
పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిందీ నేనే
నాది ముఖ్యమంత్రి స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి
విలేకరులతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
కేసీఆర్ చెల్లని రూపాయి.. ఆయన గురించి మాట్లాడటం వృథా
బీఆర్‌ఎస్‌కు తెలంగాణతో సంబంధం లేదు
రాష్ట్రానికి ఏమీ జరగొద్దని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం 39 సార్లు కాదు. 99 సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా
కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధం కావాలన్న సీఎం.. తెలంగాణ నుంచి వెళ్లిన దానికంటే కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా సన్మానం చేస్తానంటూ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్(KCR)ను బండకేసి కొట్టింది నేనే.. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో ఓడగొట్టిందీ నేనే. గద్దె దింపింది నేనే..ఆ కుర్చిలో కూర్చుందీ నేనే. సీఎంగా ఉండి పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా ఇచ్చింది నేనే. ప్రస్తుతం నాది ముఖ్యమంత్రి స్థాయి. ఆయనది మాజీ ముఖ్యమంత్రి స్థాయి..’ అని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు.
స్థాయి అంటే ఏంటని, ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? డ్రగ్స్ పెట్టుకుని పార్టీలు చేసుకుంటే వస్తుందా?..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలిసి సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రశ్నించగా రేవంత్ స్పందించారు.
కేసీఆర్‌కు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు
‘కేసీఆర్‌కు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు. ఆయనకు, కొడుకు కేటీఆర్‌కు బలుపు తప్ప ఏమీ లేవు. ఆ కుటుంబానికి ఎందుకంత బరితెగింపో అర్థం కావడం లేదు. అయినా కేసీఆర్ చెల్లని రూపాయి. ఆయన గురించి మాట్లాడడం వృ«థా. బీఆర్‌ఎస్ చేసిన అప్పులు, తప్పుల కారణంగానే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం 39 సార్లు కాదు. 99 సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా. అయినా బీఆర్‌ఎస్‌కు తెలంగాణతో సంబంధం లేదు. అందుకే వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాష్ట్రానికి ఏమీ జరగొద్దని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. స్పైడర్ సినిమాలో విలన్ తరహాలో రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు సంబరపడుతూ, తీన్మార్ డ్యాన్సులు చేస్తున్నారు.
యూజ్‌లెస్ ఫెలో మాట్లాడే మాటలు పట్టించుకోవద్దు
కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులు మేము 14 నెలల్లో చేశాం. కాళేశ్వరం, మేడిగడ్డలు లేకుండానే రికార్డు స్థాయిలో పంటలు పండించాం. అయినా రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పి రొయ్యల పులుసు తిన్నోళ్లు ఎవరు? యూజ్‌లెస్ ఫెలో, హౌలేగాడు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి హరీశ్‌రావు లొంగిపోయాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి పని చేయాలని, కాంగ్రెస్‌ను ఓడించాలనే ఉద్దేశంతోనే డబ్బులు పంచి మరీ బీజేపీకి హరీశ్‌రావు ఓట్లు వేయించాడు..’ అని రేవంత్ ఆరోపించారు.
నిధులు ఏ రూపంలో వచ్చినా లెక్కబెడదాం
‘తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధం కావాలి. 2014 జూన్ 2 నుంచి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి ఎన్ని నిధులు వెళ్లాయి? మళ్లీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు తిరిగి వచ్చాయి? ఏ రూపంలో వచ్చినా సరే లెక్కపెడదాం. నేను, మా ఉప ముఖ్యమంత్రి భట్టి వస్తాం. కిషన్‌రెడ్డితో పాటు ఎవరినైనా రమ్మనండి. చర్చిద్దాం. తెలంగాణ నుంచి వెళ్లిన దానికంటే కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా అక్కడే కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తా..’ అని సీఎం సవాల్ చేశారు.
ఎక్కువ సాగుతోనే నీటికి ఇబ్బందులు
‘గత పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక మా నడ్డి విరుగుతోంది. అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఎప్పుడైనా యాసంగిలో 35–40 లక్షల ఎకరాలు సాగవుతుంది. కానీ ఈసారి రాష్ట్రంలో ఏకంగా 55 లక్షల ఎకరాలు సాగయింది. అందుకే అక్కడక్కడా నీటికి ఇబ్బందులు వస్తున్నాయి. అయినా ఏ రిజర్వాయర్ నుంచి ఏ మేరకు ఎప్పుడు నీళ్లు ఇవ్వాలన్న దానిపై అధికారులు ఎప్పుడో షెడ్యూల్ సిద్ధం చేశారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకున్నాం. మహారాష్ట్ర నుంచి వచ్చే అనుమతులను బట్టి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం పనులు ఉంటాయి.
రిజల్ట్స్ వేరు..రిజర్వేషన్లు వేరు
కృష్ణమాదిగ బీజేపీ నేతలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. రిజల్ట్స్ వేరు, రిజర్వేషన్లు వేరు. గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ల మేరకు ఇప్పుడు ఫలితాలు ప్రకటిస్తున్నాం. పాత నిబంధనలను మేము మార్చలేం. కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే అందరికీ న్యాయం చేస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ?
‘రీజనల్ రింగు రోడ్డు ఇచ్చామంటూ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. నేను మెట్రో తెచ్చానని కిషన్‌రెడ్డి అంటున్నాడు. హైదరాబాద్‌లో జైపాల్‌రెడ్డి తెచ్చిన మెట్రో కనపడుతోంది కానీ కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది? కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులపై ఉప ముఖ్యమంత్రి భట్టి నిర్వహించిన సమావేశానికి రమ్మంటే సమయం లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. మరి కేంద్రమంత్రి ఖట్టర్ సికింద్రాబాద్‌లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సమీక్షకు ఎందుకు వెళ్లలేదు? కేంద్రమంత్రి ఖట్టర్ కూడా కిషన్‌రెడ్డిని హడావుడిగా పిలిచాడా? కేసీఆర్ ఫీలవుతాడనే ఆ సమావేశానికి కిషన్‌రెడ్డి వెళ్లలేదు. కేసీఆర్ చెప్పిన చదువు మా దగ్గర చెపితే ఎలా?..’ అని రేవంత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment