సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి. చిత్రంలో పోచారం, ఈటల, జగదీశ్
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆలోచనలు చేస్తోంది. బుధవారమిక్కడ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మూడోరోజూ సమావేశమైన మంత్రుల సబ్ కమిటీ దాదాపు ఎనిమిది గంటల పాటు అనేక అంశాలపై చర్చించింది. కమిటీ సభ్యులు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్‌తోపాటు జగదీశ్వర్‌రెడ్డి చర్చలో పాల్గొన్నారు. అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను ఆపేసే అంశంపై సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోనూ సబ్ కమిటీ ప్రత్యేకంగా చర్చించింది. లే అవుట్‌కు అనుమతి ఉంటేనే ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంటే మంచిదని పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధికి ఎన్నారైల సహకారం
ప్రస్తుతం జిల్లా పరిషత్, మండల పరిషత్‌లో ఉన్నట్లుగానే పంచాయతీ పాలకవర్గ సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు కూడా సిట్టింగ్ ఫీజు ఇవ్వాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా వరుసగా మూడుసార్లు పాలకవర్గ సమావేశాలకు డుమ్మా కొడితే అనర్హత వేటు కూడా వేసే అంశంపైనా చర్చించారు. పంచాయతీల్లో కో–ఆప్షన్ సభ్యులను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్న సబ్ కమిటీ.. ఇందులో ఎన్నారైలకు, గ్రామంలో లేని వారికి కూడా అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చించారు. పంచాయతీ జనాభాను బట్టి ఇద్దరు, ముగ్గురిని కూడా నామినేట్ చేసుకునే అవకాశాలపై చర్చించారు.
గ్రామానికి చెందిన ఎన్నారైలు, గ్రామ మహిళ సమాఖ్య అధ్యక్షురాలు, నిపుణులకు అవకాశం కల్పించడం వల్ల గ్రామాభివృద్ధికి వారి సహకారం ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం 200 చదరపు గజాల లోపు విస్తీర్ణంలో జీ ప్లస్ 2 ఎత్తులో నిర్మించే భవనాల అనుమతులను గ్రామ పంచాయతీలో ఇస్తున్నారు. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో అయితే మండలాల్లో ఎంపీడీవో, తహసీల్డార్, ఈఓ పీఆర్డీ, పంచాయతీరాజ్ ఏఈల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి అనుమతించే అంశంపైనా చర్చించారు.
అలాగే భవన నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుమతిచ్చిన వారం రోజుల్లోనే పంచాయతీ క్లియరెన్స్ ఇవ్వాలని.. లేనిపక్షంలో అనుమతిచ్చినట్లుగానే భావించేలా చట్టంలో నిబంధనలు పొందుపర్చే అంశం కూడా సబ్ కమిటీలో చర్చకు వచ్చింది. సర్పంచ్‌లకు విస్తృత అధికారాలు కల్పించే దిశగా కొత్త చట్టంలో మార్పులు చేయాలని భావిస్తున్న సబ్ కమిటీ.. అదే సమయంలో ప్రజల కోసం ప్రత్యేకంగా హక్కుల జాబితాను కూడా చట్టంలో పొందుపర్చే యోచన చేస్తోంది. గురువారం కూడా సబ్ కమిటీ మరోసారి సమావేశం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment