ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు | Andhra Pradesh Govt Guidelines issued for allotment of housing plots | Sakshi
Sakshi News home page

ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు

Published Tue, Jan 28 2025 4:55 AM | Last Updated on Tue, Jan 28 2025 4:55 AM

Andhra Pradesh Govt Guidelines issued for allotment of housing plots

ఇళ్ల స్థలాల కేటాయింపునకు మార్గదర్శకాలు జారీ

గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు.. 

గతంలో కేటాయించిన స్థలాల్లో ఇల్లు కట్టుకోకపోతే రద్దు 

గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ.. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా ఎంపిక  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి కూటమి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, అర్బన్‌ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాన్ని మహిళల పేరుతో మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. అర్బన్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న చోట్ల మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేనిచోట ఏపీ టిడ్కో సహా, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు కేటాయించాలని సూచించింది. ఈ పట్టాలపై పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు దక్కేలా కన్వేయన్స్‌ డీడ్స్‌ ఇస్తా­మని తెలిపింది. 

జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇళ్ల స్థలం ఇవ్వాలని, కేటాయించిన రెండేళ్ల లోపు ఇల్లు కట్టుకోవాలని, ఆధార్‌ కార్డుతో పట్టాను లింకు చేయాలని స్పష్టం చేసింది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న బీపీఎల్‌ లబ్ధిదారులు, రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు లేదా స్థలం లేనివారు, గతంలో ఏ ప్రభుత్వ హౌసింగ్‌ స్కీం కిందకు రాని వారు, ఐదు ఎకరాలకు మించి మెట్ట వ్యవసాయ భూమి, 2.5 ఎకరాలకు మించి మాగాణి వ్యవసాయ భూమి, లేదా రెండు కలిపి 5 ఎకరాలకు మించని వ్యవసాయ భూమి లేని కుటుంబాలు ఇళ్ల స్థలాలకు అర్హులని స్పష్టం చేసింది. 

గతంలో ఇళ్ల పట్టా పొంది కోర్టు కేసుల వల్ల ఇల్లు పొందని వారికి దాన్ని రద్దు చేసి కొత్తగా పట్టా ఇవ్వవచ్చని పేర్కొంది. గతంలో ఇళ్ల పట్టా పొంది అక్కడ ఇల్లు కట్టుకోని వారికి పట్టాలు రద్దు చేసి తిరిగి మరొక చోట ఇవ్వాలని సూచించింది. ఇళ్ల స్థలాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించాలని, వాటిని వీఆర్వో, ఆర్‌ఐలు అర్హతలకు అనుగుణంగా విచారణ జరిపి జాబితాను తయారు చేసి అక్కడ అంటించాలని సూచించింది. లబి్ధదారుల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాలకు తహశీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా జిల్లా కలెక్టర్ల ఆమోదం తీసుకోవాలని పేర్కొంది. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూముల్ని జిల్లా కలెక్టర్లు గుర్తించాలని స్పష్టం చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement