మే 1, 2016 తర్వాతి ప్రాజెక్ట్‌లు, లే అవుట్లే రెరా పరిధిలోకి!
అంతకంటే ముందు వాటికి రెరాలో నమోదు నుంచి మినహాయింపు
►రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లకే బ్యాంకు రుణాలు
► సుమారు పదివేల ఫ్లాట్లు రెరా పరిధిలోకి
సాక్షి, హైదరాబాద్: మే 1, 2016లో కేంద్రం స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)ను తీసుకొచ్చింది. ఈ తేదీ తర్వాతి నుంచి ప్రారంభమైన నివాస, వాణిజ్య సముదాయాలు, లే అవుట్లు అన్ని కూడా రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. అంతకంటే ముందు ప్రారంభమైన ప్రాజెక్ట్‌లు, వెంచర్లు మాత్రం రెరా పరిధిలోకి రావు. నిర్మాణం పూర్తయి.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) రాని ప్రాజెక్ట్‌లకూ రెరాలో నమోదు నుంచి మినహాయింపు ఉంది.
దేశంలో రెరా ప్రకటన కొత్త ప్రాజెక్ట్ ప్రారంభానికి మోకాలడ్డింది. రెరా నిబంధనలెలా ఉంటాయో? కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో? వంటి రకరకాల కారణాలతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభానికి డెవలపర్లు ఆలోచనలో పడ్డారు. రెరా ప్రకటన నాటి నుంచి 2017 తొలి త్రైమాసికం వరకూ దేశంలోని ప్రధాన నగరాల్లో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు 16 శాతం తగ్గడమే ఇందుకు నిదర్శనమని కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ నివేదిక చెబుతోంది. హైదరాబాద్ గణాంకాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 2015 నుంచి మార్చి 2016 మధ్య 10,125 యూనిట్లు ప్రారంభం కాగా.. ఏప్రిల్ 2016– మార్చి 2017లో మాత్రం 9,775 యూనిట్లు ప్రారంభమయ్యాయి. అంటే 3 శాతం తగ్గాయన్నమాట.
లగ్జరీ, అందుబాటు ఇళ్లలో 30 శాతం వృద్ధి..
అందుబాటు గృహాలు, లగ్జరీ ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు మాత్రం వృద్ధిని నమోదు చేశాయి. ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2017 మధ్య కాలంలో అందుబాటు గృహాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2015–16 ఇదే సమయంలో 25 శాతంగా ఉంది. లగ్జరీ, హైఎండ్ యూనిట్ల ప్రారంభాలు మాత్రం ఇదే సమయంలో 11 శాతం నుంచి 13 శాతానికి పెరిగాయి. అయితే ఆయా విభాగాల్లో అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని నివేదిక పేర్కొంది.
రెరాలో నమోదైతేనే రుణాలు..
సాధారణంగా డెవలపర్లు ప్రాజెక్ట్ పేరుతో సమీకరించిన నిధుల్లో కొంత మొత్తాన్ని ఇతర ప్రాజెక్ట్‌లకు, ఇతరత్రా అవసరాలకూ వినియోగిస్తుంటారు. దీంతో కొన్ని సమయాల్లో నిధుల కొరత కారణంగా నిర్మాణాలు ఆలస్యమవుతుంటాయి. అయితే రెరాతో నిధుల మళ్లింపునకు చెక్ పడుతుంది. కొనుగోలుదారుల నుంచి సమీకరించిన నిధుల్లో 70 శాతం ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. అలా జమ చేసిన నిధులను ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూమి ఖర్చులు, నిర్మాణ ఖర్చుల కోసమే వినియోగించాలి.
⇒ ఇదిలా ఉంటే రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లకు మాత్రమే రుణాలను మంజూరు చేయాలని కొన్ని బ్యాంకులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎస్క్రో ఖాతాలో ఎలా జమ చేయాలనే దాని మీద ఇంకా స్పష్టత లేదని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. ప్రాజెక్ట్ ఇంజనీరు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఆర్కిటెక్ట్ ధ్రువీకరణ ప్రకారం ప్రతి 6 నెలలకొకసారి ఈ ఖాతా నుంచి డెవలపర్లకు నిధులు విడుదల అవుతుంటాయి.