66 లక్షల దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం, స్పష్టత కోరుతూ అధికారులు తిప్పిపంపారు. చాలా వరకు దరఖాస్తుదారులు ఆ వివరాలను సమర్పించారు. ఈ క్రమంలో మరోమారు ఈపీఎఫ్‌ఓ నుంచి నోటీసులు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులే ఇందులో అధికంగా ఉన్నారు. అధిక పెన్షన్‌కు సంబంధించి ఆప్షన్ పత్రం, చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, వివిధ కేటగిరీల ధ్రువపత్రాలు ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ అధికారులు అడుగుతున్నారు.
రెండు, మూడు దశాబ్దాల క్రితం నాటి పత్రాలను అడగటంపై దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులకే ఇలాంటి అభ్యంతరాలు పెట్టడం ఏమిటని మండిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న నేపథ్యంలో.. శాఖాపరంగా సమాచారాన్ని అడగవచ్చని, ఉన్నతాధికారులు ధ్రువీకరించి ఇచ్చే పత్రాలనైనా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
కానీ ఉద్యోగులు సరైన ధ్రువపత్రాలు అందజేయాలని, వాటినే ప్రామాణికంగా తీసుకుంటామని ఈపీఎఫ్‌ఓ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి అధిక పెన్షన్ ప్రయోజనం కలిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment