భట్టి విక్రమార్కకు హిమాచల్ సంప్రదాయ టోపీని అలంకరిస్తున్న సీఎం సుఖ్వీందర్‌సింగ్
హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్రం చర్చలు
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం
త్వరలో ‘బూట్’ విధానంలో ఎంఓయూ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం బూట్ (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ (జలవిద్యుత్) ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఆహ్వనించగా.. రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల రెండు ప్రాజెక్టుల ఏర్పాటుపై రాష్ట్రం ఆసక్తిని వ్యక్తం చేసింది.
ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేస్తే త్వరితగతిన తగిన తదుపరి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలసి ఢిల్లీలో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం నుంచి సెలి (400 మెగావాట్లు), మియార్ (120 మెగావాట్లు) హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఒక లేఖను సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంఓయూ గురించి చర్చించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి రావాలని హిమాచల్ సీఎం, భట్టి నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఈ విద్యుత్ వల్ల రాష్ట్ర అవసరాలు, భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు వీలు ఏర్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment