
ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారన్న మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రహదారి పనులు చేపట్టాలని గడ్కరీకి వినతి
రెండు ప్యాకేజీలుగా ఈ రహదారి పనులు
సాక్షి, న్యూఢిల్లీ: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) క్లియరెన్స్‌లన్నీ త్వరలో పూర్తికానున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ ఆమోదానికి వెళ్తుందని చెప్పారు. ఈప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కోమటిరెడ్డి మంగళవారం ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనలతో కలిసి గడ్కరీతో భేటీ అయ్యారు.
ట్రిపుల్ ఆర్, హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రోడ్డు, 12 ఆర్వోబీలు తదితర అంశాలపై గడ్కరీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు విమానాశ్రయాల గురించి పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. కొత్తగూడెం, రామగుండం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎయిర్‌పోర్టుల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
95 శాతం భూసేకరణ చేశాం
2018–19లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రకటించగా.. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కోమటి రెడ్డి విమర్శించారు. తాము అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రంతో టచ్‌లో ఉంటూ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జంగారెడ్డి–భువనగిరి–చౌటుప్పల్ వరకు టెండర్లు పిలిచామన్నారు. 95 శాతం భూసేకరణను క్లియర్ చేశామని, కేంద్రం నుంచి ఆమోదం వచ్చాక వారికి పరిహారమిస్తామని తెలిపారు.
‘హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రహదారిని మచిలీపట్నం వరకు పొడిగిస్తున్నామని, ఇందుకు కన్సల్టెంట్‌ను పిలిచినట్లు గడ్కరీ తెలిపారు. అయితే, హైదరాబాద్–విజయవాడ వరకు ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున త్వరగా టెండర్లు పిలవాలని కోరాను. రెండు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది.
మొదటి ప్యాకేజీలో మల్కాపూర్–విజయవాడ, రెండో ప్యాకేజీలో విజయవాడ–మచిలీపట్నం వరకు నిర్మాణం జరిపేందుకు గడ్కరీ ఒప్పుకున్నారు. పర్వతమాల పథకం కింద యాదగిరిగుట్ట, భువనగిరి కోటకు, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా నాగార్జున కొండను కలుపుతూ, మంథనిలోని రామగిరి కోట ప్రాంతాల్లో రోప్‌వేలు అడిగాను. వీటిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు’అని కోమటిరెడ్డి చెప్పారు.
అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్
అనర్హత వేటు పడుతుందనే భయంతోనే బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఇక లేనట్లేనని, ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తానని కేసీఆర్ అంటున్నారు, ఒకవేళ కేసీఆర్ ఒక అంశాన్ని ఎత్తి చూపితే పది అంశాలను సభ ముందు పెడతాం. దళిత సీఎం నుంచి జర్నలిస్ట్‌ల వరకు కేసీఆర్ చేసిన మోసాలను ఎండగడతాం’అని అన్నారు. రేవంత్‌రెడ్డి పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. సీఎం మార్పు జరుగుతుందని వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనంటూ కొట్టిపడేశారు.
Comments
Please login to add a commentAdd a comment