Updates:
మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలు.. మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యం
⇒కాకినాడ జిల్లా: తునిలో మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలలో మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యానికి దిగారు. నిన్నటిలాగే ఇవాళ కూడా మున్సిపల్ కౌన్సిల్‌లోకి టీడీపీ రౌడీలు దౌర్జన్యంగా ప్రవేశించారు. మద్యం మత్తులో నిన్న మహిళ కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గుండాలు.. ఈ రోజు కూడా కౌన్సిల్ హల్ లోకి చొచ్చుకు వచ్చారు. కౌన్సిల్ హల్‌లో వెళ్లే అవకాశం లేకపోవడంతో మున్సిపల్ ఛైర్మన్ సుధాబాలు,కౌన్సిలర్లు బయటే బైఠాయించారు. యనమల డైరక్షన్‌లో ప్రేక్షక పాత్రకు పోలీసులు పరిమితమయ్యారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరావు పత్తాలేకుండా పోయారు.
⇒మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో కూటమి నేతలు అరాచక పర్వానికి తెరలేపారు. బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాగాకు కుయుక్తులు పన్నుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు.
⇒టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్‌లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది.
⇒కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు.
⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్‌సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.
⇒నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్‌సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు.
⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు.
⇒ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు.
⇒పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు.
⇒కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment