ప్రధానితో కొబ్బరికాయ కొట్టిస్తూ తమ ఘనతగా చాటుకుంటున్న కూటమి ప్రభుత్వం
నిజానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీపై 2024 ఫిబ్రవరి 20నే ఎంవోయూ
భూలీజు ఒప్పందంపై సంతకం చేసినట్టు ఎన్టీపీసీ అధికారిక ప్రకటన
అన్ని రాష్ట్రాలతో పోటీపడి మరీ బల్క్ డ్రగ్ పార్క్ సాధించిన గత జగన్ ప్రభుత్వం
ప్రాజెక్టు అమలుకు 2020లో ఏపీ డ్రగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు
సీఐఎఫ్ ఏర్పాటుకు 2022లోనే అధికారికంగా లేఖ పంపిన కేంద్రం
రైల్వే జోన్‌కూ గత ప్రభుత్వంలోనే భూ కేటాయింపు
నాడు ఆ భూమి పనికిరాదని.. ఇప్పుడు అక్కడే భూమి పూజ
ఇవన్నీ తామే సాధించినట్టు బాబు అండ్ కో గొప్పలు
దాదాపు అన్ని ప్రాజెక్టులదీ అదే పరిస్థితి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కొత్తగా భారీ ప్రాజెక్టులు ఇస్తున్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రకటిస్తుంటే.. అదంతా సీఎం చంద్రబాబు చలవే అని టీడీపీ, దాని తోక పార్టీలతో పాటు ఎల్లో మీడియా బాకాలూదుతోంది. వాస్తవం మాత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న రాష్ట్రంలో శంకుస్థాపన చేయనున్న మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే. గత ప్రభుత్వ హయాంలో భూమి లీజుపై ఒప్పందం చేసుకుని మరీ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు స్వయంగా ఎన్టీపీసీ గత ఏడాది ఫిబ్రవరి 20న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రాజెక్టుకు సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం హోరెత్తిస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై అనేక రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీపడి మరీ సాధించి 2020లోనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ(సీఐఎఫ్)ను ఏర్పాటు చేయాలంటూ అధికారికంగా కేంద్రం లెటర్ (31026/62/22)ను 2022లోనే పంపింది.
అటువంటి బల్క్ డ్రగ్ పార్క్‌నకు ఇప్పుడు కొత్తగా ప్రధాని చేత శంకుస్థాపన చేయిస్తోంది కూటమి ప్రభుత్వం. రైల్వేల్లో కొత్త లైన్ల ఏర్పాటు, రైల్వే జోన్‌కు భూ కేటాయింపు ఇలా ఒకటేమిటి.. ప్రధాని నేడు శంకుస్థాపన చేయబోయే మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే కావడం గమనార్హం.
మెజార్టీ ప్రాజెక్టులదీ అదే తీరు
» కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదానో, కొత్త ప్రాజెక్టులను ప్రకటించే విధంగా చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. అయితే ఏడాది, రెండేళ్ల క్రితం ప్రకటించి.. భూ కేటాయింపులు, లీజు ఒప్పందాలు కూడా ముగిసిన పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేసేందుకు సిద్ధమవుతుంటే మహా ప్రసాదం ప్రభో అంటూ కీర్తించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
» వాస్తవానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును పూడిమడకలో ఏర్పాటు చేయనున్నట్టు.. ఇందుకు ఏపీఐఐసీతో 1,200 ఎకరాల భూ లీజు ఒప్పందంపై 2024 ఫిబ్రవరి 20న అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఎన్‌జీఈఎల్) సంతకం చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా రూ.1.85 లక్షల కోట్ల
ఈ ప్రాజెక్టును తామే సాధించామన్నట్టుగా చంద్రబాబు గొప్పలకు పోతున్నారు. నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్కు కోసం ప్రత్యేకంగా 2020లో ఏపీ బల్క్ డ్రగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
» రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్‌ను కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో పాటు ఈ పార్కులో కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్(సీఐఎఫ్)ను ఏర్పాటు చేయాలంటూ 2022 నవంబర్ 7న కేంద్ర ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శాఖ అండర్ సెక్రటరీ అధికారికంగా లేఖ (31026/62/2022) పంపారు. మొత్తం రూ.1,876 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం మొదటి విడత కింద రూ.223 కోట్లను మార్చి 2023లో విడుదల చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే.. ఇప్పుడు కొత్తగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్క్, బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని చేత శంకుస్థాపన చేయించేందుకు సిద్ధమైంది.
» రైల్వే జోన్‌కు ముడసర్లోవలో అవసరమైన భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. అయితే.. అసలు భూమి కేటాయించలేదని, అక్కడ భూమి నిర్మాణాలకు అనువైనది కాదంటూ తప్పుడు ఆరోపణలు చేసి.. ఇప్పుడు అదే ప్రాంతంలో రైల్వే జోన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయిస్తున్నారు.
» ఇవేకాకుండా.. దువ్వాడ–సింహాచలం, విశాఖపట్నం–గోపాలపట్నం మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణ పనులకు కూడా గతంలోనే అనుమతులు వచ్చాయి. ఈ పనులు కూడా కొంత మేర ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా కొత్తగా చేపడుతున్నట్టు జాబితాలో చేర్చారు. కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ ఏర్పాటు, గుత్తి–పెండేకల్లు డబ్లింగ్ పనులు.. ఇలా ఒకటేమిటి మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment