
త్వరలో ఏటీఎంల నుంచి పీఎఫ్ విత్‌డ్రా సహా సరికొత్త సర్వీసులు అందిస్తాం
ఈపీఎఫ్‌ఓ జోనల్, రీజనల్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుక్ మాండవీయ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) చందాదారులకు అందిస్తున్న సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈపీఎఫ్‌ఓ 3.0 వెర్షన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురాన్నుట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. గతంలో ఈపీఎఫ్‌ఓ ద్వారా సేవలు పొందేందుకు చందాదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని.. తమ ఖాతాలో వివరాల సవరణ కోసం పీఎఫ్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో వివరాల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం ఈపీఎఫ్‌ఓ 3.0 ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేటలో కొత్తగా నిర్మించిన ఈపీఎఫ్‌ఓ తెలంగాణ జోనల్ కార్యాలయంతోపాటు బంజారాహిల్స్ ప్రాంతీయ కార్యాలయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి మన్‌సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
8.25 శాతం వడ్డీ ఏ బ్యాంకూ ఇవ్వట్లేదు..
ఈపీఎఫ్‌ఓ 3.0 డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా సేవల సులభతరంతోపాటు చందాదారుల కోసం మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ ఒక సంస్థగా ఉందని.. భవిష్యత్తులో అది కార్మికుల బ్యాంకుగా మారబోతోందన్నారు. ఈ సంస్థలో ప్రస్తుతం రూ. 25 లక్షల కోట్ల మేర నిల్వలున్నాయని చెప్పారు. కార్మికులు దాచుకుంటున్న నిధిపై 8.25 శాతం వడ్డీ చెల్లిస్తున్నామని, దేశంలో ఇంత వడ్డీ ఏ బ్యాంకూ ఇవ్వటం లేదని మంత్రి గుర్తుచేశారు.

చందాదారులు క్లెయిమ్స్‌ను ఆటోజనరేషన్ పద్ధతిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో చందాదారులు ఈపీఎఫ్‌ఓలో దాచుకున్న సొమ్మును ఏటీఎం కార్డుల ద్వారా ఉపసంహరించుకొనే వ్యవస్థను తీసుకొస్తామని మంత్రి వివరించారు. మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మరిన్ని ఈఎస్‌ఐ ఆసుపత్రులు, ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
రామగుండం లాంటి చోట్ల స్థలాలు కేటాయిస్తే పనులు మొదలుపెడతామన్నారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేశ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment