
పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే వాటిలో పెన్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. పెన్షన్(Pension) లెక్కలకు సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలుంటాయి. ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంటే పెన్షన్ ఎంత వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే వచ్చే పెన్షన్ అధికంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తక్కువ సర్వీసు ఉంటే తక్కువ పెన్షన్ అందుతుందని గుర్తుంచుకోవాలి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను నిర్వహిస్తుంది. ఉద్యోగుల పెన్షన్ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలిసుండాలి.
పెన్షన్‌కు అర్హత పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.
ఉద్యోగికి 58 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి పెన్షన్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
పెన్షన్ విధానంలో కనీసం నెలవారీ మొత్తం రూ.1,000 అందుతుంది.
గరిష్ఠంగా అందే పెన్షన్ రూ 7,500.
ఎలా లెక్కిస్తారంటే..
ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 58 ఏళ్లకు చేరుకుని ఉండాలి.
పెన్షన్ తీసుకోవాలనుకునే సమయం నుంచి గత 60 నెలల సగటు జీతం (నెలకు గరిష్టంగా రూ.15,000)ను పరిగణనలోకి తీసుకుంటారు.
ఈపీఎస్‌కు మీరు కంట్రిబ్యూషన్ చేసిన మొత్తం సంవత్సరాల సంఖ్యను పెన్షనబుల్ సర్వీసు అంటారు. కింది ఫార్ములా ఉపయోగించి పెన్షన్ లెక్కిస్తారు.
నెలవారీ పెన్షన్ = పెన్షనబుల్ జీతం(రూ.15,000కు మించకుండా 60 నెలల సరాసరి)×పెన్షనబుల్ సర్వీస్/70
ఉదాహరణకు, మీ పెన్షనబుల్ జీతం రూ.15,000, పెన్షనబుల్ సర్వీస్ 10 సంవత్సరాలు అయితే నెలవారీ పెన్షన్ కింది విధంగా ఉంటుంది.
నెలవారీ పెన్షన్=15,000×10/70=2,143
ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు
పదేళ్లలో విభిన్న కంపెనీలు మారితే..
పెన్షన్ పొందాలంటే పదేళ్లు ఒకే కంపెనీలో పని చేయాలనే నిబంధనేం లేదు. పదేళ్లలోపు ఈపీఎస్ సర్వీసు అందుబాటులో ఉన్న విభిన్న కంపెనీల్లో పని చేసినా పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. అయితే, మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) మాత్రం యాక్టివ్‌గా ఉండాలి. కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయాలి. ఉద్యోగం మారినప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త యజమాన్యం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) బ్యాలెన్స్ మీ మునుపటి యజమాని వద్ద ఉంటుంది. అయినప్పటికీ సర్వీస్ వివరాలు బదిలీ చేస్తారు. దాంతో మొత్తం సర్వీసును పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment