
ఎఫ్‌ఎస్‌ఐపై పరిమితులు విధించి టీడీఆర్‌కు డిమాండ్ పెంచే కుట్ర
ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాంటి ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ విచారణ జరపాలి
కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారన్న రాహుల్ వ్యాఖ్యలు రేవంత్‌ను ఉద్దేశించినవే
బీసీ రిజర్వేషన్లపై సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలి
గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు
మీడియాతో ఇష్టాగోష్టిలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అండతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) రూ. వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు(KTR) ఆరోపించారు. త్వరలో హైదరాబాద్‌లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ)పై పరిమితులు విధించడం ద్వారా ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్)కు కృత్రిమ డిమాండ్ పెంచే కుట్ర జరుగుతోందన్నారు.
హైదరాబాద్‌లో టీడీఆర్‌లను ఎవరు అడ్డగోలుగా కొన్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘త్వరలో ఎఫ్‌ఎస్‌ఐపై పరిమితులను బూచిగా చూపి టీడీఆర్‌లను తిరిగి బిల్డర్లకు అడ్డగోలు ధరలకు అమ్మేందుకు రేవంత్ ముఠా సిద్ధంగా ఉంది. ఎఫ్‌ఎస్‌ఐపై ఉమ్మడి ఏపీలో వై.ఎస్. ప్రభుత్వం అవలంబించిన విధానాన్నే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది.
గతంలో టీడీఆర్ పద్ధతిలో రూ. వేల కోట్ల విలువచేసే 400 ఎకరాలను జీహెచ్‌ఎంసీ ప్రజావసరాల కోసం సేకరించింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పౌరులకు ఉపయోగపడే ఈ విధానాన్ని రేవంత్ అక్రమ సంపాదనకు మార్గంగా ఎంచుకున్నాడు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాంటి ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అవినీతి మార్గాలు తెలిసింది రేవంత్‌కే..
‘దేశ చరిత్రలో అవినీతి మార్గంలో డబ్బు సంపాదనకు అత్యధిక మార్గాలు తెలిసింది రేవంత్‌కే. ఆయన పాలనలో ప్రైవేటు దోపిడీ పెరిగి ప్రభుత్వ ఆదాయం తగ్గింది. కేంద్రంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోవడానికే రేవంత్ తరచూ ఢిల్లీ వెళ్తున్నాడు. రేవంత్, కిషన్‌రెడ్డి దొంగాట ఆడుతూ జనం దృష్టిని మళ్లించే ప్రయత్నంలో ఉన్నారు. రేవంత్‌ను ఉద్దేశించే కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు’అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘స్థానికం’, ఉపఎన్నికల ఉద్దేశంతోనే మండలి ఎన్నికకు దూరం
స్థానికసంస్థల ఎన్నికలు, 10 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతోనే శాసనమండలి పట్టభద్రుల స్థానం ఎన్నికకు దూరంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే రెండో అభ్యరి్థని మండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలపలేదని కేటీఆర్ చెప్పారు.
అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారు
గవర్నర్ ప్రసంగంతోపాటు బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. అయితే ప్రభుత్వంలో ఉన్న వారు మాట్లాడే పిచ్చిమాటలు, పనికిరాని మాటలు, బూతులు వినాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదని ఒక కొడుకుగా, పార్టీ కార్యకర్తగా తన అభిప్రాయమన్నారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలు, రేవంత్ ఆవగింజంత కూడా సరిపోరని వ్యాఖ్యానించారు.
మళ్లీ ఫార్ములా–ఈ నోటీసులు రావచ్చు..
ఈ నెల 16 నుంచి 27లోగా మళ్లీ తనకు ఫార్ములా–ఈ కేసు పేరిట విచారణ నోటీసులు రావచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ‘ఫార్ములా–ఈ’ని ప్రశ్నిస్తున్న వారు రూ. 200 కోట్లతో రేవంత్ ప్రభుత్వం నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్‌కు ఏం ఒరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బయటి దేశాల్లో జరుగుతున్న మరణాలను రేవంత్ తనకు అంటగట్టడం విడ్డూరమని.. తాను కేసీఆర్ అంత మంచివాడిని కానని వ్యాఖ్యానించారు. బీసీలకు రిజర్వేషన్లపై రేవంత్‌కు చిత్తశుద్ది ఉంటే ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment