hydel power
-
చేజారే నీటికి సరికొత్త ‘పవర్’
సాక్షి, అమరావతి: కొండ కోనల్లో వృధా అవుతున్న నీటిని విద్యుదుత్పత్తి వనరులుగా మార్చేందుకు ప్రణాళిక తయారవుతోంది. కాలుష్యానికి కళ్లెం వేసే గ్రీన్ ఎనర్జీని పెద్దఎత్తున ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు ఇంధనశాఖ ఇటీవల నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రస్తుతం 1,700 మెగావాట్లు ఉన్న జల విద్యుత్ వచ్చే పదేళ్లలో 7,700 మెగావాట్లకు పెరగనుంది. తద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు మరింత చౌకగా కరెంట్ అందుబాటులోకి వచ్చే వీలుంది. మినీ హైడల్స్, పంప్డ్ స్టోరేజీలకు అనువైన ప్రాంతాలను ఏపీలో అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 31 వేల మెగావాట్ల విద్యుత్‌ని, వీటి ద్వారా ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు. తొలిదశలో 6 వేల మెగావాట్ల జల విద్యుదుత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనికి సంబంధించి సమగ్ర నివేదికలు (డీపీఆర్) శరవేగంగా రూపొందిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయం(పీక్ అవర్స్)లో కూడా జల విద్యుత్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. పంప్డ్ స్టోరేజీలు అంటే... నదులు, వాగుల్లో నీటిని ఎగువ ప్రాంతంలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుని జల విద్యుదుత్పత్తి చేస్తారు. నిజానికి కొన్ని సందర్భాల్లో సౌర, పవన విద్యుత్ ఎక్కువగా వస్తుంది. దీన్ని వినియోగించుకునేందుకు థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తోంది. దిగువ నుంచి ఎగువకు నీటిని పంపే పంప్డ్ స్టోరేజీల్లో ఈ విద్యుత్‌ను వాడుకుంటారు. రాత్రి సమయంలో సౌర విద్యుత్ ఉండదు. అలాంటప్పుడు డిమాండ్‌ను పంప్డ్ స్టోరేజీలు భర్తీ చేస్తాయి. ఇవి కాకుండా కొండ ప్రాంతాల్లో జలపాతాల నుంచి జాలువారే నీటిని ఒక చోట ఆనకట్ట ద్వారా నిల్వ చేస్తారు. దీనిద్వారా విద్యుదుత్పత్తి చేస్తారు. వీటిని మినీ హైడల్స్ అని వ్యవహరిస్తారు. కాలుష్యానికి కట్టడి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వల్ల వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు పంప్డ్ స్టోరేజీ తరహా జల విద్యుత్ తోడ్పడుతుంది. గ్రీన్ ఎనర్జీ పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త నిబంధనలు తెచ్చింది. పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలంటే 30 శాతం జల విద్యుత్ లభ్యత ఉండాలని సూచించింది. రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీన్ని 2030 నాటికి 7,700 మెగావాట్లకు పెంచనున్నారు. జల విద్యుత్ చౌకగా లభిస్తుంది. ప్లాంట్ నెలకొల్పిన 70 ఏళ్ల వరకూ ఉత్పత్తికి ఢోకా ఉండదు. మొదటి 25 ఏళ్లలోనే నిర్మాణ వ్యయం తీరిపోతుంది. ఆ తర్వాత మరింత చౌకగా విద్యుత్ అందుతుంది. మాచ్‌ఖండ్ నుంచి ప్రస్తుతం యూనిట్ 90 పైసలకే విద్యుత్ వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పంప్డ్ స్టోరేజీల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. చదవండి : అంబానీ వర్సెస్ అదానీ.. ఇద్దరి టార్గెట్ అదే -
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో 3.649 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.874 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.775 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 7,921 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ 164 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల 288 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్ సిబ్బంది తెలిపారు. మొత్తం జలాశయంలో 37.5560 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.డ్యాం నీటిమట్టం 815.30 అడుగులుగా నమోదైంది. -
తెలంగాణలో హైడల్ విద్యుత్పత్తి
హైదరాబాద్ : తెలంగాణలో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసనసభలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం 2,400 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులో ఉందని, అన్ని వనరులు ఉపయోగించి హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రాజెక్టుల్లో తక్కువ ఖర్చుతో పారదర్శకంగా బిడ్డింగ్ ద్వారా వెళ్తున్నామని పేర్కొన్నారు. ఏడాది చివరిలోపు 2 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంటామని తెలిపారు. సోలార్ విద్యుత్‌లో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందని స్పష్టం చేశారు. వీలైనంత తక్కువ ధరకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదన్నారు. -
848.10 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయ నీటిమట్టం సోమవారం సాయంత్రం సమయానికి 848.10 అడుగులుగా నమోదైంది. రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో డిమాండ్‌ను అనుసరించి లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.016 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.857 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం దిగువ నాగార్జునసాగర్‌కు 9,533 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా వెయ్యి క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 75.9734 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.