ఎనిమిది నెలలాయే..!
ముందుకుసాగని ఇళ్ల నిర్మాణం
తొలుత 3,957 ఇళ్లకు సీఎం శంకుస్థాపన
తదుపరి 1,384 ఇళ్ల నిర్మాణానికి అనుమతి
ఉత్తర్వులు వచ్చినా మొదలు కాని పనులు
కనీసం లే అవుట్‌లు సిద్ధంకాని వైనం
మిగిలిన ఇళ్ల నిర్మాణంపై స్పష్టత కరువు
హన్మకొండ : మురికివాడలు లేని నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతామంటూ 2015 జనవరిలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీద రెండు రోజుల వ్యవధిలోనే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఆర్నెళ్లలోపే ఇళ్లు నిర్మించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మీపురం, ఎస్సార్‌నగర్, గరీబ్‌నగర్, గిరిప్రసాద్‌నగర్, శాకరాసికుంట, ప్రగతినగర్, దీన్‌దయాళ్‌నగర్, అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్‌లలో ఇళ్ల నిర్మాణానికి సీఎం స్వయంగా శంకుస్థాపన చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ కాలనీల్లో జీ ప్లస్ వన్ పద్ధతిలో 3,957 ఇళ్లు నిర్మిస్తామని సహకరించాల్సిందిగా ప్రజలకు సీఎం సూచించారు. ఈ పని చేపట్టేందుకు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి రాజధాని నగరానికి దూరంగా జిల్లా కేంద్రంలో వరుసగా నాలుగు రోజులు బస చేశారు. అయితే శంకుస్థాపన జరిగి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి లేదు.
లే అవుట్ సిద్ధం కాలేదు..
శంకుస్థాపన జరిగిన ఆర్నెళ్ల తర్వాత అంబేద్కర్‌నగర్, ఎస్సార్‌నగర్‌లలో 1,384 ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 జూన్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ప్రతీ ఇంటికి 900 చదరపు అడుగులను కేటాయించారు. వీటిలో 560 చదరపు అడుగుల వైశాల్యంలో రూ 5.04 లక్షల వ్యయంతో డబుల్ బెడ్‌రూం, కిచెన్, కామన్‌హాల్, రెండు టాయిలెట్లతో ఇళ్లను నిర్మించనున్నట్లు ఆ జీవోలు పేర్కొన్నారు. తొలిదశలో 1,384 ఇళ్ల నిర్మాణానికి రూ.69.75 కోట్లు మంజూరయ్యాయి. స్థల లభ్యత ఆధారంగా అంబేద్కర్‌నగర్‌లో జీ ప్లస్ 3 పద్ధతిలో, ఎస్సార్‌నగర్‌లో జీ ప్లస్ 2 పద్ధతిలో ఇళ్లను నిర్మించాల్సి ఉంది. ఉత్తర్వులు జారీ అయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన లే అవుట్లు సిద్ధం కాలేదు.
కష్టంగా మారిన స్థల మార్పిడి
జీ ప్లస్ వన్ పద్ధతిలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఎంపిక చేసిన ప్రగతినగర్, దీన్‌దయాళ్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, గరీబ్‌నగర్, సాకారాశికుంట మురికివాడలు చెరువు శిఖం భూముల్లో వెలిశాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఈ స్థలాలు చెరువుశిఖం ప్రాంతంలో ఉన్నాయి. చారిత్రక ఖిలావరంగల్‌లోని మట్టికోటకు ఆనుకోని గిరిప్రసాద్‌నగర్ ఉంది. ఈ మురికివాడ మొత్తం ఆర్కియాలజీ శాఖ పరిధిలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం చెరువు శిఖం భూములు, పురవస్తుశాఖ పరిధిలో ఉన్న స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడ ఇళ్లు నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించాల్సి ఉంది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు ఆర్నెళ్ల కిందటే ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆర్నెళ్లు గడుస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం చెరువుశిఖం, పురవస్తుశాఖ ఆధీనంలో ఉన్న స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతికి సంబంధించి స్థలమార్పిడిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో ఇళ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం లేదు. లక్ష్మీపురం ప్రాంతం స్థల మార్పిడి నిబంధనతో పని లేకుండానే ఇక్కడ ఇళ్లు నిర్మించవచ్చు. కానీ అంతర్గతరోడ్లు, పార్కులతో కూడిన లే అవుట్‌ను సిద్ధం చేసే క్రమంలో కొన్ని ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సేకరించాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది. ఈ మేరకు అదనపు నిధుల అవసరం ఏర్పడుతోంది. స్థలమార్పిడి, అదనపు నిధులతో ముడిపడి ఉన్న ఇళ్లపై ప్రభుత్వ పరంగా స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గడిచినా ఎనిమిది నెలలుగా వీటిపై ్రపభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.