
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. మే 7వ తేదీ నుంచి సమరభేరికి పిలుపు ఇచ్చారు. ఈ మేరకు జేఏసీ నేతలు ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు, అటు లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు.
మే 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతాం. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి సమ్మెకు వెళతాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. అలాగే.. ఈరోజు వరకు ఉద్యోగులకు జీతాలు పడలేదని ఆర్టీసి జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ జేఏసీ సమర్పించిన నోటీసుల్లో 21 అంశాలు ఉన్నాయి. 2017లో వేతన సవరణ జరిగినప్పటికీ నేటికీ ఎరియర్స్ రాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని నోటీసుల్లో జేఏసీ డిమాండ్ చేసింది.