Panchayati Raj Act
-
సర్పంచ్‌లకు సస్పెన్షన్ టెన్షన్!
సాక్షి, వరంగల్ రూరల్: గ్రామ సర్పంచ్‌లకు ‘సస్పెన్షన్’టెన్షన్ పట్టుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018–37(5) చట్టం ప్రకారం విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సర్పంచ్‌లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడంతో వారు దినదినగండంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, హరితహారం, పల్లెప్రకృతివనం పనుల్లో జాప్యం జరిగినా సస్పెండ్ చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పలానా సమస్య పరిష్కరించుకుండా సర్పంచ్ నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఫిర్యాదు చేసినా సరే వేటు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామాలుంటే 2,145 మంది సర్పంచ్‌లకు ఆయా జిల్లా కలెక్టర్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వరంగల్ రూరల్‌లో ముగ్గురు, నిర్మల్‌లో ఇద్దరు.. మొత్తం ఐదుగురిని విధుల నుంచి తొలగించారు. ఇలా 2021 మే వరకు రాష్ట్రవ్యాప్తంగా 139 మంది సర్పంచ్‌లు సస్పెండయ్యారు. ప్రత్యర్థి పార్టీ వారిపై.. ► వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామం సర్పంచ్ శ్రీధర్ది కాంగ్రెస్ పార్టీ. అధికార పార్టీకి చెందిన ఆ గ్రామ నేతలు ఊరిలో పారిశుధ్యం లోపించిందంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 2020 సెప్టెంబర్ 26న సస్పెండ్ చేశారు. అయితే ఇందుకు తగిన చర్యలు తీసుకుంటానని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి తిరిగి అక్టోబర్ 9న విధుల్లో చేరారు. ► నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సర్పంచ్ శారద కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఆమెపై గతేడాది నవంబర్ 3న సస్పెన్షన్ వేటుపడింది. నిధులు దుర్వినియోగం చేశారని, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేశారంటూ అధికార పార్టీకి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లు ఆమెపై ఫిర్యాదు చేయగా, కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆమె కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తే వారం తర్వాత సస్పెన్షన్ ఎత్తేశారు. ఆధిపత్య పోరు.. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ సర్పంచ్ వరలక్ష్మిపై సస్పెన్షన్ వేటు పడింది. నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ గ్రామస్తులు కొందరు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన అనంతరం అధికారులు సస్పెండ్ చేశారు. అధికార పార్టీ అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు వర్గం కావడంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులు అధికారులపై ఒత్తిడి తేవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ దుమారం చెలరేగడంతో రెండు నెలల తర్వాత ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఏ జిల్లాలో ఎందరు సస్పెండయ్యారంటే.. వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 8, ములుగు 3, జనగాం 3, మహబూబాబాద్ 2, కరీంనగర్ ఒకటి, జగిత్యాల 7, మంచిర్యాల 7, ఖమ్మం 9, భద్రాద్రి కొత్తగూడెం 4, నిజామాబాద్ 4, కామారెడ్డి 11, మెదక్ 5, సంగారెడ్డి 8, రాజన్న సిరిసిల్లా 2, జోగుళాంబ గద్వాల 5, నాగర్ కర్నూలు 6, వనపర్తి 2, నల్లగొండ 12, సూర్యాపేట 1, ఆదిలాబాద్ ఒకటి, మేడ్చల్ మల్కాజ్గిరి 1, రంగారెడ్డి 19, వికారాబాద్ 1, యాదాద్రి భువనగిరి 7. కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నా కూడా.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామ సర్పంచ్ చిలుక లింగయ్య వైకుంఠ ధామం నిర్మాణపనులు చేయకపోవడంతో తొలుత షోకాజ్ నోటీసు ఇచ్చారు. సమాధానం సంతృప్తికరంగా లేదని కలెక్టర్ సస్పెండ్ చేశారు. చిలుక లింగయ్య హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా ఇంకా అధికారుల నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఉప సర్పంచ్ చిరంజీవి సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సస్పెన్షన్‌కు గురైన చిలుక లింగయ్య మండలంలో బీజేపీకి చెందిన సర్పంచ్ కావడం గమనార్హం. సబ్‌స్టేషన్ కోసం స్థలం అడిగితే సస్పెండ్ చేస్తారా? మా గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ కోసం స్థలం కేటాయించలేదని నాలుగో విడత పల్లెప్రగతి తొలిరోజు గ్రామసభను పాలకవర్గమంతా బహిష్కరించాం. దీంతో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 2021 జూలై 15న కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే ఊరి బాగు కోసం నేను ఈ విషయాన్ని లేవనెత్తితే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమో కలెక్టర్ ఆలోచించుకోవాలి. - ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్ పెద్దకోడెపాక, వరంగల్ రూరల్ జిల్లా గవర్నర్ జోక్యం చేసుకోవాలి చాలా జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రుల జోక్యంతో చిన్నచిన్న కారణాలకే ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. పంచాయతీ నిధుల దుర్వినియోగం, స్వ లాభానికి అధికార దుర్వినియోగం వంటి వాటికే సస్పెండ్ చేసే చేసేలా చట్టాన్ని సవరణ చేయాలి. ట్రిబ్యునల్‌లో అప్పీల్ ఫీజు రూ.25 వేల నుంచి రూ.100కి తగ్గించాలి. ఈ చట్ట సవరణ జరిగే వరకు చిన్న చిన్న కారణాలతో సర్పంచ్‌లను సస్పెండ్ చేయవద్దని సంబంధిత అధికారులకు తెలపాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు గ్రామ సభను బహిష్కరించిన పెద్దకొడెపాక గ్రామ సర్పంచ్‌ను సస్పెండ్ చేయడం సరికాదు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతి పత్రం కూడా ఇచ్చాం. – ఎం.పద్మనాభరెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి -
‘ఐక్యత’తోనే ప్రగతి
సాక్షి, అమరావతి: రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఐకమత్యంగా ఉండటం ద్వారా గ్రామాలు ప్రగతి బాట పట్టాలని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష, ఆశయం. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కలలుగన్న జాతిపిత మహాత్మాగాంధీ కూడా ఇదే కోరుకున్నారు. గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యతాభావంతో కలసి, మెలసి పరస్పర సుహృద్భావ వాతావరణంలో గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని, స్వపరిపాలన సాగించుకోవాలని రాజ్యాంగ నిర్మాతలు కూడా సూచించారు. ఈ లక్ష్యంతోనే గాంధీజీ సొంత రాష్ట్రమైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల ఎన్నికలను పార్టీ రహితంగా నిర్వహించేలా పంచాయతీరాజ్ చట్టంలో నిబంధన పెట్టాయి. రాజకీయ పార్టీల వారీగా గ్రామాల్లో వర్గాలు ఏర్పడితే మనస్పర్థలు వస్తాయని, గ్రామ ప్రగతిపై ఇవి దుష్ప్రభావం చూపుతాయన్న ఆలోచనతోనే పార్టీ రహిత ఎన్నికలకు బీజం వేశాయి. స్వపరిపాలనే గ్రామ పంచాయతీల లక్ష్యమైనందున గ్రామంలోని వారంతా ఐకమత్యంగా ఉండి అభివృద్ధి ప్రణాళికలు వేసుకోవడం ద్వారా అనూహ్య ప్రగతి సాధించాలన్నదే దీని వెనుక ఉద్దేశమన్నది అందరికీ తెలిసిన అంశమే. అందుకే ప్రోత్సాహకాలు – గ్రామంలో కలసి మెలసి ఉన్న వారు ఎన్నికల్లో పరస్పరం పోటీ పడినప్పుడు మనస్పర్థలకు, వివాదాలకు దారితీసిన ఉదంతాలు కోకొల్లలు. పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణల వల్ల కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వర్గాలు, ఘర్షణలు పల్లెల ప్రగతికి ప్రతిబంధకంగా మారతాయన్నది నిర్వివాదాంశం. – అందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రజల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలు, పరస్పర సహకార భావాలు విరాజిల్లాలని బలంగా కోరుకుంటోంది. గ్రామ ప్రజలంతా పరస్పర సహకారంతో, సోదర భావంతో మెలగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. – ఐకమత్యంతో సర్పంచి, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్న గ్రామాలను ఉత్తమ/ ఆదర్శ పంచాయతీలుగా గుర్తించి పోత్రాహకాలు అందించే పథనికి ఈ ఉదాత్త ఆశయంతోనే శ్రీకారం చుట్టింది. – పోటీ లేకుండా ఏకగ్రీవ పంచాయతీ చేసుకుంటే ప్రభుత్వం అందించే ప్రోత్సాహక మొత్తంతో గ్రామంలో ఏమైనా అభివృద్ధి పనులు చేసుకోవచ్చనే ఆశ కల్పించాలన్నదే దీని ఉద్దేశం. – ఆదర్శ పంచాయతీలకు పోత్సాహకాలు అందించడం ద్వారా గ్రామాలను కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇది ప్రతిఒక్కరూ ప్రశంసించే అంశమే. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. – ఏకగ్రీవ చాయతీలకు నజరానా అందించే విధానం దశాబ్దాలుగా అమల్లో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రత్యేకించి పార్టీ రహిత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోతహించడం అన్నివిధాలా మంచిదేనని అన్ని రంగాల నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికలతోనే గ్రామ స్వరాజ్యం మన పరిపాలన వ్యవస్థలో పరిమాణపరంగా గ్రామ పంచాయతీలు చిన్నవి. కానీ అభివృద్ధికి అత్యంత కీలకమైనవి. అటువంటి పంచాయతీల్లో ప్రజలు వర్గ విభేదాలకు అవకాశం లేకుండా సమైక్యంగా ఉంటేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోగలం. గ్రామ స్వరాజ్యం, అందరి సంక్షేమాన్ని సామరస్యంగా సాధించేందుకు పంచాయతీ ఎన్నికలను ఏకగీవ్రం చేసుకోవడం ఉత్తమ మార్గం. – ప్రొ.ఆర్జీబీ భగవత్ కుమార్, రిటైర్డ్ వీసీ, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, విశాఖపట్నం గ్రామాభ్యుదయం సుసాధ్యం పంచాతీయలకు ఏకగ్రీవ ఎన్నికలతోనే గ్రామాభ్యుదయం సుసాధ్యమవుతుంది. గ్రామాల్లో ప్రజలు అంతా ఒకే కుటుంబం అనే భావనతో పంచాయతీ ఎన్నికల్లో ఏకతాటిపైకి రావాలి. అనవసరమైన పంతాలు, పోటీలు విడిచిపెట్టి గ్రామ అభివృద్ధి కోసం ఏకాభిప్రాయానికి రావాలి. అందరం బాగుండాలి.. తమ గ్రామాలు అభివృద్ధి చెందాలి.. అనే లక్ష్య సాధనకు ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడం దోహదపడుతుంది. ఇందుకోసం నియోజకవర్గ స్థాయి నేతలు కూడా చొరవ తీసుకుని, గ్రామాల్లోని నేతలను ఏకతాటిపైకి తీసుకురావాలి. – హెచ్.లజపతిరాయ్, మాజీ వీసీ, బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం. -
అందుకే చట్టాన్ని సవరించాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే కీలక సవరణలు చేశామని ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు 14 రోజుల లోపు, ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికలు 10 రోజులు లోపు నిర్వహించాలని సవరణలు చేశామని వెల్లడించారు. గ్రామ సర్పంచ్ స్థానికంగా నివాసం ఉండాలని, దీనివల్ల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టొచ్చునని అన్నారు. చట్ట సవరణలను ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం వెల్లడించారు. గ్రామ సభలు సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా ఉన్నా, పంచాయతీ ఆడిట్ సకాలంలో నిర్వహించక పోయినా బాధ్యులను తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో అన్ని సీట్లు ఎస్టీలకే రిజర్వేషన్లు చేస్తూ చట్ట సవరణలు తీసుకు వచ్చామని తెలిపారు. నల్ల చొక్కాలు వేసుకుని సభకు రాలేదు వార్షిక బడ్జెట్లో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 200 కోట్లు కేటాయించడం పట్ల డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుల తరుపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులపై ప్రభుత్వంపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుటామని అన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారని, నలుపు చొక్కాలు వేసుకొని సభకు రాకుండావెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే
-
నెలలో పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని, స్థానిక సంస్థల ఎన్నికలు 14వ ఆర్థిక సంఘం నిధులతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిధులు రావాలంటే ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘స్పందన’పై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారని, అనంతరం ఎన్నికల తేదీలు ఖరారవుతాయని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే ‘పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ విప్లవాత్మక మార్పుల కోసం ఆర్డినెన్స్ తెచ్చాం. అవినీతిని నిర్మూలించడంతో పాటు మద్యం, డబ్బుల పంపిణీని ఎన్నికల వ్యవస్థ నుంచి పూర్తిగా, శాశ్వతంగా తీసేయాలనే దృఢ సంకల్పంతోనే ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. ఈ ఆర్డినెన్స్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతి పోలీసు అధికారి చిత్తశుద్ధితో పని చేయాలి. డబ్బులు పంచినట్లు ఎన్నికల తర్వాత నిర్ధారణ అయినా, బాధ్యులపై అనర్హత వేటు పడుతుంది. మూడేళ్ల పాటు జైలుకు పంపుతాం. ఎక్కడా కూడా డబ్బులు, మద్యం పంపిణీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదనేది చాలా ప్రాధాన్యమైన అంశం. ఒక్క గ్రామంలో కూడా డబ్బులు, మద్యం పంపిణీ చేసి.. ఎన్నికలు నిర్వహించారనే మాట వినిపించ కూడదు. ఈ రెండు అంశాలపై పోలీసు యంత్రాంగం చాలా దృఢంగా పని చేయాలి. దీన్ని చాలెంజ్‌గా తీసుకోవాలి. ఎస్పీలు కీలకంగా వ్యవహరించాలి ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి రూ.కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడం కాదు.. ఊరిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి, వారికి సేవ చేసే మంచి వ్యక్తులు గెలిచే అవకాశం సృష్టించడానికే ఈ ఆర్డినెన్స్ తీసుకు వచ్చాం. ఈ మార్పులు కనిపించే విధంగా ఎస్పీలందరూ పని చేయాలి. డబ్బులు, మద్యాన్ని అరికట్టడంలో ఎస్పీలు కీలకంగా వ్యవహరించాలి. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్రలను, గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇలా చేద్దాం.. – మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి. – సాధారణ ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్ ఉపయోగించిన తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒక యాప్ అందుబాటులో ఉంచాలి. – గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రలు, గ్రామ సచివాలయంలో ఉండే మహిళా పోలీసులు, గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద, ప్రజల వద్ద ఈ యాప్ ఉండాలి. – ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఈ యాప్‌లో నమోదు కావాలి. – ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులకు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరాలి. – ఎవరైనా తప్పులు చేస్తే అనర్హత వేటు వేయడంతో పాటు జైలుకు పంపాలి. – ఈ అంశాలతో ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ప్రతిని గ్రామ సచివాలయాలన్నింటిలో ప్రదర్శించాలి. ఇలా చేద్దాం.. అధికారులతో సీఎం - మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి. - సాధారణ ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్ ఉపయోగించిన తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒక యాప్ అందుబాటులో ఉంచాలి. - గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రలు, గ్రామ సచివాలయంలో ఉండే మహిళా పోలీసులు, గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద, ప్రజల వద్ద ఈ యాప్ ఉండాలి. - ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఈ యాప్‌లో నమోదు కావాలి. - ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులకు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరాలి. - ఎవరైనా తప్పులు చేస్తే అనర్హత వేటు వేయడంతో పాటు జైలుకు పంపాలి. - ఈ అంశాలతో ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ప్రతిని గ్రామ సచివాలయాలన్నింటిలో ప్రదర్శించాలి. -
రిజర్వేషన్లు 50% మించొద్దు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను రద్దు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించ వచ్చని చెప్పింది. (చదవండి: టీడీపీ.. బీసీ వ్యతిరేకి) ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 176, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 6న తీర్పును వాయిదా వేసింది. తీర్పు వెలువరించే దశలో పలు సందేహాలు రావడంతో వాటి నివృత్తి కోసం అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలను విన్న ధర్మాసనం తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది. అసాధారణ పరిస్థితుల్లో 50 శాతం దాటొచ్చు రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం తెలిపింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 50 శాతం దాటొచ్చునని ఇందిరా సహాని, రాకేష్ కుమార్ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9 (1ఏ), 15(2), 152(1ఏ), 153(2ఏ), 180(1ఏ), 181(2)(బీ)ల గురించి ధర్మాసనం తన తీర్పులో సవివరంగా చర్చించింది. ఈ సెక్షన్ల వల్ల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని, అది చెల్లదని తీర్పులో పేర్కొంది. (చదవండి: బడుగుల ద్రోహి చంద్రబాబు) బీసీలకు 34 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలని చెబుతున్న పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9 (1ఏ) చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ తీర్పునకు అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను నేటి నుంచి నెలలోపు తిరిగి ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే స్థానిక సంస్థల కాల పరిమితి ముగిసి ఏడాదిన్నర అవుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు.. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, మార్చి 3 కల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తామంటూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన కౌంటర్ గురించి ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. కాగా, ఈ తీర్పుపై బీసీ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. (చదవండి: చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..) -
గ్రామసభ నిర్వహించకుంటే సర్పంచి పదవి పోయినట్లే!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల పాలనలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ పాలనలో ప్రధానమైన గ్రామ సభలను క్రమం తప్పకుండా నిర్వహించకుంటే సంబంధిత సర్పంచి పదవి ఆటోమేటిక్‌గా రద్దు అయ్యేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయాలని బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. గ్రామ సభలంటే ఊరి అభివృద్ధి, నిధుల ఖర్చు తదితర వ్యవహారాలపై స్థానిక ప్రజలంతా ఒకచోట కూర్చొని చర్చించి నిర్ణయాలు తీసుకోవడం. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామసభల నిర్వహణ అంశాన్ని ప్రస్తావించారు. పంచాయతీరాజ్ చట్టంలోనూ గ్రామసభలు నిర్వహించాలన్న నిబంధనలున్నాయి. ఏటా నాలుగు విడతల పాటు వీటిని నిర్వహించాల్సి ఉన్నా తూతూ మంత్రంగా లేదంటే అసలు సమావేశాలే పెట్టకపోవడమో జరుగుతోంది. పంచాయతీలకు సంబంధించి క్యాబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇవీ.. - అమలులో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం సర్పంచి పదవులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మహిళలు ఎక్కువ సంఖ్యలో ఎన్నికయ్యే అవకాశం ఉన్నందున ఎక్కడైనా వారి నిరక్షరాస్యతను అడ్డు పెట్టుకుని ఉద్యోగులు తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు. - గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణలో సర్పంచికి మరిన్ని అధికారాలు అప్పగించేలా పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆమోదం. - సర్పంచ్ సంబంధిత గ్రామంలోనే నివాసం ఉండాలి. గ్రామ పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావాలనే నిబంధనకు ఆమోదం. - క్యాబినెట్ తాజా నిర్ణయం మేరకు షెడ్యూల్ ఏరియాలోని 24 మండలాల్లో జడ్పీటీసీ పదవులన్నీ గిరిజనులకే రిజర్వ్ కానున్నాయి. - నాన్ షెడ్యూల్ ఏరియాలో 100% గిరిజన జనాభా ఉన్న గిరిజన పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులన్నీ వారికే రిజర్వు. - పంచాయతీ ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీ లాంటి అనైతిక చర్యలకు పాల్పడితే సదరు వ్యక్తులు గెలిచినా ఆయా పదవుల్లో కొనసాగేందుకు అనర్హులుగా పరిగణిస్తారు. - ప్రస్తుతం సుదీర్ఘంగా అనుసరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 18 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 13 రోజుల్లో పూర్తి చేస్తారు. - ఓటర్లను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభాలకు గురి చేయడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధింపు. -
పవర్ఫుల్ సర్పంచ్
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ దిశగా సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పచ్చదనం, పారిశుధ్యాన్ని పెంపొందించే బాధ్యతలను వారికే అప్పగించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కట్టబెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. అత్యవసర సమయాల్లో సర్పంచులు తీసుకున్న నిర్ణయాలను తదుపరి పంచాయతీ సమావేశాల్లో ఆమోదం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారని తెలిపారు. సర్పంచులు ఆయా గ్రామాల్లోనే నివాసం ఉండాలని తీర్మానించారన్నారు. ఇందుకు అనుగుణంగా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. అవినీతికి పాల్పడితే వేటే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువైన వారిపై అనర్హత వేటుతోపాటు మూడేళ్లు జైలు శిక్ష విధించేందుకు వీలుగా చట్టంలో సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. అవినీతికి పాల్పడ్డారని గెలిచిన తర్వాత రుజువైతే కూడా అలాంటి వారిపై అనర్హత వేటు పడుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కువ కాలం ఉంటే అధిక ధన వ్యయం, మద్య ప్రవాహానికి ఆస్కారం ఉంటుందని.. కాలపరిమితిని 13 రోజులకు కుదించాలని నిర్ణయించిందన్నారు. గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను పూర్తిగా ఆ వర్గాల వారికే కేటాయిస్తారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఉన్న 24 రోజుల కాలపరిమితిని 15 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్ చట్ట సవరణకు కేబినెట్ అంగీకరించిందన్నారు. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకూ వర్తింప చేస్తారన్నారు. మండలి నిర్ణయాలను మంత్రి ఇంకా ఇలా వివరించారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కౌన్సిల్ ఏర్పాటు రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కౌన్సిల్ ఏర్పాటు. వ్యవసాయ, ఉద్యానవన విద్యా సంస్థలను పర్యవేక్షించడంతోపాటు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. నియమ నిబంధనలు పాటించే కళాశాలలకు ఈ సంస్థ గుర్తింపు ఇస్తుంది. నకిలీ సర్టిఫికెట్ల నిరోధంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది. వ్యవసాయ రంగంలో ఉత్తమ పద్ధతులకు మరింత తోడ్పాటు అందిస్తుంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, ఎగుమతుల ప్రోత్సాహం వంటి విధానాలకు ఈ కౌన్సిల్ ఒక రెగ్యులేటర్‌గా పని చేయనుంది. వ్యవసాయ, ఉద్యానవన విద్యపై నియంత్రణ, పర్యవేక్షణ, ఉత్తమ విద్యను అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ సంస్థలకు పబ్లిక్, ప్రవేట్ విభాగాల్లో పనితీరు మెరుగు పరిచేందుకు కృషి చేస్తుంది. పండ్లు, పూల తోటలకు ఇచ్చే పరిహారం పెంపు రాష్ట్రంలో భూ సేకరణతోపాటు, నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో పండ్ల తోటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దానివల్ల మామిడి, కొబ్బరి, నిమ్మ తదితర పంటలకు ఇచ్చే పరిహారం పెరుగుతుంది. ఇందులో భాగంగా గతంలో రూ.2,600 మాత్రమే ఉన్న మామిడి పరిహారం రూ.7,283కు పెంపు. కొబ్బరి చెట్టుకు రూ.6,090కి పరిహారం పెంపు. గతంలో ఈ మొత్తం కేవలం రూ.2149గా ఉండేది. నిమ్మ పంటకు పరిహారం రూ.1,444 నుంచి రూ.3,210కి పెంపు. మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు పెరుగుతున్న ఖర్చులతో పాటు నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో పండ్ల తోటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు రాష్ట్రంలో 10 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సొంతంగా ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఏపీ జెన్కోకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందించడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.10 వేల కోట్ల భారం పడుతోంది. దీనికితోడు ఏటా సుమారు 50 వేల కొత్త వ్యవసాయ పంపుసెట్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇందుకోసం ఏటా 45 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది. రానున్న రోజుల్లో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను, ఆక్వా రైతులకు సబ్సిడీపై నిరంతరం విద్యుత్‌ను అందించించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా 10 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా దాని ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మెగావాట్‌కు రూ.20 లక్షల వంతున కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తున్న నేపథ్యంలో ఆ వెసులుబాటును వినియోగించుకోనుంది. ఈ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌కు సీఎండీ సహా మరో 18 పోస్టులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిడెట్ ఏర్పాటు రాష్ట్రంలో వివిధ శాఖల వద్ద ఉన్న మిగులు నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పేరుతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్లో 1992లో ఇలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అది మంచి ఫలితాలు ఇస్తున్నట్లు అధికారులు మంత్రివర్గానికి వివరించారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ఆ సెక్షన్లు.. రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌ల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ చట్టం 9, 15, 152, 153, 180, 181 సెక్షన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సెక్షన్లను రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ప్రకటించి కొట్టివేయాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జారీ చేసిన జీవో 176ని కూడా ప్రతాప్‌రెడ్డి సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరపనుంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సైతం విరుద్ధమని ప్రతాప్‌రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యను అడ్డుకోకుంటే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. తొలుత జనాభా గణన చేపట్టాలి... పంచాయతీరాజ్ చట్టంలోని 9, 15, 152, 153, 180, 181 సెక్షన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన ఖరారు చేశారో తెలియచేయడం లేదన్నారు. ఎటువంటి శాస్త్రీయ సర్వే చేయకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేసిందన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పోలిస్తే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరి కాదని, ఇదే విషయాన్ని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయన్నారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పన ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లోనే రిజర్వేషన్లు 50% దాటవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. బీసీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే తొలుత జనాభా గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసర విచారణకు నిరాకరణ ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది మంగళవారం ఉదయం సీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం బుధవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇదే రీతిలో జీవో 176ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అత్యంత కీలకమైన రిజర్వేషన్లను సైతం ఖరారు చేసింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనమే లక్ష్యంగా సర్కారు పని చేస్తుందని చెప్పారు. మంత్రి నాని వివరించిన మంత్రివర్గ నిర్ణయాలు ఇలా.. ►2011 జనాభా గణన ఆధారంగా బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీలకు 6.77 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల దామాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం– 1994 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. ►ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి చేరవేసి, మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రాణాలు కాపాడాలనే ఉన్నతాశయంతో నాడు దేశంలో ప్రప్రథమంగా దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు గత అయిదేళ్లలో దారుణంగా తయారయ్యాయి. నిర్వహణ బాగోలేక వాహనాలకు కాలం చెల్లింది. జీతాల్లేక డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లడం వల్ల గత అయిదేళ్లలో ఎందరో చనిపోయారు. ఈ నేపథ్యంలో 412 సరికొత్త 108 సర్వీసు వాహనాలను వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా రూ.71.48 కోట్లతో కొనుగోలు చేయాలి. ►ఆరోగ్య పరీక్షలు నిర్వహించే 104 సర్వీసుల కోసం 656 వాహనాలను రవాణా వ్యయంతో కలిపి మొత్తం రూ.60.51 కోట్లతో మార్చి ఆఖరులోగా కొనుగోలు చేయాలి. ►కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో 6.04 ఎకరాలు కేటాయింపు. మార్కెట్ విలువ ఎకరా రూ.43 లక్షలు ఉన్నప్పటికీ ఎకరా రూ.లక్షకే కేటాయించాలని నిర్ణయం. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు బదలాయించేందుకు ఆమోదం. ►మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్ నిర్మాణ సంస్థకు అప్పగిస్తూ ఇన్‌క్యాబ్ సీఎండీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించడం కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు అనుమతి. ►రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న కృష్ణపట్నం సముద్ర ముఖపరిధిని కుదించాలని నిర్ణయం. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు కొత్త పాలసీ రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులు, 150 ఉప మార్కెట్ యార్డులు.. మొత్తం 341 చోట్ల వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేవలం కోతల సమయంలోనో, వ్యవసాయ ఉత్పత్తులు చేతికొచ్చే సమయంలోనే కాకుండా 365 రోజులూ ఇవి పనిచేసేలా నూతన విధానం అమలవుతుంది. పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్య (కొర్ర, అండుకొర్ర, అరిక, వరిగ, ఊద, సామలు) పంటలకు నేటికీ కనీస మద్దతు ధర కరువైన తరుణంలో ఏటా సాగు సీజన్‌కు ముందే వీటికి కనీస మద్దతు ధరలను ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది క్వింటాలు మిర్చికి రూ.7 వేలు, పసుపు రూ.6,350, ఉల్లి (కనీసం) రూ.780, చిరుధాన్యాలకు రూ.2,500గా కనీస మద్దతు ధర ఖరారు చేసింది. టమాటా, చీని, అరటి, నిమ్మ పంటలకు మద్దతు ధర ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటన్నింటికీ విధి విధానాలు ఖరారు చేయాలంటూ వ్యవసాయ మార్కెట్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. -
జాయింట్ చెక్ పవరొద్దు..
సాక్షి, నేలకొండపల్లి : ప్రభుత్వం ఇటీవల సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కలిపి జాయింట్ చెక్ పవర్ కల్పించడాన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు వ్యతిరేకిస్తున్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి కలిపి చెక్ పవర్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని సర్పంచ్‌లు ఆందోళన బాటకు సిద్ధమయ్యారు. గత ఐదు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆమోదంతో గెలిచిన సర్పంచ్‌లు చెక్‌పవర్ కోసం నెలల తరబడి ఎదురుచూశారు. గ్రామాలను అభివృద్ధి చేయాల నే సంకల్పంతో సర్పంచ్‌లు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం జీవోఎంఎస్ నంబర్ 38ని ప్రవేశపెట్టింది. అందులో సర్పంచ్–ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఈ నెల 15న జీఓ విడుదల చేశారు. ఉప సర్పంచ్‌తో కలిపి సంయుక్తంగా చెక్ పవర్ కల్పించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని సర్పంచ్‌లు అంటున్నారు. రాజకీయంగా సర్పంచ్ ఒక పార్టీ, ఉప సర్పంచ్ మరో పార్టీ నుంచి గెలుపొందిన చోట్ల..ఐక్యత ఉండదని చెబుతున్నారు. పాలకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని కుంటుపరిచేందుకు వీలు ఉందని ఇంకొందరు భావిస్తున్నారు. దీంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. రాజకీయ గొడవలకు కూడా ఆస్కారం ఉండే ప్రమాదం ఉంది. జీఓ 38ని రద్దు చేయాలనే డిమాండ్‌తో సర్పంచ్‌లు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 21న మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. సర్పంచ్–పంచాయతీ కార్యదర్శికి చెక్‌పవర్ అప్పగించాలని కోరుతున్నారు. జాయిం ట్ చెక్‌పవర్ విషయంలో పునారాలోచించాలని, అలాగే..కనీస గౌరవ వేతనం పెంచాలని సర్పంచ్ లు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు దశల వారీ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ల ప్రధాన డిమాండ్లు ఇలా.. ⇒ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలి ⇒ జాయింట్ చెక్ పవర్లో ఉపసర్పంచ్‌కు ప్రాధాన్యం వద్దు ⇒ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు వెంటనే రూ.15 లక్షలు ఇవ్వాలి ⇒ సర్పంచ్‌లకు గౌరవ వేతనం రూ.20 వేలు ఇవ్వాలి ⇒ 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి -
వారంలోనే పరిషత్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్.. మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలో ఈ మేరకు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో వారంలో రోజుల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. వెంటనే జెడ్పీపీ, ఎంపీపీ ఎన్నికలు సైతం పూర్తి కానున్నాయి. జూన్ 10లోపే ఫలితాల వెల్లడి, పరోక్ష ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే ఈ విషయంలో అధికారిక తేదీలు ప్రకటించనుంది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 14తో ముగిశాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈనెల 27న నిర్వహించాలని ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించింది. ఆర్డినెన్స్‌లో పలు మార్పులు.. ఎన్నికల సంఘం ప్రతిపాదనల మేరకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ‘మొదటి సమావేశం’ అనే పదానికి బదులుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ‘ప్రత్యేక సమావేశం’అనే మార్పు చేసింది. పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న మొదటి సమావేశం అంటే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిచిన వారు మొదటిసారి సమావేశమై ఎంపీపీ, జెడ్పీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను, కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాలి. వెంటనే కొత్తగా ఎన్ని కైన వారి పదవీకాలం మొదలవుతుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం జూలై 4 వరకు ఉన్నందున ఆ తర్వాతే మొదటి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. మొదటి సమావేశం అనే పదాన్ని ‘ప్రత్యేక సమావేశం’ అని చట్టంలో సవరణ చేయడంతో జూలై 4 వరకు వేచి చూడకుండా ఆలోపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను వెల్లడించవచ్చు. ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికలను వెంటనే చేపట్టొచ్చు. చట్టంలో సవరణ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం జూలై 3 వరకు ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాలు బాధ్యతలు చేప ట్టాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రస్తుత ఉమ్మడి జిల్లా ల్లోని 8 జెడ్పీపీల పాలకవర్గాల పదవీకాలం జూలై 4 తో ముగుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జెడ్పీ పాలకవర్గం పదవీకాలం ఆగస్టు 6 వరకు ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ పరిధిలో ప్రస్తుతం ఖమ్మం, కొత్తగూ డెం జెడ్పీలు ఏర్పాటవుతున్నాయి. ఈ జెడ్పీపీల పదవీకాలం ఆగస్టు 7 నుంచి మొదలుకానుంది. జూలై 3న లెక్కింపు... జిల్లాపరిషత్, మండల పరిషత్ ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 4న ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాతే జెడ్పీపీ, ఎంపీపీ పదవులకు పరోక్ష ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలకు జెడ్పీపీ, ఎంపీపీ ఎన్నికలకు మధ్య ఎక్కువ రోజులు ఉండటం వల్ల పరోక్ష ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారని, ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును జూలై 3న చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు. అయితే పాఠశాలలు, విద్యా సంస్థలలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. జూన్ మొదటివారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఓట్ల లెక్కింపును వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును, పరోక్ష ఎన్నికలను త్వరగా పూర్తి చేసేలా ఎన్నికల సంఘం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదననలు పంపింది. -
డుమ్మా కొడితే పదవులకు గండమే!
సాక్షి, హైదరాబాద్: జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్లు మొదలుకొని ఎంపీటీసీ సభ్యుల వరకు అధికారాలతోపాటు విధులు, బాధ్యతలను కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం నిర్దేశించింది. కొత్త సభ్యులు విధులు సక్రమంగా నిర్వహించేలా చట్టంలో ఆయా అంశాలను పొందుపర్చారు. పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టమైన నిబంధనలను విధించారు. మూడు విడతల్లో జరగనున్న పరిషత్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఎన్నికయ్యే జిల్లా, మండల పరిషత్ సభ్యులకు కొత్త చట్టం ప్రకారం వివిధ నిబంధనలు అమల్లోకి రానుండడంతో వాటికి ప్రాధాన్యం ఏర్పడింది. మండలాధ్యక్షుల బాధ్యతలు... కొత్తచట్టంలో ఎంపీపీ అధ్యక్షులపై మరిన్ని బాధ్యతలను పెట్టారు. నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలతో పాటు కొన్ని పరిమితులు కూడా విధించింది. మండల ప్రజా పరిషత్ తీర్మానాలను అమలు చేసేలా ఎంపీడీవోలపై పరిపాలనాపరమైన నియంత్రణాధికారాన్ని ఉపయోగించే అవకాశం ఎంపీపీలకు కల్పించారు. సర్వసభ్య సమావేశాలకు అధ్యక్షత వహించడం, ప్రజా పరిషత్ రికార్డుల పర్యవేక్షణపై పూర్తి హక్కులు కల్పించారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, అంటు వ్యాధులు ప్రబలడం, తాగునీటి సరఫరా నిలిచిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షులు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సంబంధిత అధికారులు, ఎంపీడీవోలతో చర్చించి, ప్రజల సేవ, భద్రత నిమిత్తం అత్యవసర పనుల నిర్వహణకుగాను ఎంపీపీలకు అధికారాలిచ్చారు. అత్యవసర పనులు నిర్వహించాక, వాటిని సర్వసభ్య సమావేశాల్లో మండల పరిషత్‌కు తప్పనిసరిగా సమర్పించాలి. అయితే, ప్రభుత్వ నిబంధనలు, ఉత్తర్వులను ఉల్లంఘించే నిర్మాణపు పనులు, ఇతర పనుల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం, ఆదేశాలిచ్చే విషయంలో ఎంపీపీలపై ఆంక్షలు విధించారు. 15 రోజులు రాకుంటే... జడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు వరసగా 15 రోజులపాటు జడ్పీ, మండల కార్యాలయానికి రాకపోతే వారిని విధుల్లోంచి తప్పించే నిబంధన విధించారు. ఆ విధంగా విధులకు హాజరుకాని జడ్పీ చైర్పర్సన్ స్థానంలో వైస్చైర్మన్లకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు 15 రోజులు వరుసగా ఆఫీసులకు రాకపోతే సంబంధిత ఎంపీడీవోలు ఆ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపీపీల పరిధిలో జరిగే పనుల్లో నిర్లక్ష్యం, ఆస్తుల నష్టం వంటి అంశాలపై సంబంధిత అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులపైనే ఉంటుంది. ఈ విషయంలో వారు ప్రత్యక్షంగా చర్యలు తీసుకునే అధికారం లేదు. మండల పరిషత్‌కు వచ్చిన నిధులన్నీ పరిషత్ నిధిగా ఏర్పాటు చేసి, అందరి ఆమోదంతో వినియోగించాలి. వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాలోనే జమ చేయాలి. ఉద్యోగ భద్రత పథకం, ఇతర వేతనాలు, ఉపాధి నిధులను జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో జమ చేసేలా కొత్త పీఆర్ చట్టం నిబంధనల్లో పొందుపరిచారు. పెరిగిన ఎంపీటీసీల భాగస్వామ్యం... గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీల భాగస్వామ్యం పెరగనుంది. ప్రతి ఐదేళ్లకు గ్రామ పంచాయతీ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక, వార్షిక ప్రణాళికను ఎంపీటీసీ సభ్యులు ఆమోదించాలి. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల్లో స్వయం సహాయçస్ఫూర్తిని, చొరవను పెంపొందించడం, జీవన ప్రమాణాలు పెంచడంలో పరిషత్ సభ్యులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల పన్నువిధానాల్లో మార్పులు తీసుకువచ్చే అధికారం పరిషత్ సభ్యులకు కల్పించారు. మండలం, జిల్లా, ఇతర విధానాల ద్వారా గ్రామ పంచాయతీలకు అందే నిధులతోపాటు నేరుగా గ్రామపంచాయతీ పన్నులను వసూలు చేసే బాధ్యతలను పరిషత్ సభ్యులకు అప్పగిస్తారు. భూమి సెస్సు, స్థానిక సెస్సులను గరిష్ట పరిమితికి లోబడి, సర్‌చార్జ్ రూపంలో పన్నులను విధించే అధికారం పరిషత్ సభ్యులకు ఉంటుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పంచాయతీ కార్మిక బడ్జెట్ ప్రణాళికలను ఆమోదించడం, పనుల పర్యవేక్షణ ఇకపై ఎంపీటీసీ సభ్యులు నిర్వహించవచ్చు. వయోజన విద్య కార్యక్రమాల పర్యవేక్షణ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ కార్యకలాపాల అమలు, స్వయం సహాయక బృందాలతో స్వయం ఉపాధి, జీవనోపాధి పథకాలు, బ్యాంకులతో అనుసంధానం వంటి వాటిని పరిషత్ సభ్యులే నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్వహించే అధికారం పరిషత్ సభ్యులకు కల్పించారు. ఇందు కోసం ఏదైనా సంస్థతో నిర్వహణ ఒప్పందం, నిర్మాణ పనుల అమలు, నిర్వహణ వీరి ప్రత్యేకమైన బాధ్యత. ప్రభుత్వ వైద్యశాలలు, శిశు సంక్షేమ కేంద్రాల నిర్వహణ అధికారం ఎంపీటీసీలకే కల్పించారు. -
ఆరు సూత్రాలతో...ఆదర్శ గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: ఆరు ప్రాథమిక సూత్రాల ప్రాధాన్యంగా పల్లెసీమలను ప్రణాళికాయుత పంచాయతీ పాలన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గంగదేవిపల్లి, అంకాపూర్...పంచాయతీలను మార్గదర్శనంగా చేసి ఆదర్శ గ్రామాల వైపు అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో ప్రతీ పంచాయతీని అభివృద్ధి చేసేలా పంచవర్ష ప్రణాళికలు తయారుచేసుకునే బాధ్యతను ఒక్కో పంచాయతీపై పెడుతున్నారు. దీనికి అనుగుణంగా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో అనేక అంశాలను జోడించ డంతో పాటు నియమ, నిబంధనలు పొందుపరిచారు. ప్రజలకు సేవలు అందించడం, విధుల నిర్వహణలో అధికారులు, ప్రజా ప్రతినిధుల జవాబు దారీతనం, పారదర్శకతతో వ్యవహరించేలా మార్పులు చేశారు. సర్పంచ్‌లకు ప్రాధాన్యత గల అంశాల్లో శిక్షణ ఇచ్చాక గ్రామాల అభివృద్ధి కార్యాచరణను అమల్లోకి తేనున్నారు. ప్రణాళికాబద్ధ అభివృద్ధి... గ్రామస్థాయిల్లో ప్రణాళికాబద్ధ అభివృద్ధి సాధనే ప్రభుత్వ ఉద్దేశం. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుమెంబర్లు, పంచాయతీ కార్యదర్శుల వరకు తమకు అప్పగించిన విధులు, బాధ్యతల సక్రమ నిర్వహణ ద్వారానే మార్పునకు నాంది పలకొచ్చునని భావిస్తోంది. గ్రామాల పరిసరాలు, ప్రభు త్వ సంస్థలు, కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించడం వంటి కార్యక్రమాల ద్వారా పారిశుధ్యం నిర్వహణ, పచ్చదనం పెంపునకు ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు, ఏటా కనీసం 40 వేల మొక్కలునాటి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం. వీధిదీపాల నిర్వహణ, శ్మశాన వాటికల నిర్మాణం, అన్ని రకాల పన్నులు పూర్తిస్థాయిలో వసూలు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తయారుచేసే దిశలో పంచాయతీ కోసం ప్రణాళికను రూపొందించుకునేలా చేయడం. పంచాయతీ పరిధిలో పనిచేసే ప్రతీ ఉద్యోగి సదరు పంచాయతీ అధీనంలోనే పనిచేసేలా ఏర్పాటు. ప్రతీ రెండునెలలకు ఒకసారి గ్రామసభను జరిపి గతంలో చేపట్టిన, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనుల సమీక్ష. బడ్జెట్ సంబంధిత ఏర్పాట్లు, వెచ్చించే వ్యయ ప్రణాళిక, తదితరాలకు అంశాల వారీగా నిధుల కేటాయిం పు వంటి వాటిపై చర్యలు తీసుకుంటారు. ఆదర్శ గ్రామానికి ఆరు సూత్రాలు... ఆదర్శ గ్రామంగా పరిగణించేందుకు ఆరు ముఖ్యమైన అంశాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి - గ్రామంలో పరిశుభ్రమైన పరిసరాలతో పాటు, పచ్చదనం వెల్లివిరియాలి - ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామమై ఉండాలి - చెత్త, ఇతర వ్యర్థ పదా ర్ధాల నుంచి కంపోస్ట్ తయారీ కోసం డంపింగ్ యార్డ్ కలిగి ఉండాలి - సక్రమమైన పద్ధతుల్లో కూరగాయల మార్కెట్ నిర్వహణ - తగిన వసతులు, సౌకర్యాలతో శ్మశానాల ఏర్పాటు - తప్పనిసరిగా క్రీడా మైదానం కలిగి ఉండాలి -
అక్రమ లేఅవుట్లపై సర్కార్ కొరడా
సాక్షి, హైదరాబాద్: అక్రమ లేఅవుట్లను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఈ మేరకు చట్టాన్ని కఠినతరం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల శివార్లలో వెలుస్తున్న అక్రమ లేఅవుట్లు, నిర్మాణాల వల్ల కోర్టు కేసులు, వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో చట్టంలో మార్పులు, చేర్పులు చేపట్టింది. గ్రామాల్లో అక్రమ లే అవుట్లకు, అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలికిన పక్షంలో మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అంశాన్ని నూతన పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం చేర్చింది. సంబంధిత గ్రామాల పరిధిలో అప్పటికే ఏర్పడిన లే అవుట్ల జాబితాలను కూడా పంచాయతీలు సిద్ధం చేసి ప్రకటించాల్సి ఉంటుంది. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టాక వెలిసే అక్రమ లే అవుట్లు, ఆక్రమణలు, నిర్మాణాలపై దృష్టి పెట్టే అవకాశం ఏర్పడింది. తదనుగుణంగా అక్రమ లేఅవుట్లు, తదితరాలపై కచ్చితమైన చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం పని సులువు కానుంది. నియంత్రణ చర్యలు.. వ్యవసాయ భూమిని సొంతదారు లేదా డెవలపర్ లేఅవుట్‌గా అభివృద్ధి చేసి భవనాల నిర్మాణం చేపట్టడానికి ముందే దీనికి సంబంధించి గ్రామపంచాయతీకి దరఖాస్తు(ఒక దరఖాస్తు ప్రతిని టెక్నికల్ శాంక్షన్ అథారిటీకి పంపించాలి) చేసుకోవాలి. వ్యవసాయేతర అవసరాల కోసం వ్యవసాయభూమిని మార్చుకున్నాకే ఈ దిశలో చర్యలు చేపట్టాలి. ఈ దరఖాస్తును సాంకేతిక మంజూరు కోసం ఏడురోజుల్లోగా టెక్నికల్ శాంక్షన్ కమిటీకి పంచాయతీ పంపించాలి. నిర్ణీత గడువులోగా ఇది జరగకపోతే శాంక్షన్ కమిటీకి ఈ ప్రతిపాదన ఫార్వర్డ్ అయినట్టుగా పరిగణిస్తారు. లేఅవుట్లో భాగంగా రోడ్ల ప్రణాళిక, మురుగుకాల్వలు, మంచినీరు, వీధిదీపాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఈ కమిటీ 30 రోజుల్లోగా భూమి సొంతదారు లేదా డెవలపర్‌కు తెలియజేస్తుంది. కామన్‌గా ఉండే స్థలాలు, రోడ్లను గ్రామపంచాయతీకి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. లే అవుట్ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అంశాలు పూర్తి చేసినట్టుగా సొంతదారు లేదా డెవలపర్ నుంచి లేఖ అందాక ప్రతిపాదిత లేఅవుట్‌ను శాంక్షన్ అథారిటీ పరిశీలిస్తుంది. అన్ని సరిగ్గా ఉంటే 30 రోజుల్లోగా తుది మంజూరునిస్తారు. నిబంధనలు పాటించకపోతే నెలరోజుల్లోగా సదరు దరఖాస్తును కమిటీ తిరస్కరిస్తుంది. ఈ మేరకు శాంక్షన్ అథారిటీæ నుంచి వర్తమానం అందాక వారం రోజుల్లోగా పంచాయతీ లేఅవుట్‌కు మంజూరునివ్వడమో లేదా దరఖాస్తు తిరస్కరిస్తున్నట్టు తెలియజేయడమో చేస్తుంది. శాంక్షన్ అథారిటీ అధికారి నిర్ణీత గడువులోగా మంజూరు చేయకపోతే అతడిపైనా క్రమశిక్షణా చర్య, జరిమానాతో పాటు పదోన్నతులు కల్పించకుండా చర్య తీసుకునే అవకాశాన్ని కొత్తచట్టంలో కల్పించారు. పంచాయతీ నుంచి మంజూరు లభించిన తేదీ నుంచి అన్ని లేఅవుట్లు రెండేళ్ల కాలపరిమితిలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆలోగా ఆ లే అవుట్‌ను పూర్తి చేయలేకపోతే అది రద్దవుతుంది. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు... కొత్తచట్టంలో భాగంగా పంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో కొత్త భవనాలు కట్టడం లేదా ఉన్న ఇంటికే మార్పు లు, చేర్పులు చేసేందుకు అవకాశం లేదు. మూడు వందల చదరపు మీటర్ల వరకు స్థలంలో పది మీటర్ల ఎత్తులో జీప్లస్ టు నివాస భవనాలకు మాత్రమే పంచాయతీ అనుమతినివ్వొచ్చు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా భవననిర్మాణ అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి ఈ దరఖాస్తును పరిశీలించి సర్టిఫికెట్ ఇచ్చాకే ఈ మంజూరు ఇస్తారు. చెల్లుబాటయ్యే అన్ని పత్రాలు సమర్పించినా పంచాయతీలు వారంలోగా మంజూరు ఇవ్వడంలో విఫలమైతే భవననిర్మాణానికి అనుమతినిచ్చినట్టుగా భావించేలా చట్టంలో ఏర్పాటు చేశారు. జీ ప్లస్ టు పరిమితులకు మించి నిర్మించే భవనాలకు టెక్నికల్ శాంక్షన్ అథారిటీ అనుమతినివ్వాల్సి ఉంటుంది. అక్రమ లే అవుట్లుగా గుర్తించిన వాటిని క్రమబద్ధీకరించే అధికారం అథారిటీకి ఉంది. -
ఉల్లంఘిస్తే ఉతుకుడే!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల్లో కొత్త పాలకమండళ్లు ఏర్పడిన నేపథ్యంలో గ్రామాల్లో నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం కార్యాచరణ ప్రణాళిక అమలుకు నడుం బిగించింది. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రజల రోజువారీ జీవనవిధానం, శైలిలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలోని చట్టాల్లో వివిధ అంశాలకు సంబంధించి నిబంధనలున్నా వాటిని పెద్దగా పట్టించుకున్న, కచ్చితంగా అమలుచేసిన సందర్భాలు తక్కువే. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ద్వారా తీసుకొచ్చిన వివిధ అంశాలను ఆచరణాత్మకంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. పరిసరాల పరిశుభ్రత కొనసాగేలా చూడటంతోపాటు వివిధ రూపాలు, చర్యల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడే వారినుంచి జరిమానా వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా వారిలో పరివర్తన తీసుకురావడంతో పాటు ఆయా నిబంధనలు పటిష్టంగా అమలుచేసే దిశగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంతో ఉంది. కొత్త చట్టంలోని అంశాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాక నియమ నిబంధనలు అమలు చేయడం మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉల్లంఘనులను ఉపేక్షించరు.. కొత్తగా నిర్దేశించిన నిబంధనలు కచ్చితంగా అమల్లోకి వస్తే పల్లెల్లో జరిమానాల మోత మోగనుంది. గ్రామాల పరిధిలో వివిధ అంశాలకు సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కొరడా ఝళిపించే అవకాశాలున్నాయి. గ్రామపంచాయతీలు రూపొందించిన నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తి నుంచి పంచాయతీ ఖరారు చేసిన మేర జరిమానా (రూ.ఐదు వేలు మించకుండా) వసూలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఉల్లంఘనలు అదే రీతిలో కొనసాగించిన పక్షంలో రోజుకు రూ.వంద చొప్పున జరిమానా విధిస్తారు. రోడ్లపై అశుద్ధం పారితే రూ. 5వేలు. ►పబ్లిక్ రోడ్లపై మురుగు, అశుద్ధం ప్రవహింపజేస్తే రూ.ఐదువేలు జరిమానా ►నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ మార్కెట్‌ను తెరిచి ఉంచితే రూ.ఐదు వేలు ►మురుగునీటి కాల్వ పూడ్చి, దానిపై అనధికార భవన నిర్మాణం చేపడితే రూ.2 వేలు ►ఆక్రమణలు తొలగించడంలో, మార్పుచేయడంలో విఫలమైతే రూ.రెండు వేలు ►రోడ్లపై, గ్రామ పంచాయతీ పరిధిలోని ఇతర చోట్ల అనుమతి లేకుండా మొక్కలు నాటితే రూ. 2 వేలు ►పంచాయతీ పరిధి, క్రమబద్ధీకరించిన భూమి లేదా పోరంబోకు భూమిలో చెట్లు అనుమతి లేకుండా నరికితే రూ. రెండు వేలు ►గ్రామపంచాయతీ ఆస్తులు ఆక్రమించుకున్నా లేదా అనధికారికంగా కలిగి ఉన్నా రూ.2 వేలు ►లైసెన్స్ లేకుండా లేదా ఇచ్చిన లైసెన్స్‌లకు విరుద్ధంగా రోడ్డును ఆనుకుని ఉన్న స్థలాన్ని వాహనాలు నిలిపి ఉంచే ప్రదేశంగా వాడుకుంటే రూ. 2వేలు ► లైసెన్స్ లేకుండా ఇచ్చిన లైసెన్స్‌లకు విరుద్ధంగా కొత్త ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినా, ప్రైవేట్ పార్కింగ్ స్థలాన్ని కొనసాగిస్తే రూ. 2వేలు ►వధశాలకు వెలుపల పశువులను వధించినా, చర్మం వలిచినా రూ. 2 వేలు ► రిజిస్ట్రేషన్ లేకుండా అనధికార శ్మశానాలు తెరవడం, శవాల ఖననం చేస్తే రూ.వెయ్యి ► తాగునీటి సరఫరా వనరుకు లేదా నివాస ప్రాంతాలకు 200 మీటర్ల పరిధిలో శవాల ఖననం, దహనం వంటివి చేస్తే రూ.వెయ్యి ►నిషేధిత స్థలంలో శవాలు పాతిపెట్టినా, దహనం చేసి, ఇతర పద్ధతులు పాటించినా రూ.వెయ్యి ►పబ్లిక్ రోడ్డుపై లేదా రోడ్డు మీదుగా అనధికారికంగా గోడ లేదా ఫెన్స్ నిర్మిస్తే రూ.వెయ్యి ►నీటిని వృథా చేయకుండా నిషేధిస్తూ ఇచ్చిన నోటీసును పట్టించుకోకపోతే రూ.500 ►తాగునీటికోసం ఏర్పాటుచేసిన స్థలంలో బట్టలు ఉతికితే రూ.500 ►తాగునీటి ఉపయోగం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో స్నానం, ఇతర చర్యలకు పాల్పడితే రూ.500 ►మంచినీటి ఉపయోగం కోసం ఏర్పాటు చేసిన చోట్ల హానికరమైన వస్తువులను ఉంచితే రూ.500 ►తాగునీరు, స్నానం చేయడానికి లేదా బట్టలు ఉతకడానికి ఏర్పాటు చేసిన స్థలంలో మురుగునీటిని, మురుగు కాల్వలు మొదలైన వాటిని అనుమతిస్తే రూ.500 జరిమానా విధించనున్నారు. -
ఒకే ఇంట్లో వారి పేర్లు వేర్వేరు వార్డుల్లోనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినంత మాత్రాన ఓటర్ల జాబితాకు పవిత్రత వచ్చినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులకు ఆస్కారం లేనప్పుడే ఆ జాబితాకు పవిత్రత చేకూరుతుం దని తేల్చి చెప్పింది. నల్లగొండ జిల్లా గుర్రంపోడు గ్రామంలో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న కుటుం బీకులను వేర్వేరు వార్డుల్లో ఓటర్లుగా చూపడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసులో ఎన్నికల కమిషన్ తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనట్లు కనిపిస్తోందని విమర్శించింది. గుర్రంపోడు గ్రామ ఓటర్ల జాబితాను సవరించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓటర్ల జాబితా సవరణ గడువులోగా సాధ్యం కాకపోతే గుర్రంపోడు ఎన్నికను రీ షెడ్యూల్ చేసి రెండో దశ లేదా మూడో దశలోనైనా సవరించిన జాబితా ఆధారంగా నిర్వహించాలని కమిషన్‌కు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ నిరాటం కంగా కొనసాగేందుకే ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటున్నామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
లే ఔట్లు, భవనాలపై సమగ్ర నివేదికివ్వండి
సాక్షి, హైదరాబాద్: నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రాక ముందు గ్రామాల పంచాయతీలు ఇచ్చిన లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చిన పలు అంశాలపై శుక్రవారం సచివాలయంలోని చాంబర్లో జూపల్లి సమీక్షించారు. హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పంచాయతీ వ్యవహారాలన్నీ ఆన్లైన్లో పొందుపర్చే దిశగా తీసుకున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటికే లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతులు, వ్యాపార, వాణిజ్య అనుమతులు వంటి వాటిని ఆన్లైన్లో పొందుపర్చడానికి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసినట్టుగా అధికారులు వివరించారు. గ్రామ పంచాయతీ ఆదాయానికి సంబంధించి దాదాపు 70 శాతం వరకు ఆన్లైన్లో పొందుపర్చేలా సాఫ్ట్వేర్ సిద్ధమైందని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయడంలో జరుగుతున్న జాప్యంపై జూపల్లి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 300 చదరపు అడుగులకన్నా ఎక్కువ స్థలంలో లేదా జీ ప్లస్ 2 కన్నా అదనంగా భవన నిర్మాణ అనుమతులన్నీ హెచ్ఎండీఏ లేదా డీటీసీఏ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, అధికారులతో జూపల్లి చర్చించారు. -
పండుగలా కొత్త పంచాయతీలు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల పాలన మరోసారి అధికారుల చేతుల్లోకి వెళ్తోంది. గడువులోగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు 1తో ముగుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వస్తాయి. అదే రోజు నుంచి అన్ని గ్రామ పంచాయతీలలో అధికారులకు పాలన వ్యవహారాలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లతో మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సర్పంచ్‌లకు ప్రత్యామ్నాయంగా అధికారులు పాలన అందించేలా కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీల పునర్విభజన జరిగింది. కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 8,684 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి పాలకవర్గాల పదవీకాలం ముగిసే రోజు నుంచే కొత్త గ్రామ పంచాయతీలు మనుగడలోకి వస్తాయి. కొత్త పంచాయతీల ఏర్పాటు, కొత్త పంచాయతీలకు అవసరమైన భవనాలు, ఇతర సామగ్రి, ప్రత్యేక అధికారుల పాలన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించింది. గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో... దీని కోసం చేసే ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు. ఈ మేరకు వికాస్‌రాజ్.. పంచాయతీరాజ్ కమిషనర్‌కు, అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ♦ ప్రస్తుత పంచాయతీల పదవీకాలం ఆగస్టు 1న ముగుస్తుంది. కొత్త పంచాయతీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదవుతుంది. కొత్త, పాత పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే ఏర్పాట్లను ముందుగానే చేయాలి. ♦ గ్రామ పంచా యతీలను కలిపి ఏర్పాటు చేసిన క్లస్టర్లను పునర్విభజన చేయాలి. కొత్త పంచాయతీల ఏర్పాటుతో వీటి పరిధి మారుతుంది. గ్రామ పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా క్లస్టర్లను పునర్విభజన జరపాలి. ♦ కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాలకు అవసరమైన భవనాలను గుర్తించి సిద్ధం చేయాలి. గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కొత్త వాటికి అనుగుణంగా విభజించాలి. స్వీపర్లు, వాచ్మెన్, ఎలక్ట్రీషియన్స్, బిల్ కలెక్టర్లు వంటి సిబ్బంది విభజన పూర్తి చేయాలి. ♦ ప్రస్తుత గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే వాటి పరిధి, జనాభాకు అనుగుణంగా ఆస్తుల పంపిణీ పూర్తి చేయాలి. డిమాండ్, రెవెన్యూ రిజిస్టర్లను పంపిణీ చేయాలి. అన్ని రకాల అధికార వ్యవహారాల పత్రాలను వేర్వేరు చేసి పంపిణీ జరపాలి. ♦ కొత్త పంచాయతీల ఏర్పాటును పండుగలా నిర్వహించాలి. విస్తృత ప్రచారం జరపాలి. డప్పు చాటింపు చేయాలి. కొత్త గ్రామ పంచాయతీల్లోని ప్రజలకు అభినందనలు తెలిపేలా బ్యానర్లు కట్టాలి. ♦ కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేయాలి. ‘గ్రామ పంచాయతీ కార్యాలయం’అని తెలుగులో బోర్డు పెట్టాలి. కొత్త గ్రామ పంచాయతీ పేరుతో అధికారిక స్టాంప్, సీల్, సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేయాలి. పాత, కొత్త గ్రామ పంచాయతీల పరిధిని తెలిపేలా భౌగోళిక చిత్రాలను సూచించేలా బోర్డులను రూపొందించాలి. ♦ గ్రామ పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి నిర్దేశించిన రోజున కచ్చితంగా బాధ్యతలు తీసుకోవాలి. కొత్త గ్రామపంచాయతీ పేరుతో ప్రత్యేక అధికారులు కొత్తగా బ్యాంకు అకౌంట్ ప్రారంభించాలి. గ్రామపంచాయతీలో అవసరమైన అన్ని రకాల మౌలిక సేవల ప్రక్రియను పర్యవేక్షించాలి. రోజువారీ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సామాజిక పింఛన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను, స్థానిక అవసరాలను తీర్చేలా ప్రత్యేక అధికారులు పని చేయాలి. -
చట్ట ప్రకారమే పంచాయతీ రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రాజ్ చట్టం ప్రకారమే గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రిజర్వేషన్ల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. హైకోర్టులో సోమవారం దీనిపై విచారణ జరుగుతుందని, ఆదేశాలు వస్తాయని అధికారులు భావించారు. వివిధ కారణాల వల్ల ఈ పిటిషన్ బెంచ్ మీదకు రాలేదని అధి కారులు వెల్లడించారు. రాజ్యాంగం నిర్దేశించిన నిబంధనల మేరకే రిజర్వేషన్లున్నాయని అఫిడవిట్లో నివేదించారు. ఎస్సీలకు 20.46 శాతంతో 2,070 పంచాయతీలను అధికారు లు కేటాయించారు ఎస్టీలకు 5,73 శాతంతో 580 గ్రామ పంచాయతీలు రిజర్వయ్యాయి, 100 శాతం షెడ్యూల్డు తెగలున్న 2,637 పంచాయతీలను ఎస్టీ లకే కేటాయించారు. బీసీలకు 34 శాతంతో 3,440 గ్రామ పంచాయతీలను కేటాయించారు. జనరల్ కేటగిరీలో 4,027 గ్రామ పంచాయతీలున్నాయి, వీటిపైనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ జరగలేదు. మంగళవారం దీనిపై విచారణ జరుగుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి, హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చేదాకా రిజర్వేషన్ల ప్రక్రియపై అస్పష్టత కొనసాగనుంది. -
కోర్టుకెళితే చట్టం నిలవదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం కోర్టులో నిలబడదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ చట్టంపై చర్చించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరినీ సభ నుంచి సస్పెండ్ చేయడంతో పంచాయతీరాజ్ చట్టంపై చర్చ జరగలేదన్నారు. ఈ చట్టాన్ని చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్నైనా ఏర్పాటు చేసి, అందులో వచ్చిన అభిప్రాయాల మేర కు చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. తమ ఎమ్మెల్యేల బహిష్కరణ విషయంలో గతంలోనే హైకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిందన్న ఆయన తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను కొట్టివేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును అమలు చేసేలా అసెంబ్లీ కార్యదర్శి చొరవ తీసుకోవాలని, లేదంటే కోర్టు ధిక్కారం కింద మళ్లీ కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తాం... కాంగ్రెస్ పార్టీ పదులసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, నాలుగేండ్లు అధికారంలో లేనంత మాత్రా న తమకేమీ ఆదుర్దా లేదని, తాము మళ్లీ అధికారంలోకి వస్తామని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో విభేదాలు సహజమని, చిన్న, చిన్న అభిప్రాయభేదాలున్నా అందరం కలసికట్టుగా పనిచేస్తా మని చెప్పారు. సీఎం అయ్యే అర్హత ఉన్నవారిలో తాను ముందుంటానని చెప్పానే తప్ప తానే సీఎం అవుతానని ఎప్పుడూ చెప్పలేదని, ఎవరు సీఎం అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. -
పంచాయతీ రిజర్వేషన్లు మొదటికి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త రాష్ట్రం కావడం, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రావడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ మొదటికి రానుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. 1995లో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల విధానం అమల్లోకి వచ్చింది. జనాభా ఆధారంగా మండలం యూనిట్‌గా ఈ రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. జనరల్, జనరల్ మహిళ,బీసీ, బీసీ మహిళ, ఎస్సీ, ఎస్టీతోపాటు ఎస్సీ, ఎస్టీ మహిళా కేటగిరీలు ఉంటాయి. రొటేషన్ పద్ధతిలో అన్ని కేటగిరీలు వర్తింపజేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995, 2001, 2006, 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అన్ని గ్రామాలకు నాలుగు రకాల రిజర్వేషన్లు వర్తింపజేశారు. మిగతా నాలుగు కేటగిరీలను వంతుల వారీగా అమలు చేయాల్సి ఉంది. కొత్త రాష్ట్రం కావడంతో గ్రామాల్లో ఇప్పటికే అమలైన రిజర్వేషన్లు మళ్లీ ఖరారయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఖరారయ్యే రిజర్వేషన్ కేటగిరీలు వరుసగా రెండు ఎన్నికలకు వర్తిస్తాయి. జూన్ నుంచి ఖరారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ జూన్ మొదటి వారంలో మొదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పన జరుగుతోంది. మే 17న ఓటర్ల తుది జాబితాను అన్ని పంచాయతీలలో ప్రదర్శించనున్నారు. అనంతరం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా బీసీ ఓటర్ల గణన జరగనుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మే 18 నుంచి ఇది మొదలై రెండు వారాలపాటు కొనసాగనుంది. జూన్ 3 కల్లా పూర్తయ్యే అకాశం ఉంది. అనంతరం వారం రోజుల పాటు గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. రిజర్వేషన్లు ఖరారు చేసిన జాబితాను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తుంది. ఎన్నికల సంఘం పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. -
గిరిజనులకు పదవుల పంట...!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల పునర్విభజన ప్రక్రియ గిరిజనుల రాజకీయ భవిష్యత్తును తిరగరాసింది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. గిరిజనుల రాజకీయ అవకాశాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకున్న ఎస్టీ సర్పంచుల సంఖ్య ఏకంగా డబుల్ కానుంది. పంచాయతీల పునర్విభజనకు ముందు రాష్ట్రంలో 1,308 గిరిజన గ్రామ పంచాయతీలున్నాయి. ఐదువందల జనాభా కంటే ఎక్కువున్న గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా పునర్విభజన చేపట్టిన యంత్రాంగం... కొత్తగా 1,327 తండాలకు గ్రామ పంచాయతీ హోదా ఇచ్చింది. 5వందల జనాభాను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ... తండాల మధ్య దూరం, మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు కొన్నిచోట్ల అంతకు తక్కువ జనాభా ఉన్న వాటిని కూడా పంచాయతీలుగా మార్చారు. కొన్నిచోట్ల జనాభా 700 నుంచి 900 వరకు ఉన్నప్పటికీ ఒకే పంచాయతీగా ఖరారు చేశారు. దీంతో రాష్ట్రంలో గిరిజన గ్రామ పంచాయతీల సంఖ్య 2,635కు చేరగా... సర్పంచుల సంఖ్య ఈ మేరకు పెరగనుంది. గిరిజన సర్పంచులు రెండు వేలు... ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గిరిజనుల నాయకత్వ పెరుగుదలకు మార్గం సుగమమైంది. నూరుశాతం ఎస్టీలున్న గ్రామ పంచాయతీల సర్పంచ్‌లుగా ఎస్టీలనే నియమించాలని ప్రభుత్వం చట్టంలో స్పష్టం చేసింది. గతంలో 1,308 గ్రామ పంచాయతీల్లో 627 పంచాయతీల్లోనే గిరిజన సర్పంచులుఉన్నారు. తాజాగా పంచాయతీల సంఖ్య 2,635కు పెరగగా ఇందులో 1,320 పంచాయతీల్లో నూరుశాతం జనాభా గిరిజనులే. దీంతో ఈ పంచాయతీలన్నీ గిరిజనుల పాలనలోకి వెళ్లనున్నాయి. ఇక్కడ సర్పంచ్ పదవులతో పాటు వార్డు సభ్యుల పదవులు కూడా ఎస్టీలకే దక్కనున్నాయి. అదేవిధంగా మిగిలిన 1,315 పంచాయతీల్లో రొటేషన్ పద్ధతిన గిరిజనులకు సర్పంచ్ అవకాశం దొరుకుతుంది. వీటిలో సగానికి పైగా పంచాయతీలు ఎస్టీలకే రిజర్వ్ కానున్నాయి. మొత్తంగా గిరిజన సర్పంచుల సంఖ్య రాష్ట్రంలో రెండు వేలకు పెరగనుంది. ఆ పంచాయతీలకు అదనపు నిధులు నూరుశాతం గిరిజన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వనుంది. ఒక్కో గ్రామ పంచాయతీకి 3 నుంచి 5 లక్షల రూపాయలు ప్రత్యేక కోటాలో మంజూరు చేయనుంది. ఈ నిధులను ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా పూర్తిగా పాలకవర్గం తీర్మానంతో ఖర్చు చేసే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల అనంతరం పాలక వర్గాలు ఏర్పాటయ్యాక ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
సమయానికే ‘స్థానికం’!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలను గడువు లోపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి కీలక ప్రక్రియను మొదలుపెట్టింది. ఓటర్ల జాబితా విషయంలో కచ్చితమైన తేదీలను ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. మే 17న అన్ని గ్రామాల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. వార్డుల వారీగా జాబితాలు ఉండాలని, అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన తాజా ఓటర్ల జాబితా ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా ముసాయిదాను ఏప్రిల్ 30 లోపు.. అభ్యంతరాలు, విజ్ఞప్తుల ప్రక్రియను మే 10లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 25 కాపీలు తప్పనిసరి సమగ్రంగా రూపొందించిన ఓటర్ల జాబితా ప్రచురణ బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారులు చేపడతారు. పంచాయతీ ఓటర్ల జాబితాను 25 కాపీలను తయారు చేస్తారు. గ్రామంలో సమాచారం కోసం నాలుగు కాపీలు ఇవ్వాలి. ఈ నాలుగు కాపీల్లో పంచాయతీ నోటీసు బోర్డులో ఒకటి, గ్రామంలోని మూడు ముఖ్యమైన ప్రదేశాల్లో మిగతావి ప్రదర్శించాల్సి ఉంటుంది. మండల ప్రజా పరిషత్‌కు ఒకటి, డీపీవో కార్యాలయానికి ఒకటి ఇస్తారు. గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున ఇస్తారు. మిగతా కాపీలను రిజర్వులో పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఓటర్ల జాబితాలను ఆయా కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో పెడతారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వెబ్సైట్లోనూ ఓటర్ల జాబితాను పొందుపరుస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా గడువు లోపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మూడు ఎన్నికలకు అనుగుణంగా ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది. పంచాయతీ ఎన్నికలకు అవసరమైన రీతితో ఓటర్ల జాబితాను రూపొందిస్తూ అవసరమైన పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేయాలని అధికారులకు సూచించింది. గ్రామ పంచాయతీలో వార్డుకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, మండల ప్రజా పరిషత్, జెడ్పీటీసీ, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ఉండాలని పేర్కొన్నారు. అన్ని స్థానిక సంస్థల ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారులకు అప్పగించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, ఈవో (పీఆర్ఆర్డీ)లు ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఈ విధులు నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. మరోవైపు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పన నమూనాను ఇప్పటికే జిల్లాలకు పంపించారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పంచాయతీల సంఖ్య, ఫొటోతోపాటు ఓటరు వివరాలను పేర్కొనాలని ఆదేశించారు. ఎలక్ట్రోరల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఆర్‌ఎంఎస్) ఉపయోగించి ఓటర్ల స్లిప్పులను ఫొటోలు లేకుండా, ఫొటోలు ఉండేలా రెండు రకాలుగా తయారు చేయాలని పేర్కొన్నారు. -
కొత్త ‘పంచాయితీ’ చట్టం
సాక్షి, హైదరాబాద్: గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పంచాయతీరాజ్ చట్టంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీలకు కొత్తగా అధికారాలివ్వడం పక్కనబెట్టి.. పాలక వర్గాలు, కార్యనిర్వాహక సిబ్బందిని కట్టడి చేయడానికే చట్టంలో ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులు, అవసరాలను పట్టించుకోకుండా కొత్త చట్టం రూపొందించారని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. కొత్త చట్టంలోని కొన్ని లోపాలపై ఉన్నతాధికారులకు వివరిస్తే.. ‘అవునా.. అలా ఉందా? అదెలా సాధ్యం’ అంటున్నారని చెబుతున్నారు. కొత్త చట్టం అమలు కోసం ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. దీనికి ముందు చట్టంలోని అంశాల ఆధారంగా నిబంధనలు రూపొందించి ఫలానా తేదీ నుంచి చట్టం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులిస్తారు. దీనికి ముందే ఆ లోపాలు సరి చేయాలని ప్రభుత్వాన్ని కార్యదర్శులు కోరుతున్నారు. ఇదెక్కడి ‘లెక్క’ సరైన సమయంలో పంచాయతీ లెక్కలు ఆడిట్ చేయించడంలో విఫలమైతే సర్పంచ్, గ్రామకార్యదర్శిని పదవి నుంచి తొలగించినట్లు భావించవచ్చని చట్టంలోని సెక్షన్–34లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత చట్ట ప్రకారం కార్యదర్శి, సర్పంచ్‌కి కలిపి చెక్ పవర్ ఉండగా.. కొత్త చట్టం ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సంయుక్తంగా ఉంది. కాబట్టి చెక్ పవర్ బాధ్యత లేని గ్రామకార్యదర్శిని బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పంచాయతీ తీర్మానాలకు గ్రామ కార్యదర్శులే బాధ్యత వహించాలని సెక్షన్ 43(4) పొందుపరిచారు. ఆ తీర్మానాల్లో ఎక్కువగా నిధులకు సంబంధించిన అంశాలే ఉంటాయి. కొత్త పనులకు నిధులు అవసరమవుతాయి. ఎక్కువ గ్రామాల్లో పనులకు సరిపడా నిధులుండవు. ఇలాంటి సందర్భాల్లో పంచాయతీ తీర్మానాల బాధ్యత కార్యదర్శిదే అంటే ఇబ్బందేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘రోజ్నాంచ’ ఇప్పుడెలా..? పంచాయతీకి వచ్చే కొత్తవారు, విశేష సంఘటనలను రోజూ ‘రోజ్నాంచ’లో నమోదు చేయాలని సెక్షన్ 43(5)(1)లో పేర్కొన్నారు. రోజ్నాంచ నమోదు రెవెన్యూ శాఖ వ్యవహారం. అది వీఆర్వో (పట్వారీ) ఆధ్వర్యంలో జరుగుతోంది. రవాణా వ్యవస్థ పెద్దగా లేని రోజుల్లో, తక్కువ జనాభా ఉన్నప్పుడు రోజ్నాంచ మొదలైంది. ఇప్పుడు వాహనాల సంఖ్య పెరిగింది. ప్రస్తుత సందర్భాల్లో ప్రతి వాహనాన్ని నిలిపి వివరాలు నమోదు చేయడం సాధ్యమవదు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి బాధ్యత ల్లో చేర్చడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు. అలాగే పంచాయతీ ఆదాయ, ఖర్చుల వివరాలను లెక్కల పుస్తకంలో గ్రామ కార్యదర్శి పొందుపరచాలని సెక్షన్ 43(5) (10)లో పేర్కొన్నారు. అయితే ఖర్చుల వ్యవహారం చెక్ పవర్ ఉండే సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆదా య, ఖర్చు వివరాల నిర్వహణ కార్యదర్శికి ఉండటం సరికాదనే అభిప్రాయం ఉంది. 100 శాతం పన్నులెలా సాధ్యం..? సెక్షన్ 43(5)(14) ప్రకారం పన్నులు, పన్నేతర ఆదాయాన్ని వసూలు చేసే బాధ్యత కార్యదర్శిపైనే ఉంటుంది. పంచాయతీ సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులకు అవసరమైన డిమాండ్‌ను కార్యదర్శి రూపొం దించి ఆ డిమాండ్ ఆమోదం పొందిన 3 నెలల్లో సరిపడా మొత్తాన్ని వసూలు చేయాలి. లేదంటే కార్యదర్శిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పేద కుటుంబాలను పన్ను వసూలు కోసం ఒత్తిడి చేయలేరు. కాబట్టి 100 శాతం పన్నుల వసూలు అనేది వాస్తవంగా సాధ్యం కాదు. అలాగే పంచాయతీ జారీ చేసిన నిర్ణయాలపై మరుసటి రోజే కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయాలని సెక్షన్ 43(12)లో పేర్కొన్నారు. అయితే ఒకేరోజు అమలు.. వాస్తవ పరిస్థితుల్లో సాధ్యం కాదని కార్యదర్శ లు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా ప్రతినిధుల పర్యటనలు, వ్యక్తిగత సెల వుల రోజుల విషయంలో నిబంధన మార్చాల ని కోరుతున్నారు. ఫీజులు, బెటర్మెంట్ చార్జీ ల విషయంలో పంచాయతీ తీసుకునే నిర్ణయా న్ని ఒకేరోజులో అమలు చేయడం కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుంది. వారిని వదిలేసి మాపైనా..? సెక్షన్ 43(6)(4) ప్రకారం గ్రామకార్యదర్శి.. గ్రామంలో నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చూడాలి. లేదంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో గ్రామకార్యదర్శికి సగటున 3 గ్రామాల బాధ్యతలిచ్చారు. ఉపాధి హామీ పథకం సిబ్బంది మొక్కల పెంపకం విధుల్లోనే ఉంటారు. అటవీ శాఖలో సామాజిక అడవుల పెంపకం విభాగం ఉంటుంది. ఈ రెండు విభాగాల సిబ్బందిని మినహాయించి కార్యదర్శులనే బాధ్యులు చేయడం సరికాదనే అభిప్రాయం ఉంది. అలాగే సెక్షన్ 43(6)(2) ప్రకారం.. ‘ప్రతి గృహ యజమానికి కనీసం 6 మొక్కలను పంచాయతీ కార్యదర్శి సరఫరా చేయాలి. మొక్కల సంరక్షణలో యజమాని విఫలమైతే అతని ఆస్తి పన్నుకు సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధించాలి’ అని పేర్కొన్నారు. ఇంటి ఆవరణలోని మొక్కల విషయంలో జరిమానా విధింపు, వసూలంటే వివాదాలకు కారణమవొచ్చు. ప్రభుత్వం పరిశీలించాలి బంగారు తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని స్వాగతిస్తున్నాం. పంచాయతీలకు ఈ చట్టం ఎంతో మేలు చేస్తుంది. అయితే గ్రామ కార్యదర్శుల బాధ్యతల విషయంలో చట్టంలో పేర్కొన్న అంశాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఉద్యోగ భద్రత పరంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. – ఎస్.భాస్కర్‌రెడ్డి, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు