ఆ రూ.200 కోట్లు ఎటుపోయాయి? | RTC Employees Facing EPFO higher pension Problems: Telangana | Sakshi
Sakshi News home page

ఆ రూ.200 కోట్లు ఎటుపోయాయి?

Published Mon, Nov 4 2024 1:41 AM | Last Updated on Mon, Nov 4 2024 1:41 AM

RTC Employees Facing EPFO higher pension Problems: Telangana

ఆర్టీసీ ఉద్యోగుల హయ్యర్‌ పెన్షన్‌ కాంట్రిబ్యూషన్‌ సొమ్ముపై అయోమయం

ఉమ్మడి ఆర్టీసీలో 2014కు ముందు 16,307 మంది ఆప్షన్లు

అందులో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు 7,373 మంది

సాంకేతిక కారణాలతో ఆప్షన్లను తిరస్కరించిన ఈపీఎఫ్‌ఓ

ఉద్యోగులకు తిరిగి అందని కాంట్రిబ్యూషన్‌ సొమ్ము

మళ్లీ పూర్తి డబ్బులు కట్టాలంటూ నోటీసులు.. ఆందోళనలో ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో అధిక పెన్షన్‌ కాంట్రిబ్యూషన్‌ సొమ్ముపై గందరగోళం నెలకొంది. ఉద్యోగులు చెల్లించిన సుమారు రూ.125 కోట్లు, వాటిపై వడ్డీ కలిపి.. మొత్తం రూ.200 కోట్ల మొత్తానికి లెక్కతేలకుండా పోయింది. ఈపీఎఫ్‌ఓ అధిక పెన్షన్‌ స్కీమ్‌ కోసం పదేళ్ల కింద ఉద్యోగులు చెల్లించిన సొమ్ము ఏమైందో తెలియడం లేదని.. ఇప్పుడు అధిక పెన్షన్‌ కోసం మొదటి నుంచీ లెక్కేసి మొత్తం డబ్బులు కట్టాలంటున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారాన్ని పరిష్కరించాల్సిన ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్టు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ పీఎఫ్‌ బకాయిలు సకాలంలో చెల్లించకపోవటం, పీఎఫ్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకోవటం, విషయం కోర్టు వరకు వెళ్లటం, అయినా బకాయిలు చెల్లించక ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం దాకా ఇప్పటికే ఎన్నో ఆందోళనకర పరిణామాలు జరిగాయి. దానికితోడు అధిక పెన్షన్ల వ్యవహారం మరో వివాదానికి కారణమవుతోంది.

అసలేం జరిగింది?
ఉద్యోగులకు అధిక పెన్షన్‌ కోసం 1995 నవంబరులో భవిష్యనిధి సంస్థ ఆప్షన్లను కోరింది. భవిష్య నిధి వ్యవహారాల కోసం ఆర్టీసీలో ప్రత్యేకంగా పీఎఫ్‌ ట్రస్టు ఉంటుంది. ఆ ట్రస్టు ఉమ్మడి ఆర్టీసీ ఉద్యోగుల నుంచి హయ్యర్‌ పెన్షన్‌ కాంట్రిబ్యూషన్‌ను వసూలు చేసి ఈపీఎఫ్‌ఓకు జమ చేసింది. 2014 ఆగస్టు వరకు ఇది కొనసాగింది. మొత్తంగా 16,307 మంది ఇలా హయ్యర్‌ పెన్షన్‌ కోసం వారి వేతనాల నుంచి 8.33 శాతం చొప్పున కాంట్రి బ్యూషన్‌ చెల్లించారు. 

అందులో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు 7,373 మంది ఉన్నారు. వారు హ య్యర్‌ పెన్షన్‌కోసం చెల్లించిన మొత్తం సుమారు రూ.125 కోట్ల వరకు ఉంది. కానీ సాంకేతిక కారణాలతో వారి ఆప్షన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీనితో అప్పటివరకు వారు చెల్లించిన కాంట్రిబ్యూషన్‌ సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉన్నా.. ఈపీఎఫ్‌ఓ వద్దే ఉండిపోయింది. పీఎఫ్‌ వ్యవహారాలు చూసేందుకు ఆర్టీసీలో ప్రత్యేకంగా ట్రస్టు ఉన్నా.. అది పట్టించుకోలేదు. ఉద్యోగులు చెల్లించిన సొమ్ము రూ.125 కోట్లకు వడ్డీ కలిపి రూ.200 కోట్ల వరకు అవుతుందని.. ఆ సొమ్ము లెక్క తేలడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

ఇప్పుడూ పూర్తిగా  కట్టాలంటూ నోటీసులతో..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్‌ఓ గతేడాది మరోసారి హయ్యర్‌ పెన్షన్‌ కోసం ఆప్షన్లు తీసుకుంది. అప్పట్లో తిరస్కరణకు గురైనవారిలో కొందరు రిటైరవగా.. మిగతావారిలో చాలా వరకు హయ్యర్‌ పెన్షన్‌ కోసం ఆప్షన్లు ఇచ్చారు. ఈసారి వేతనాల నుంచి 8.33 శాతం కాంట్రిబ్యూషన్‌తోపాటు ఎంప్లాయీస్‌ హయ్యర్‌ పెన్షన్‌ స్కీం నిర్వహణ చార్జీల పేరిట మరో 1.16 శాతం మొత్తాన్ని చెల్లించాలని ఈపీఎఫ్‌ఓ సూచించింది. 

స్కీం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం సొమ్మును చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. గతంలో ఆప్షన్‌ రిజెక్ట్‌ అయి ఇప్పుడు మళ్లీ ఆప్షన్‌ ఇచ్చినవారు.. అప్పట్లో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి, మిగతా మొత్తాన్ని వసూలు చేసుకోవాలని అభ్యర్థించారు. కానీ స్పందన లేదు. ఈ విషయాన్ని పీఎఫ్‌ ట్రస్టు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరూ పట్టించుకోవడం లేదు..
హయ్యర్‌ పెన్షన్‌ ఆప్షన్లను తిరస్కరించిన వెంటనే ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ మొత్తాన్ని వాపసు చేయాల్సి ఉంది. కానీ ఎన్ని సార్లు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. సమస్య ఎక్కడుందో చెప్పేవారు కూడా లేకపోవటం విడ్డూరం. ఈ విషయంలో చొరవ చూపాల్సిన ఆర్టీసీ మిన్నకుండిపోతోంది. ఇప్పటికైనా దీన్ని పరిష్కరించి 7,373 మంది ఉద్యోగులకు ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉంది  – ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు

ఏపీలోనూ ఇదే సమస్య..
ఏపీఎస్‌ ఆర్టీసీకి సంబంధించి 8,934 మంది ఉద్యోగులు కూడా ఇదే తరహాలో ఎదు రుచూస్తున్నారు. వారు అప్పట్లో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి తాజా కాంట్రిబ్యూషన్‌ను లెక్కించాల్సి ఉంది. దీన్ని ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్టు సీరియస్‌గా తీసుకుని కొలిక్కి తేవాల్సి ఉంది
– ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత దామోదర్‌

వెంకట్‌రావు.. ప్రస్తుతం ఆర్టీసీలో డిపో క్లర్కు. 1996లో ఆయన కండక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో.. హయ్యర్‌ పెన్షన్‌ కోసం ఈపీఎఫ్‌ఓకు ఆప్షన్‌ ఇచ్చారు. కాంట్రిబ్యూషన్‌గా రూ.2.60 లక్షలు చెల్లించారు. ఆయన ఆప్షన్‌ రిజెక్ట్‌ అయింది. కానీ ఈ విషయం వెంకట్‌రావుకు తెలియలేదు. సమాచారం ఇవ్వాల్సిన ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్ట్‌ పట్టించుకోలేదు. తాజాగా 2022లో ఈపీఎఫ్‌ఓ హయ్యర్‌ పెన్షన్‌ కోసం మళ్లీ ఆప్షన్‌ స్వీకరించింది.

దీనికి వెంకట్‌రావు దరఖాస్తు చేసుకోగా.. 1996 నాటి నుంచి ఇప్పటివరకు కలిపి కాంట్రిబ్యూషన్‌ రూ.4.80 లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్‌ఓ నోటీసు ఇచ్చింది. ఇదేమిటని ఆయన ఆరా తీయగా.. 1996లోనే తన దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిసింది. అప్పట్లో చెల్లించిన మొత్తం మినహాయించి మిగతాది చెల్లిస్తానని ఆయన చెబితే.. మొత్తం చెల్లించాల్సిందేనని ఈపీఎఫ్‌ఓ నుంచి సమాధానం వచ్చింది. మరి నాడు చెల్లించిన సొమ్ము ఏమైందో అంతుపట్టని పరిస్థితి. తెలంగాణ ఆర్టీసీలో వేల మంది ఉద్యోగుల సమస్య ఇది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement